Royal family CONTROVERSY: క్వీన్ చివరి ఘడియల్లో హ్యారీతో కింగ్ ఛార్లెస్ మాట... ‘మేఘన్‌ను తీసుకురావొద్దు’...

ABN , First Publish Date - 2022-09-10T18:15:16+05:30 IST

ఎలిజబెత్-2 (Queen Elizabeth II) అంతిమ ఘడియల్లో

Royal family CONTROVERSY: క్వీన్ చివరి ఘడియల్లో హ్యారీతో కింగ్ ఛార్లెస్ మాట... ‘మేఘన్‌ను తీసుకురావొద్దు’...

లండన్ : క్వీన్ ఎలిజబెత్-2 (Queen Elizabeth II) అంతిమ ఘడియల్లో రాజ కుటుంబంలో వివాదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. అప్పటి ప్రిన్స్, ప్రస్తుత కింగ్ ఛార్లెస్ తన కుమారుడు హ్యారీకి ఓ విషయాన్ని చెప్పారని బ్రిటిష్ మీడియా చెప్తోంది. ‘‘ఇటువంటి అత్యంత విషాదకర సమయంలో బల్మోరల్‌లో మేఘన్ ఉండటం సరికాదు’’ అని చెప్పినట్లు పేర్కొంది. 


నటి, మోడల్ మేఘన్‌ను ప్రిన్స్ హ్యారీ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ ఓ టీవీ షోలో మాట్లాడుతూ, రాజ వంశంలో జాత్యహంకారం ఉందని ఆరోపించారు. 


క్వీన్ ఎలిజబెత్-2 చివరి ఘడియలు సమీపిస్తున్నాయని వైద్యులు హెచ్చరించి, ఆమె సమీప బంధువులను రప్పించారు. ఈ  సమయంలో ప్రిన్స్ ఛార్లెస్ తన కుమారుడైన హ్యారీతో మాట్లాడుతూ,  ‘‘ఇటువంటి అత్యంత విషాదకర సమయంలో బల్మోరల్‌లో మేఘన్ ఉండటం సరికాదు’’ అని చెప్పినట్లు బ్రిటిష్ మీడియా పేర్కొంది. కేట్ వెళ్ళడం లేదని, హాజరయ్యే వారి సంఖ్య అత్యంత సమీప కుటుంబ సభ్యులకే పరిమితమని చెప్పినట్లు తెలిపింది. మేఘన్‌కు అవకాశం ఉండదని మరింత స్పష్టంగా చెప్పారని తెలిపింది. ఈ నేపథ్యంలో బల్మోరల్‌ క్యాజిల్‌కు చివరిగా వచ్చిన వ్యక్తి, ముందుగా వెళ్ళిన వ్యక్తి ప్రిన్స్ హ్యారీ అని తెలిపింది. 


ఓ ప్రముఖ వార్తా సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం, ప్రిన్స్ హ్యారీ, మేఘన్ (Prince Harry, Meghan) దంపతులు అమెరికాలో ఉంటున్నారు. అయితే హ్యారీ ఇటీవలే బ్రిటన్‌కు వెళ్ళారు. ఈ పర్యటన ప్రణాళికలో ఆయన తన కుటుంబ సభ్యులను కలవడమనే అంశమే లేదు. క్వీన్ మరణ సమయంలో ఆయన అనుకోకుండా బ్రిటన్‌లో ఉన్నారు. 


ప్రిన్స్ హ్యారీ, మేఘన్ దంపతులు 2021 మార్చిలో ఓప్రా విన్‌ఫ్రేకు ఇంటర్వ్యూ ఇచ్చారు. రాజ వంశం జాత్యహంకారాన్ని పాటిస్తోందని మేఘన్ ఆరోపించారు. అయితే ఎవరు జాత్యహంకారంతో వ్యవహరించారో స్పష్టంగా చెప్పలేదు. తాను వర్కింగ్ రాయల్‌గా ఉన్న కాలంలో తాను తీవ్ర విచారంతో, అసంతృప్తితో ఉండేదాన్నని, ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందని చెప్పారు. తాను గర్భిణిగా ఉన్నపుడు తనకు పుట్టబోయే బిడ్డ శరీర ఛాయ గురించి రాజకుటుంబంలో ఆందోళన వ్యక్తమైందని, దానిపై చర్చలు జరిగాయని తెలిపారు. మేఘన్ తల్లి బ్లాక్ మహిళ, తండ్రి శ్వేత జాతీయుడు. 


ఈ ఇంటర్వ్యూ ప్రపంచవ్యాప్తంగా పెద్ద దుమారం రేపింది. దీనిపై బకింగ్‌హాం ప్యాలెస్ చాలా సున్నితంగా స్పందించింది. ‘‘లేవనెత్తిన అంశాలు బాధాకరమే అయినప్పటికీ కొన్ని జ్ఞాపకాలు విభిన్నంగా ఉండవచ్చున’’ని తెలిపింది. అప్పటి నుంచి ఈ కుటుంబ సభ్యుల మధ్య సాన్నిహిత్యం కొరవడింది. అయితే కింగ్ ఛార్లెస్ సెప్టెంబరు 9న మాట్లాడుతూ, హ్యారీ, మేఘన్ విదేశాల్లో జీవిస్తున్నారని, వారి పట్ల కూడా తన ప్రేమను వ్యక్తం చేస్తున్నానని తెలిపారు. 


Updated Date - 2022-09-10T18:15:16+05:30 IST