Kiren Rijiju Vs Justic BN Srikrishna : మోదీని దూషిస్తూనే స్వేచ్ఛ లేదంటున్నారు : కిరణ్ రిజిజు

ABN , First Publish Date - 2022-09-03T18:35:21+05:30 IST

ప్రజాదరణతో ఎన్నికైన ప్రధాన మంత్రిని దూషించేవారే ఈ దేశంలో

Kiren Rijiju Vs Justic BN Srikrishna : మోదీని దూషిస్తూనే స్వేచ్ఛ లేదంటున్నారు : కిరణ్ రిజిజు

న్యూఢిల్లీ : ప్రజాదరణతో ఎన్నికైన ప్రధాన మంత్రిని దూషించేవారే ఈ దేశంలో వాక్ స్వాతంత్ర్యం లేదని పెడబొబ్బలు పెడుతున్నారని కేంద్ర మంత్రి, బీజేపీ నేత కిరణ్ రిజిజు (Kiren Rijiju) అన్నారు. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బీఎన్ శ్రీకృష్ణ వ్యక్తం చేసిన అభిప్రాయాలపై ఆయన ట్విటర్ వేదికగా స్పందించారు. 


జస్టిస్ శ్రీకృష్ణ (Justice BN Srikrishna) ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ‘‘నేటి పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. ఓ బహిరంగ ప్రదేశంలో నిల్చుని, నాకు ప్రధాన మంత్రి ముఖం నచ్చలేదని చెప్పానంటే, ఎవరో వచ్చి, నా మీద దాడి చేస్తారు, అరెస్ట్ చేస్తారు, ఎలాంటి కారణం చెప్పకుండా నన్ను జైల్లో తోస్తారు. ప్రజలుగా మనమంతా దీనిని వ్యతిరేకించాలి’’ అన్నారు. ఈ ఇంటర్వ్యూలోని ఈ భాగాన్ని మోదీ ప్రభుత్వ వ్యతిరేకులు వైరల్ చేస్తున్నారు. 


దీనిపై కిరణ్ రిజిజు స్పందిస్తూ శనివారం ఇచ్చిన ట్వీట్‌లో, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విమర్శించేవారు 1975లో ఇందిరా గాంధీ నేతృత్వంలోని ప్రభుత్వం దేశంలో అత్యవసర పరిస్థితి (emergency)ని విధించడం గురించి ఏమీ మాట్లాడరని, అదేవిధంగా ప్రాంతీయ పార్టీల ముఖ్యమంత్రులను విమర్శించే ధైర్యం ప్రదర్శించరని మండిపడ్డారు. 


‘‘ప్రజాదరణతో ఎన్నికైన ప్రధాన మంత్రిని దూషించడానికి ఎటువంటి హద్దులు లేకుండా అన్ని వేళలా మాట్లాడేవారు వాక్ స్వాతంత్ర్యం గురించి పెడబొబ్బలు పెడుతున్నారు! కాంగ్రెస్ పార్టీ విధించిన అత్యవసర పరిస్థితి గురించి వాళ్ళు మాట్లాడరు, ప్రాంతీయ పార్టీల ముఖ్యమంత్రులను విమర్శించే సాహసం ఎన్నడూ చేయరు’’ అని కిరణ్ రిజిజు పేర్కొన్నారు. 


ఈ వ్యాఖ్యలు చేసినవారు సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తేనా? అనే విషయం తనకు తెలియదని, ఒకవేళ ఆయనే ఈ వ్యాఖ్యలు చేసి ఉంటే, అవి ఆయన సేవలందించిన వ్యవస్థ హుందాతనం, గౌరవాలను తగ్గించే విధంగా ఉన్నాయని అన్నారు. 




Updated Date - 2022-09-03T18:35:21+05:30 IST