కొందరికే.. కిసాన్‌ ‘క్రెడిట్‌’!

ABN , First Publish Date - 2022-08-13T04:58:34+05:30 IST

జిల్లాలో చాలామంది రైతులకు కిసాన్‌ క్రెడిట్‌ కార్డుల (కేసీసీ) ప్రయోజనం దక్కడం లేదు. ఈ కార్డు ద్వారా పంటలతోపాటు పాడి, ఉద్యాన రైతులకు రూ.2 లక్షల వరకు రుణ ప్రయోజనం పొందే అవకాశం ఉన్నా.. ఉపయోగించుకోలేక పోతున్నారు. జిల్లాలో 277 బ్యాంకు శాఖలు ఉన్నాయి. వీటి పరిధిలో ఏటా రూ.1564.03 కోట్ల రుణాలు అందిస్తున్నారు. రైతులు 5.25 లక్షల మంది ఉండగా.. 1,41,277మందికి మాత్రమే కిసాన్‌ కార్డుల ప్రయోజనం అందుతోంది.

కొందరికే.. కిసాన్‌ ‘క్రెడిట్‌’!

చాలామంది రైతులకు అందని కార్డులు
ప్రయోజనాలు కల్పించని బ్యాంకులు
ప్రైవేటు అప్పులతో అన్నదాతకు ఇబ్బందులు
(ఇచ్ఛాపురం రూరల్‌)

ఇచ్ఛాపురం మండలం పెద్దలక్ష్మీపురానికి చెందిన  రైతు దున్న కోటేష్‌కు 2.5 ఎకరాలు వ్యవసాయ భూమి ఉంది. కిసాన్‌ క్రెడిట్‌ కార్డు(కేసీసీ) ద్వారా తక్కువ వడ్డీకే బ్యాంకు రుణం పొందవచ్చు. కానీ, ఈయనకు క్రెడిట్‌ కార్డు అంటే ఏమిటో తెలియదు. అధికారులు కూడా కేసీసీపై అవగాహన కల్పించడం లేదు. దీంతో సాగు ఖర్చుల కోసం ప్రైవేటు వ్యక్తుల వద్ద అప్పు చేసి అధిక వడ్డీ చెల్లిస్తున్నాడు. ఆపై ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాడు.
ఇలా.. జిల్లాలో చాలామంది రైతులకు కిసాన్‌ క్రెడిట్‌ కార్డుల (కేసీసీ) ప్రయోజనం దక్కడం లేదు. ఈ కార్డు ద్వారా పంటలతోపాటు పాడి, ఉద్యాన రైతులకు రూ.2 లక్షల వరకు రుణ ప్రయోజనం పొందే అవకాశం ఉన్నా.. ఉపయోగించుకోలేక పోతున్నారు. జిల్లాలో 277 బ్యాంకు శాఖలు ఉన్నాయి. వీటి పరిధిలో ఏటా రూ.1564.03 కోట్ల రుణాలు అందిస్తున్నారు. రైతులు 5.25 లక్షల మంది ఉండగా.. 1,41,277మందికి మాత్రమే కిసాన్‌ కార్డుల ప్రయోజనం అందుతోంది. రెండు ఎకరాలలోపు రైతులు 4,59,341 లక్షలు మంది ఉంటే వీరిలో సగం కన్నా ఎక్కువ మందికి కార్డులేమిటో తెలియదు. వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్‌ స్మామినాథన్‌ కమిటీ సిఫారసుల మేరకు ఈ కార్డుల విధానం అమలులోకి వచ్చి రెండు దశాబ్దాలు కావస్తోంది. ఐదేళ్లపాటు చెల్లే విధంగా సాగు అవసరాలకు తరచూ బ్యాంకుల దగ్గరకు వెళ్లకుండా సొమ్ములు కార్డు నుంచి తీసుకోవచ్చు. 2.5 ఎకరాల భూమి ఉన్న రైతు రూ.2 లక్షల వరకు.. ఆపైన భూమి ఉన్న రైతులకు రూ.3లక్షల వరకు రుణాలు తక్కువ వడ్డీకే అందజేయాలి. కానీ గ్రామీణ బ్యాంకులతో పాటు సహకార బ్యాంకులు రైతులకు సక్రమంగా రుణాలు మంజూరు చేయడం లేదు. కొంతమంది రైతులకు వీటిపై అవగాహన లేకపోవడంతో ప్రైవేటు వ్యక్తుల వద్ద అప్పు చేసి పంటలు సాగు చేస్తున్నారు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి రైతుకు కిసాన్‌ కార్డుల ద్వారా రుణాలు అందిస్తే ఎంతో ప్రయోజనం కలుగుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

అగ్రభాగం వ్యవసాయానికే అయినా.. :
జిల్లాలో ఇతర రంగాల కంటే వ్యవసాయంపై ఆధారపడి ఉన్న కుటుంబాలు ఎక్కువగా ఉన్నారు. వీరు పండిస్తున్న పంట ఉత్పత్తులు సైతం ఎక్కువగానే ఉన్నాయి. రెండు సీజన్లలో రైతులు 2.71 లక్షల హెక్టార్లలో పంటలు సాగు చేస్తున్నారు. వీటి ద్వారా 2.65 లక్షల మెట్రిక్‌ టన్నుల ఉత్పత్తులు పండిస్తున్నారు. ఇందులో వరిదే అగ్రభాగం. ఇంత పెద్దఎత్తున వ్యవసాయ రంగం దూసుకెళ్తున్నా రైతులకు ప్రాధాన్యం దక్కడం లేదు.

అవగాహన కల్పిస్తున్నాం :
బ్యాంకులకు ఎక్కడికక్కడే కేసీసీ ప్రయోజనాలు వివరించాలని ఆదేశాలున్నాయి. వాటిపై మరింత ప్రచారం కల్పించి ప్రయోజనం వర్తింపజేసేందుకు ప్రయత్నిస్తున్నాం. ఎక్కువ మందికి కెసీసీ కార్డులు అందించేందుకు అవగాహన పెంచుతున్నాం.
- జి.వి.వి.డి..హరిప్రసాద్‌, లీడ్‌ బ్యాంకు మేనేజర్‌, శ్రీకాకుళం.

 

Updated Date - 2022-08-13T04:58:34+05:30 IST