100 లక్షల కోట్లతో గతి శక్తి

Oct 14 2021 @ 00:45AM

  • భారీ ఇన్‌ఫ్రా ప్రణాళిక 
  • రాబోయే 25 సంవత్సరాల అభివృద్ధికి పునాది: మోదీ


న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారంనాడు ‘పీఎం గతి శక్తి’ పేరుతో రూ.100 లక్షల కోట్ల జాతీయ మాస్టర్‌ ప్లాన్‌ను విడుదల చేశారు. రవాణా ఖర్చు, సమయాన్ని తగ్గించడం, సరుకు నిర్వహణ సామర్థ్యం పెంచడంతోపాటు ఆర్థికాభివృద్ధి, పెట్టుబడులకు ఊతమిచ్చేలా దేశంలో మల్టీ మోడల్‌ కనెక్టివిటీని అభివృద్ధి చేయడమే ఈ ప్రణాళిక ప్రధానోద్దేశం. ‘‘వచ్చే 25 ఏళ్ల అభివృద్ధికి ఈ ప్లాన్‌ ద్వారా పునాది వేస్తున్నాం. 21 శతాబ్దంలో అభివృద్ధి ప్రణాళికలకు ఈ మాస్టర్‌ ప్లాన్‌ గతి శక్తి కల్పించనుంది. ఇది నిర్దేశిత సమయంలో ప్రాజెక్టుల పూర్తికి దోహదపడుతుంది’’ అని ఈ సందర్భంగా మోదీ అన్నారు. మౌలిక సదుపాయాల సంబంధిత శాఖలన్నింటినీ ఒకే ఛత్రం కింద అనుసంధానించడం ద్వారా ప్రాజెక్టుల నిర్మాణ వేగం, సామర్థ్యాన్ని మరింత పెంచనున్నట్లు ఆయన చెప్పారు.


పరస్పర సహకారంతో కూడిన అభివృద్ధి కోసం రోడ్లు, రైల్వే, విమానయానం నుంచి వ్యవసాయం వరకు పలు మంత్రిత్వ శాఖలు గతి శక్తిలో భాగం కానున్నట్లు మోదీ తెలిపారు. దేశంలో లాజిస్టిక్స్‌ మొత్తం వ్యయం జీడీపీలో 13 శాతానికి సమానమని, ఇది ఎగుమతుల రంగ పోటీ సామ ర్థ్యంపై ప్రభావం చూపుతోందన్నారు. ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోదీ ఈ ప్లాన్‌ను ప్రకటిం చారు. 


ఈ ప్రణాళిక ద్వారా దేశంలోని రెండు డిఫెన్స్‌ కారి డార్లు సహా 1,200కు పైగా పారిశ్రామిక క్లస్టర్లకు బహుళ పద్ధుతుల్లో రవాణా మార్గాలను అనుసంధానించనున్నారు. అంతే కాదు, మౌలిక అనుసంధాన ప్రాజెక్టుల అభివృద్ధిలో సమన్వయం కోసం రోడ్లు, రైల్వే సహా 16 మంత్రిత్వ శాఖలను అనుసంధానించేందుకు వీలుగా ఓ డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ను ఏర్పాటు చేయనున్నారు. వాణిజ్య మంత్రిత్వ శాఖ పరిధిలోని లాజిస్టిక్స్‌ విభాగం ఈ ప్రాజెక్టుకు నేతృత్వం వహించనుంది. కేబినెట్‌ కార్యదర్శి అధ్యక్షతన కార్యదర్శుల బృందం ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు అమలును పర్యవేక్షించనుంది. పలు మంత్రిత్వ శాఖలకు చెందిన ప్రధాన పథకాలైన భారత్‌మాల, సాగర్‌మాల, ఉడాన్‌, రైల్వే నెట్‌వర్క్‌ విస్తరణ, అంతర్గత జలరహదారులు (ఇన్‌లాండ్‌ వాటర్‌వేస్‌), భారత్‌ నెట్‌ ప్రాజెక్టులను సైతం ఈ మాస్టర్‌ ప్లాన్‌లో భాగం చేయనున్నారు. ప్రధాని మోదీ ఢిల్లీ, ప్రగతి మైదాన్‌లోని ఇంటర్నేషనల్‌ ఎగ్జిబిషన్‌ కమ్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన నాలుగు ఎగ్జిబిషన్‌ హాళ్లను ప్రధాని ప్రారంభించారు. ఎంఎస్‌ఎంఈలు, హస్త కళాకారులు, కుటీర పరిశ్రమలు అంతర్జాతీయ కొనుగోలుదారులకు  ఈ ప్రాంగణాలు దోహదపడనున్నాయని అన్నారు.


మార్కెట్‌కు ‘గతిశక్తి’ ఉత్తేజం 

గతిశక్తి ఇన్‌ఫ్రా ప్రణాళిక ఐదో రోజు కూడా మార్కెట్‌ను కదం తొక్కించింది. ప్రధానంగా ఇన్‌ఫ్రా రంగం షేర్ల కొను గోలుకు ఇన్వెస్టర్లు పరుగులు తీశారు. ఆటో, పవర్‌ షేర్లు కూడా వీటికి జత కలవడంతో ఈక్విటీ సూచీలు కొత్త రికా ర్డులు నమోదు చేశాయి. సెన్సెక్స్‌ 452.74 పాయింట్ల లాభం తో 60.737.05 పాయింట్ల వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఈ సూచీ 60,836.63 పాయింట్ల చారిత్రక గరిష్ఠ స్థాయిని నమోదు చేసింది. నిఫ్టీ 18,197.80 పాయింట్ల చారిత్రక గరిష్ఠ స్థాయి వరకు దూసుకుపోయి చివరికి 169.80 పాయింట్ల లాభంతో 18,161.75 వద్ద ముగిసింది. ఆటో, యుటిలిటీలు, ఇండస్ర్టియల్స్‌, పవర్‌ సూచీలు 3.46 శాతం మేరకు, మిడ్‌ క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ సూచీలు 1.56 శాతం లాభపడ్డాయి. 


టాటా మోటార్స్‌ షేరు దూకుడు

విద్యుత్‌ వాహనాల వ్యాపారం కోసం 100 కోట్ల డాలర్ల నిధుల సమీకరణ లక్ష్యం ప్రకటించిన నేపథ్యంలో టాటా మోటార్స్‌ షేరు 20 శాతం దూసుకుపోయింది. గ్రూప్‌లోని ఇతర కంపెనీల షేర్లు కూడా లాభాలబాటలో నడిచాయి. బీఎస్‌ఈలో ఈ షేరు 20.43 శాతం లాభంతో రూ.506.75 వద్ద క్లోజ్‌ కాగా ఎన్‌ఎస్‌ఈలో 20.44ు లాభంతో రూ.506.90 వద్ద ముగిసింది. బీఎస్‌ఈలో ఒక దశలో 23.56 శాతం లాభపడి 52 వారాల గరిష్ఠ స్థాయి రూ.519.95ని తాకింది. 


2024-25 నాటికి లక్ష్యాలు

జాతీయ రహదారుల నెట్‌వర్క్‌ 2 లక్షల కిలోమీటర్లకు  

గ్యాస్‌ పైప్‌లైన్‌ నెట్‌వర్క్‌ 35,000 కిలోమీటర్లకు పెంపు 

220 కొత్త ఎయిర్‌పోర్టులు, హెలీపోర్టులు, వాటర్‌ ఏరోడ్రోమ్‌ల ఏర్పాటు 

202 ఫిషింగ్‌ క్లస్టర్లు/హార్బర్లు/ల్యాండింగ్‌ సెంటర్లు 

11 ఇండస్ట్రియల్‌, 2 కొత్త డిఫెన్స్‌ కారిడార్ల ఏర్పాటు 

అన్ని గ్రామాలకు 4జీ కనెక్టివిటీ 

పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి సామర్థ్యం 87.7 గిగావాట్ల నుంచి 225 గిగావాట్లకు  

ట్రాన్స్‌మిషన్‌ నెట్‌వర్క్‌ 4,54,200 సర్క్యూట్‌ కిలోమీటర్లకు పెంపు 

రైల్వే సరుకు నిర్వహణ సామర్థ్యం 121 కోట్ల టన్నుల నుంచి 160 కోట్ల టన్నులకు

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.