రాష్ట్రంలో వానాకాలంలో పండిన ప్రతి గింజా కొంటాం

ABN , First Publish Date - 2021-11-30T07:42:58+05:30 IST

వానాకాలంలో తెలంగాణలో పండిన ప్రతి ధాన్యం గింజనూ కొనుగోలు చేస్తామని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి ప్రకటించారు...

రాష్ట్రంలో వానాకాలంలో పండిన  ప్రతి గింజా  కొంటాం

నాదీ బాధ్యత.. ధాన్యం కొనుగోళ్లలో వివాదమే లేదు

బాయిల్డ్‌ రైస్‌ ఇవ్వబోమని రాష్ట్రం కేంద్రానికి లేఖ రాసింది

టీఆర్‌ఎస్‌ సర్కారు అసంబద్ధ చర్యల వల్లే రైతు ఆత్మహత్యలు

రీసైక్లింగ్‌ బియ్యాన్ని ఎఫ్‌సీఐకి చేర్చేందుకు టీఆర్‌ఎస్‌ కుట్ర

రైతులు అప్రమత్తంగా ఉండాలి: కేంద్రం మంత్రి కిషన్‌ రెడ్డి 


న్యూఢిల్లీ, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): వానాకాలంలో తెలంగాణలో పండిన ప్రతి ధాన్యం గింజనూ కొనుగోలు చేస్తామని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి ప్రకటించారు. అందుకు తాను బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు. అయితే, యాసంగి పంట విషయంలో మాత్రం కిషన్‌రెడ్డి స్పష్టత ఇవ్వలేదు. సోమవారం ఢిల్లీలో విలేకరులతో మాట్లాడిన ఆయన.. ఽధాన్యం కొనుగోలుకు సంబంధించి అసలు వివాదమే లేదని స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోళ్లలో, బియ్యం సేకరణలో కేంద్ర ప్రభుత్వ విధానంలో మార్పు లేదని తేల్చిచెప్పారు. అనేక సంవత్సరాలుగా కొనసాగుతున్న విఽధానాన్ని ఇప్పుడు కూడా కొనసాగిస్తున్నామని చెప్పా రు. ‘‘అది బాయిల్డ్‌ రైస్‌గానీ, రా రైస్‌గానీ.. గతంలో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం ప్రకారం కొనుగోలు చేస్తాం’’ అని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. ‘‘ఒప్పం దం ప్రకారం కొంటారా లేక ప్రతి గింజా కొంటారా?’’ అని విలేకరులు ప్రశ్నించగా.. ‘‘ప్రతి గింజా కొంటాం. మీరు (రాష్ట్రప్రభుత్వం) ఒప్పందం ఇచ్చారు కదా’’ అని వ్యాఖ్యానించారు. ‘‘90 లక్షల టన్నులకుపైగా ధాన్యం వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం అంటోంది. మరి అంత మొత్తం కొనుగోలు చేస్తారా?’’ అని విలేకరులు ప్రశ్నించగా.. ‘కేంద్ర మంత్రిగా నేను చెబుతున్నా కదా..! నేను బాధ్యత తీసుకుంటాను’’ అని వ్యాఖ్యానించారు.


బాయిల్డ్‌ రైస్‌ ఇవ్వబోమని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసిందని గుర్తు చేశారు. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆచరణలో పెట్టాలని.. రా రైస్‌ ఉత్పత్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని కిషన్‌ రెడ్డి సూచించారు. ఇవన్నీ విస్మరించి కేంద్రాన్ని నిందిస్తున్నారని.. బీజేపీ పట్ల వ్యతిరేకత వచ్చేలా టీఆర్‌ఎస్‌ పార్టీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఖరారైన లక్ష్యం మేరకు కూడా ఇంకా కొనుగోళ్లను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిచేయలేదని కిషన్‌రెడ్డి విమర్శించారు. రైతుల పేరిట రీసైకిలింగ్‌ బియ్యాన్ని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల సహకారంతో పెద్ద ఎత్తున ఎఫ్‌సీఐకి చేర్చే కుట్రలు జరుగుతున్నాయని.. రైతులు జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తీసుకుంటున్న అసంబద్ధ చర్యల వల్ల రైతుల పరిస్థితి గందరగోళంగా మారిందని.. రైతుల ఆత్మహత్యలు పెరిగాయని కిషన్‌ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వరి వేయవద్దంటున్న రాష్ట్ర సర్కారు ప్రత్యామ్నాయ పంటల విత్తనాలను కూడా సమకూర్చలేదని ఆరోపించారు. రాష్ట్రంలో నాసిరకం విత్తనాలను విక్రయిస్తున్నారని, వాటిని అరికట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. కౌలు రైతులకు సహకారం అందించట్లేదని, కేసీఆర్‌ మొండివైఖరి, కక్షపూరిత వైఖరి వల్ల లక్షలాది కౌలు రైతులు నష్టపోతున్నారని ధ్వజమెత్తారు.

Updated Date - 2021-11-30T07:42:58+05:30 IST