జడేజా.. మరో రైనా అవుతాడా?

ABN , First Publish Date - 2022-05-13T03:08:00+05:30 IST

చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings)తో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు పదేళ్ల అనుబంధం ఉంది.

జడేజా.. మరో రైనా అవుతాడా?

ముంబై: చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings)తో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు పదేళ్ల అనుబంధం ఉంది. అయితే తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ మేనేజ్‌మెంట్‌తో జడేజాకు విభేదాలు అంటూ ప్రచారం జరుగుతోంది. అందుకే సీజన్‌ మొత్తానికి దూరమయ్యాడన్న టాక్ దుమారం రేపుతోంది. జడేజాను ఇన్‌స్టాగ్రామ్‌లో సూపర్ కింగ్స్  అన్‌ఫాలో చేసిందన్న వార్త కూడా హాట్ టాపిక్‌గా మారింది. జడ్డూను ఏకంగా జట్టు నుంచే తొలగించారంటూ కొందరు ఫ్యాన్స్ గుస్సా అవుతున్నారు. 


నిజానికి ఐపీఎల్ సీజన్ ఆరంభానికి ముందు కెప్టెన్సీ నుంచి ధోనీ తప్పుకున్నాడు. వెంటనే జడేజాకు పగ్గాలు అప్పగించారు. అయితే వరుస ఫ్లాప్‌లతో మళ్లీ కెప్టెన్‌గా ధోనీ రీఎంట్రీ ఇచ్చాడు. దీంతో ఈ నిర్ణయాలన్నీ జట్టు ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీశాయన్న వాదన వినిపిస్తోంది. ఫ్రాంచైజీ తీరు విమర్శలకు కారణం అవుతోంది. కెప్టెన్సీ పగ్గాలు అందుకున్నాక జడేజా ఫామ్ కూడా పోయింది. అంతలోనే ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో గాయపడ్డాడు. ఇప్పుడు సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. జడ్డూ తప్పుకోవడానికి సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ తీరే కారణమన్న ఆరోపణలే సెగలు పుట్టిస్తున్నాయి.


గతంలో సురేశ్ రైనాను సాగనంపినట్టే ఇప్పుడు జడేజాకు కూడా పొమ్మనకుండా పొగపెట్టేస్తున్నారని ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. సోషల్ మీడియాలో సీఎస్‌కే మేనేజ్‌మెంట్‌ను ఆడేసుకుంటున్నారు. కావాలనే జడ్డూను తప్పించారని కామెంట్స్ పెడుతున్నారు. దీనిపై టీమ్మేనేజ్‌మెంట్ స్పందించింది. సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చల్లో వాస్తవం లేదంది. జడేజా ఎప్పటికీ తమతోనే ఉంటాడని చెన్నై సూపర్ కింగ్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కాశీ విశ్వనాథన్ అన్నారు. అయినా జడేజా ఎపిసోడ్‌పై అభిమానుల్లో అనుమానాలు పెరుగుతూనే ఉన్నాయి.

Read more