Kim Jong Un : కరోనా సమయంలో కిమ్ జాంగ్ ఉన్‌కి తీవ్ర జ్వరం.. దక్షిణకొరియా అధికారులకు వార్నింగ్.. కారణం ఇదే..

ABN , First Publish Date - 2022-08-11T22:42:54+05:30 IST

ఇటివల కొవిడ్ వేవ్‌(covid wave) సమయంలో ఉత్తరకొరియా(North Korea) అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్(Kim jong Un) తీవ్ర జ్వరంతో బాధపడ్డారని ఆయన సోదరి కిమ్ యో జోంగ్ వెల్లడించారు.

Kim Jong Un : కరోనా సమయంలో కిమ్ జాంగ్ ఉన్‌కి తీవ్ర జ్వరం.. దక్షిణకొరియా అధికారులకు వార్నింగ్.. కారణం ఇదే..

ప్యాంగ్‌యాంగ్: ఇటివల కొవిడ్ వేవ్‌(covid wave) సమయంలో ఉత్తరకొరియా(North Korea) అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్(Kim jong Un) తీవ్ర జ్వరంతో బాధపడ్డారని ఆయన సోదరి కిమ్ యో జోంగ్(Kim Yo jong) తెలిపారు. పలు అనారోగ్య సమస్యలను ఎదుర్కొన్నారని ఆమె తెలిపారు. అయితే.. అలాంటి పరిస్థితుల్లోనూ దేశ ప్రజల కోసం క్షణం తీరిక లేకుండా కిమ్  శ్రమించారని అన్నయ్యను ఆమె ప్రశంసించారు. దేశం కోసం నిర్విరామంగా పనిచేశారని కితాబిచ్చారు. అయితే కిమ్ ఎప్పుడు అనారోగ్యానికి గురయ్యారనే సమయాన్ని ఆమె తెలపలేదు.


మరోవైపు ఉత్తరకొరియాలో కరోనా మహమ్మారి వ్యాప్తికి దక్షిణకొరియానే(South Korea) కారణమని కిమ్ యో జోంగ్ నిందించారు. కరపత్రాల ద్వారా తమ దేశంలోకి వైరస్‌ను  ప్రవేశపెట్టారని, బెలూన్ల సాయంతో కరపత్రాలను తమవైపు జారవిడిచారని ఆమె అన్నారు. దక్షిణకొరియా కీలుబొమ్మలే(అధికారులు) రోత పదార్థాలను సరిహద్దు వెంట పడేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ తరహా వ్యాప్తిని ఇకనైనా ఆపకపోతే దక్షిణకొరియా అధికారుల అంతుచూస్తామని ఆమె తీవ్రంగా హెచ్చరించారు. ఈ మేరకు ఉత్తరకొరియా అధికార  వార్త సంస్థ కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది.


కాగా కిమ్ జాంగ్ ఉన్ ఆరోగ్య పరిస్థితిపై ఆ దేశం ప్రభుత్వం ప్రకటన చేయడం చాలా అరుదు. గతంలో ఇలాంటి సందర్భాలు చాలా చాలా తక్కువగా ఉన్నాయి. స్థూలకాయత్వంతోపాటు ధూమపానం అలవాటున్న కిమ్ జాంగ్ ఉన్‌ ఆరోగ్యంపై గత కొన్నేళ్లుగా వదంతులు వస్తూనే ఉన్నాయి. కిమ్ కుటుంబ సభ్యులకు గుండె జబ్బుల  చరిత్ర కూడా ఉండడం ఊహాగానాలకు బలం చేకూరుతోంది. ఈ కారణంగానే బహిరంగ ప్రదేశాల్లోకి కిమ్ రాకను అంతా నిశితంగా గమనిస్తుంటారు. ఇదిలావుండగా కిమ్ జాంగ్ ఉన్ గత నెలలో దాదాపు 17 రోజులపాటు బాహ్య ప్రపంచానికి కనిపించలేదని ఉత్తరకొరియా అధికార మీడియా పేర్కొంది. అయితే వేసవికాలం కావడంతో సముద్ర తీర భవనంలోకి వేసవి విడిదికి వెళ్లారని పేర్కొన్న విషయం తెలిసిందే.

Updated Date - 2022-08-11T22:42:54+05:30 IST