New York Times Article: కేజ్రీవాల్‌పై కేంద్ర మంత్రి రిజిజు ఘాటు వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2022-08-20T17:10:45+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వ ఎక్సయిజ్ విధానంలో అక్రమాలపై సీబీఐ

New York Times Article: కేజ్రీవాల్‌పై కేంద్ర మంత్రి రిజిజు ఘాటు వ్యాఖ్యలు

న్యూఢిల్లీ : ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ ఎక్సయిజ్ విధానంలో అక్రమాలపై సీబీఐ (కేంద్ర దర్యాప్తు సంస్థ) సోదాల నేపథ్యంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (CM Aravind Kejriwal) చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు (Kiren Rijiju) ఘాటుగా స్పందించారు. ‘న్యూయార్క్ టైమ్స్’ కథనం ప్రచురితం కావడం గర్వకారణంగా భావించేవారు విదేశీ విలువలనే విశ్వసిస్తారన్నారు. ఆంగ్లం మాట్లాడటం గర్వకారణంగా భావించడం భారత దేశ విషాదమని పేర్కొన్నారు. 


కిరణ్ రిజిజు ఇచ్చిన ట్వీట్‌లో, ‘‘భారత దేశ విషాదం ఏమిటంటే, ఆంగ్లం మాట్లాడటం గర్వకారణమని చాలా మంది భావిస్తారు. వీళ్లు తమ సినిమా ఆస్కార్‌కు నామినేట్ అయితే సంబరాలు చేసుకుంటారు, తమ కథనం న్యూయార్క్ టైమ్స్‌లో ప్రచురితమైతే పండుగ చేసుకుంటారు. ఇలాంటివాళ్లు విదేశీ విలువలను నమ్ముతారు, వాటికే ప్రాధాన్యం ఇస్తారు’’ అని పేర్కొన్నారు. 


ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా ఇంట్లో సీబీఐ సోదాలు జరుగుతున్న సమయంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం మాట్లాడుతూ,  రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యా విధానంపై ‘న్యూయార్క్ టైమ్స్’ ఓ కథనాన్ని ప్రచురించిందని చెప్పారు. విద్యా రంగంలో తమ ప్రభుత్వం విజయాలు సాధించినట్లు ఈ కథనం పేర్కొందన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ చేపట్టిన ‘మేక్ ఇండియా నెం.1’ (Make India Number 1) మిషన్‌కు అడ్డంకులు సృష్టించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. తమను వేధించాలని సీబీఐకి పై నుంచి (కేంద్ర ప్రభుత్వ పెద్దల నుంచి) ఆదేశాలు వచ్చాయని, ఆందోళన చెందవలసిన అవసరం లేదని చెప్పారు. ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ విద్యా విధానాన్ని ప్రశంసిస్తూ ఈ కథనం వెలువడిన రోజు ఈ సోదాలు జరుగుతున్నాయన్నారు. ఢిల్లీ భారత దేశం గర్వపడేలా చేసిందన్నారు. అమెరికాలో అతి పెద్ద వార్తా పత్రిక మొదటి పేజీలో ఢిల్లీ మోడల్ విద్యా విధానం గురించి రాశారని చెప్పారు. స్వతంత్ర భారత దేశంలో అత్యుత్తమ విద్యా మంత్రి మనీశ్ సిసోడియా అని చెప్పారు. 



Updated Date - 2022-08-20T17:10:45+05:30 IST