రెండు నెలలుగా జీతం కట్.. కారణం అడిగితే ‘నువ్వు చనిపోయావుగా’ అంటూ..

ABN , First Publish Date - 2021-12-03T06:26:24+05:30 IST

వినడానికి వింతగానే ఉన్నా... ఇది నిజం. బతికున్న వ్యక్తిని చంపేశారు. ఒక వ్యక్తి చనిపోతే ఇద్దరు మృతి చెందినట్లు నివేదిక సృష్టించారు.

రెండు నెలలుగా జీతం కట్.. కారణం అడిగితే ‘నువ్వు చనిపోయావుగా’ అంటూ..
నువ్వు చనిపోయావు కదా అన్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్న కార్మికుడు కె.నారాయణ

ఒకవ్యక్తి చనిపోతే ఇద్దరు 

మృతి చెందినట్లు నివేదిక..

రెండు నెలలుగా జీతం బంద్‌..

నగరపాలక సంస్థ ఔట్‌సోర్సింగ్‌ 

కార్మికుడి విషయంలో చోద్యం

పబ్లిక్‌హెల్త్‌ సెక్షనే కీలకం..

సర్కిల్‌ ఇనస్పెక్టర్‌ అలా ఎలా ఇచ్చాడు...?

యూనియన్ నాయకులు నిలదీయడంతో వెలుగులోకి..

అనంతపురం కార్పొరేషన్, డిసెంబరు 2: వినడానికి వింతగానే ఉన్నా... ఇది నిజం. బతికున్న వ్యక్తిని చంపేశారు. ఒక వ్యక్తి చనిపోతే ఇద్దరు మృతి చెందినట్లు నివేదిక సృష్టించారు. పనిచేసే కార్మికుడికి రెండు నెలలుగా జీతాలు బంద్‌ చేయడంతో ఈ చోద్యం వెలుగులోకి వచ్చింది. అనంతపురం నగరపాలక సంస్థలోని పబ్లిక్‌హెల్త్‌ (పీహెచ) విభాగంలో పనిచేసే ఓ ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగి విషయంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. కార్పొరేషన పారిశుధ్య విభాగంలో ఆరు సర్కిళ్లున్నాయి. అందులో నాలుగో సర్కిల్‌లో పనిచేసే ఎస్‌. నారాయణ అనే కార్మికుడు ఈ ఏడాది సెప్టెంబరు 23వ తేదీన అనారోగ్యంతో మృతి చెందాడు. అదే సర్కిల్‌లో కె.నారాయణ అనే కార్మికుడు కూడా పనిచేస్తున్నాడు. అక్టోబరు నెలలో కె.నారాయణకు జీతం పడలేదు. తనకు జీతం ఎందుకు రాలేదో తెలియక ఆందోళన చెందాడు. ఎవరిని అడిగినా స్పందన లేకపోవడంతో మౌనంగా ఉండిపోయాడు. డిసెంబరు 1వ తేదీ కూడా నవంబరు నెలకు సంబంధించిన జీతం రాలేదు. ఇద్దరు నారాయణలకు కూడా జీతం నిలిపేశారు. రెండు నెలల జీతం తనకెందుకివ్వడం లేదంటూ సంబంధిత పబ్లిక్‌హెల్త్‌ సూపరింటెండెంట్‌ దేవశంకర్‌ను అడిగితే... నువ్వు లేవు కదా... చనిపోయావు కదా.. అనడంతో కన్నీటి పర్యంతమయ్యాడు. దీంతో వెంటనే యూనియన నాయకులను సంపద్రించాడు. గురువారం మున్సిపల్‌ యూనియన జిల్లా ప్రధాన కార్యదర్శి నాగభూషణం, నగరాధ్యక్షుడు ఏటీఎం నాగరాజు సంబంధిత సూపరింటెండెంట్‌ను నిలదీయడంతో అసలు విషయం బయటపడింది.


కీలకమంతా  హెల్త్‌ సెక్షనలోనే....

పారిశుధ్య విభాగంలో పనిచేసే రెగ్యులర్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల జీతభత్యాలు, ఉ ద్యోగ విరమణ తరువాత సంక్రమించాల్సిన వ్యవహారాలన్నీ  పబ్లిక్‌ హెల్త్‌ విభాగ సిబ్బందే పర్యవేక్షిస్తారు. అక్కడ కీలకంగా పనిచేసే సూపరింటెండెంట్‌ దేవశంకర్‌, సీనియర్‌ అసిస్టెంట్‌ సునీల్‌, కంప్యూటర్‌ ఆపరేటర్‌ హర్షకు తెలియకుండా ఏమీ జరగదనే మున్సిపల్‌ యూనియన వర్గాలు ఆరోపిస్తున్నాయి. మూడేళ్లుగా ఆ విభాగంలోనే ఉన్నారు. ఎస్‌.నారాయణ చనిపోతే కె.నారాయణ కూడా చనిపోయినట్లు ఎ లా నిర్థారించారనేది మిలియన డాలర్ల ప్రశ్న. ఓ ఉద్యోగికి జీతభత్యాలు రావడానికి ఎన్నో డాక్యుమెంట్లు తెప్పించుకోవడంతో నెలల కొద్దీ ఆలస్యం చేసే ఆ విభాగ సిబ్బంది... ఒక వ్యక్తి చనిపోతే మరొకరు కూడా చనిపోయినట్లు ఎలా ఆమోదించారనేది అంతుబట్టని విష యం. ఆప్కో్‌సలో ఎంటర్‌ చేసి, నమోదు చేయడంలో ఆపరేటర్‌, సీనియర్‌ అసిస్టెంట్లే పనిచేసినట్లు యూనియన నాయకులు ఆరోపిస్తున్నారు. ఆపై సంతకం సూపరింటెండెంట్‌దే. కె.నారాయణ మరణ ధృవీకరణ పత్రం కూడా చూడకుండానే ఎలా జీతాలు నిలిపేశారని వారు ప్రశ్నిస్తున్నారు. కె.నారాయణ పనిచేసిన అక్టోబరు, నవంబరు నెలల్లో రిజిస్టర్‌ పుస్తకాల్లో సంతకాలు చేశాడు. అయినా జీతం రాకుండా ఆప్కో్‌సలో నమోదు చేశారంటే అధికారులు ఎలా పనిచేస్తున్నారో అర్థమవుతుంది. ఈ విషయంపై యూనియన నాయకులు.. నగర కమిషనర్‌ పీవీవీఎస్‌ మూర్తి, ఇనచార్జ్‌ ఎంహెచఓ సంగం శ్రీనివాసులు దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. బాధ్యులను వెంటనే సస్పెండ్‌ చేయాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - 2021-12-03T06:26:24+05:30 IST