100 మందికిపైగా పాక్ సైనికులను చంపేశాం: బలూచ్ ఆర్మీ సంచలన ప్రకటన

ABN , First Publish Date - 2022-02-03T22:38:56+05:30 IST

ఉగ్రవాద సంస్థ బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ సంచలన ప్రకటన చేసింది. పాకిస్థాన్ మిలిటరీ క్యాంపుల్లోని 100 మందికి

100 మందికిపైగా పాక్ సైనికులను చంపేశాం: బలూచ్ ఆర్మీ సంచలన ప్రకటన

బలూచిస్థాన్: ఉగ్రవాద సంస్థ బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ సంచలన ప్రకటన చేసింది. పాకిస్థాన్ మిలిటరీ క్యాంపుల్లోని 100 మందికిపైగా సైనికులను హతమార్చినట్టు తెలిపింది. ఈ మేరకు నేడు (గురువారం) ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది. పాకిస్థాన్‌లోని పంజ్‌గుర్, నుష్కీ మిలిటరీ క్యాంపులు ప్రస్తుతం తమ నియంత్రణలో ఉన్నట్టు తెలిపింది. చాలా వరకు శిబిరాలను ధ్వంసం చేసినట్టు పేర్కొంది. ఈ విషయం వెలుగు చూడకుండా ఉండేందుకు పాక్ తన మీడియాను నిషేధించిందని, టెలికమ్యూనికేషన్ వ్యవస్థలను నిలిపివేసిందని ఆరోపించింది.


బలూచ్ లిబరేషన్ ఆర్మీ చేసిన ఈ ప్రకటనను పాకిస్థాన్ మిలిటరీ కొట్టిపడేసింది. బలూచిస్థాన్‌లోని రెండు మిలిటరీ శిబిరాలపై దాడి జరిగిన మాట వాస్తవమేనని, ఇరు వర్గాల మధ్య భీకర కాల్పులు చోటు చేసుకున్నట్టు పేర్కొంది. ఈ ఘటనలో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారని, ఓ సైనికుడు మరణించాడని తెలిపింది. పాకిస్థాన్ ఇంటర్ సర్వీస్ పబ్లిక్ రిలేషన్స్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేసింది. రెండు దాడులను తిప్పికొట్టామని, ఉగ్రవాదుల వైపు భారీ నష్టం జరిగిందని పేర్కొంది. అయితే, పాక్ మిలిటరీ ప్రకటనకు బలూచిస్థాన్ ఆర్మీ ప్రకటన పూర్తి విరుద్ధంగా ఉండడం గమనార్హం. 

 

Updated Date - 2022-02-03T22:38:56+05:30 IST