చరిత్రను వక్రీకరిస్తున్న కిషన్‌రెడ్డి

ABN , First Publish Date - 2022-09-21T05:55:49+05:30 IST

కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సెప్టెంబర్‌ 16వ తేదీ ఆంధ్రజ్యోతిలో రాసిన ‘బానిసత్వపు ఆలోచనకు చరమగీతం’ అనే వ్యాసం చదివాను...

చరిత్రను వక్రీకరిస్తున్న కిషన్‌రెడ్డి

కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సెప్టెంబర్‌ 16వ తేదీ ఆంధ్రజ్యోతిలో రాసిన ‘బానిసత్వపు ఆలోచనకు చరమగీతం’ అనే వ్యాసం చదివాను. మొదటిసారి ‘‘చాలామంది ముస్లింలు నిజాంకు వ్యతిరేకంగా పోరాడారు’’ అని రాశారు. అయితే విమోచన ఎవరి నుంచి అనే విషయం రాయలేదు. రాచరికం నుంచి విమోచన అయితే కాశ్మీర్‌, గ్వాలియర్‌, మణిపూర్‌, త్రిపురలను రాచరికం నుంచి విమోచన అని బిజెపి ఎందుకు అనడం లేదు.


తెలంగాణ కోసం సర్వస్వాన్ని త్యాగం చేసిన కొందరు త్యాగధనుల గురించి రాస్తూ ప్రధానపాత్ర వహించిన కమ్యూనిస్టు నాయకులు, సాయుధ పోరాటానికి పిలుపునిచ్చిన రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, మఖ్దూం మొహినుద్దీన్‌ పేర్లను కావాలనే విస్మరించి, అమరవీరులైన 4500 మంది కమ్యూనిస్టులు, పాల్గొన్న లక్షలాది రైతులు, పేద ప్రజల గురించి ఒక్క మాట కూడా రాయలేదు. స్వామి రామానందతీర్థ పేరు కూడా రాయలేదు. ఇది సరైనదేనా? దొడ్డి కొమరయ్య, ఐలమ్మలు ఎవరనే విషయం ఎందుకు రాయరు? వారు మట్టిలోంచి మహామనుషులైన కమ్యూనిస్టులు. కాంగ్రెస్‌ నాయకులు, ఆర్‌ఎస్‌ఎస్‌ను నిషేధించిన సర్దార్‌ పటేల్‌ను ఆయన మరణానంతరం బిజెపిలోకి ముందు మీరు కిడ్నాప్‌ చేశారు. ఇప్పుడు మా కొమరయ్యను, మా ఐలమ్మను కూడా కిడ్నాప్‌ చేస్తామంటే అంగీకరించం. ఖబడ్డార్‌.


నిజాం పాలనలోని అరాచకాలను, వాస్తవాలను తెలియజేసేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు కిషన్‌రెడ్డి చెప్పుకున్నారు. నిజాం పాలనలో హిందూ భూస్వాములు, ముస్లిం జాగీర్దార్లతో సహా అమలు చేసిన క్రూరమైన వెట్టిచాకిరీని సంఘం(ఆంధ్ర మహాసభ) ద్వారా పోరాడి దానిని రద్దు చేయించిన వాస్తవం ఇప్పటికయినా చెబుతారా? విసుకూరి రామచంద్రారెడ్డి దురాగతాలు చెబుతారా? పదుల వేల ఎకరాల భూమి, లక్షల ఎకరాల భూమి కేంద్రీకరణ ద్వారా రైతులను బికారులను చేస్తూ నిజాంకు దన్నుగా నిలబడి, రజాకార్లకు తమ గడీలను కేంద్రాలుగా చేసి ప్రజలపై దాడులు చేయించిన హిందూ భూస్వాముల గురించి చెబుతారా? హైదరాబాద్‌ పోలీస్‌ యాక్షన్‌ ప్రారంభమయ్యే ముందు, ఆ విషయం చర్చించడానికి జరిగిన సంస్థాన్‌ కేబినెట్‌ సమావేశంలో అప్పటి నిజాం ఉపప్రధాని వెంకట్రామిరెడ్డి ‘భారత సైన్యాలను ఎదిరించాల్సిందే, నిజాం కోసం నా ప్రాణం ధారపోస్తాన’ని ఆవేశంతో ప్రసంగించిన విషయం ప్రజలకు వివరిస్తారా?


ఈ వాస్తవాలను మరుగుపరచి విమోచన పోరాటం ఎందుకు? చేయని పోరాటానికి వారసత్వం కొరకు దుర్బుద్ధితో ఈ ఉత్సవాలు జరిపారు. కమ్యూనిస్టుల పోరాటం లేని తెలంగాణ విలీనమెక్కడిది? విలీనం ఉత్సవాలు ఎవరైనా జరుపుకోవచ్చు, కాని చరిత్రను వక్రీకరించే హక్కు లేదు. కేంద్ర మంత్రిగా మరింత విజ్ఞతతో వ్యాసం రాసివుంటే బాగుండేది.

సురవరం సుధాకర్‌రెడ్డి

సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి

Updated Date - 2022-09-21T05:55:49+05:30 IST