ఊపిరితిత్తుల ట్రాన్స్‌ప్లాంటేషన్‌లో ‘కిమ్స్‌’ రికార్డు

ABN , First Publish Date - 2021-04-20T07:42:03+05:30 IST

కొవిడ్‌ బాధితులకు ఊపిరితిత్తులు, గుండె ట్రాన్స్‌ప్లాంటేషన్‌లో కిమ్స్‌ ఆస్పత్రి రికార్డు సాధించింది.

ఊపిరితిత్తుల ట్రాన్స్‌ప్లాంటేషన్‌లో ‘కిమ్స్‌’ రికార్డు
ఊపిరితిత్తులు, గుండె ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చేసిన వైద్య బృందం

ఎనిమిది నెలల్లో 50 ఊపిరితిత్తులు, గుండె ట్రాన్స్‌ప్లాంటేషన్లు చేసిన వైద్యులు

హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 19 (ఆంధ్రజ్యోతి): కొవిడ్‌ బాధితులకు ఊపిరితిత్తులు, గుండె ట్రాన్స్‌ప్లాంటేషన్‌లో కిమ్స్‌ ఆస్పత్రి రికార్డు సాధించింది. గత ఏడాది సెప్టెంబర్‌ నుంచి ఈ ఏడాది ఏప్రిల్‌ వరకు 12 మంది కొవిడ్‌ రోగులకు రెండు ఊపిరితిత్తుల ట్రాన్స్‌ప్లాంటేషన్లతో కలిపి మొత్తం 50 ఊపిరితిత్తులు, గుండె ట్రాన్స్‌ప్లాంటేషన్లను విజయవంతంగా పూర్తి చేసింది. ఇంత తక్కువ వ్యవధిలో కొవిడ్‌ బాధితులకు ఇన్ని ట్రాన్స్‌ప్లాంటేషన్లు చేయడం ఆసియా ఖండం మొత్తంలో రికార్డని ఆస్పత్రి యాజమాన్యం తెలిపింది. జమ్మూ-కశ్మీర్‌, పంజాబ్‌, ఢిల్లీ, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్‌, రాజస్థాన్‌, ఒడిశా, మధ్యప్రదేశ్‌, ఛత్తీ్‌సగఢ్‌తోపాటు దేశం నలుమూలల నుంచి కొవిడ్‌ తీవ్రతతో వచ్చిన రోగులకు ఊపిరిత్తులు, గుండె ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చేసినట్లు వైద్యులు తెలిపారు. వీరిలో చాలామంది కొవిడ్‌ వైరస్‌ ప్రభావంతో ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బతిని శ్వాస పీల్చుకోవడం కష్టంగా మారిన పరిస్థితుల్లో కిమ్స్‌ ఆస్పత్రులకు వచ్చారని, వారిని అడ్వాన్స్‌డ్‌ రెస్పిరేటరీ సపోర్ట్‌(ఈసీఎంవో)తో ప్రాణాలు కాపాడామని వైద్యులు చెప్పారు. కొవిడ్‌తో ఊపిరితిత్తులు పాడైపోయి శ్వాస తీసుకోవడం కష్టంగా మారిన 12 మంది రోగులకు తమ బృందం రెండు ఊపిరితిత్తులనూ ట్రాన్స్‌ప్లాంట్‌ చేసిందని కిమ్స్‌ ఆస్పత్రి థొరాసిక్‌ ఆర్గాన్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ ప్రోగ్రామ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ అత్తావర్‌ వెల్లడించారు. దీంతోపాటు కార్డియో రెస్పిరేటరీ ఫెయిల్యూర్‌తో వచ్చిన 38 మందికి రెండు ఊపిరితిత్తులు, గుండె ట్రాన్స్‌ప్లాంటేషన్‌  చేశామన్నారు. 

కరోనా ఎలా సోకుతుందో గుర్తించడం కష్టమేనని, ఊపిరితిత్తుల సమస్యలున్న వారికి ప్రమాదకరమైన వ్యాధిగా మారుతుందని కిమ్స్‌ హార్ట్‌ అండ్‌ లంగ్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ ఇన్‌స్టిట్యూట్‌ బృందం పేర్కొంది. ఇలాంటి రోగులకు ఈసీఎంవో లాంటి అడ్వాన్స్‌డ్‌ రెస్పిరేటరీ సపోర్ట్‌ ద్వారా చికిత్స అందించడం అత్యవసరమని వెల్లడించింది. ఈసీఎంవోపై 2 నుంచి 4 వారాలపాటు చికిత్స అందించినా రోగ లక్షణాలు తగ్గుముఖం పట్టకపోతే ఊపిరితిత్తుల మార్పిడి చేయాల్సిందేనన్నారు. ఒక కేసులో రోగికి 56 రోజులపాటు ఈసీఎంవో సపోర్ట్‌తో చికిత్స చేసినా ఫలితం లేకపోవడంతో రెండు ఊపరితిత్తులు మార్చి ప్రాణం పోసినట్లు వైద్య బృందం ప్రకటించింది. కిమ్స్‌ ఆస్పత్రి మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ బి. భాస్కర్‌రావు కూడా మాట్లాడారు.


Updated Date - 2021-04-20T07:42:03+05:30 IST