కిట్‌కట

ABN , First Publish Date - 2022-05-29T04:55:23+05:30 IST

కేసీఆర్‌ కిట్‌ పథకం డబ్బులు ఏడాదిగా అందించకపోవడంతో బాలింతలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాంతో పేదలు పౌష్టికాహారం తీసుకోలేకపోతున్నారు.

కిట్‌కట
వనపర్తి ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవాల వార్డు (ఫైల్‌)

కేసీఆర్‌ కిట్‌ కింద అందని డబ్బులు

ఏడాదిగా బాలింతల ఎదురుచూపులు

గద్వాల, వనపర్తి జిల్లాలో రూ.16.41 కోట్లు పెండింగ్‌

ఆడ పిల్ల పుడితే రూ.13 వేలు, మగ పిల్లాడు పుడితే రూ.12 వేలు అందజేత


వనపర్తి, మే 28(ఆంధ్రజ్యోతి): కేసీఆర్‌ కిట్‌ పథకం డబ్బులు ఏడాదిగా అందించకపోవడంతో బాలింతలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాంతో పేదలు పౌష్టికాహారం తీసుకోలేకపోతున్నారు. 2017లో రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్‌ కిట్‌ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవం చేయించుకున్న వారికి 16 రకాల వస్తువులతో కిట్‌ అందజేస్తారు. అలాగే ఆడపిల్ల పుడితే రూ.13 వేలు, మగపిల్లాడు పుడితే రూ.12 వేల చొప్పున బాలింతల ఖా తాల్లో జమ చేయాలి. కానీ ఏడాదిగా డబ్బులు రాకపోవ డంతో బాధితులు ఆశ వర్కర్లు, ఏఎన్‌ఎంల చుట్టూ తిరుగుతు న్నారు. లాక్‌డౌన్‌తో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్నా, ప్రభుత్వ ప్రయోజిత కార్యక్రమాలను ఆపడం లేదు. నెలనెలా పింఛ న్లు, రైతుబంధు, సీఎంఆర్‌ఎఫ్‌ ఇతర పథకాలన్నింటికీ సమయానికి డబ్బులు అందుతుండగా, కేవలం కేసీఆర్‌ కిట్‌ డబ్బులు మాత్రమే ఎందుకు ఇవ్వడం లేదని బాలింతలు ప్రశ్నిస్తున్నారు. తమకూ డబ్బులివ్వాలని కోరుతున్నారు.


ప్రభుత్వాస్పత్రులపై పెరిగిన భరోసా..

రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి విడతగా ప్రభుత్వం వైద్య రంగం బలోపేతంపై దృష్టిసారించింది. అందులో మరీ ముఖ్యంగా మాతాశిశు సంరక్షణతో పాటు ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకాన్ని పెంచేలా అనేక కార్యక్రమాలను చేపట్టింది. ప్రతీ జిల్లాకు ఒక మాతాశిశు సంరక్షణ కేంద్రం మంజూరు చేయడంతో పాటు కేసీఆర్‌ కిట్‌ పథకం అమలు చేసింది. దాంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో గతంలో 30 శాతం ఉన్న ప్రసవాల సంఖ్య దాదాపు 60 శాతానికి చేరుకుంది. నిరంతర పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా గైనాకాలజీ డాక్టర్లను నియమించడం, ఆస్పత్రుల అభివృద్ధిపై సమీక్షలు నిర్వహించడంతో ఫలితాలనిచ్చాయి. ఆస్పత్రులపై ప్రజలకు భరోసా కలిగింది. 2017 నుంచి ఇప్పటివరకు కేవలం వనపర్తి, గద్వాల జిల్లాల్లోని ప్రభుత్వాస్పత్రుల్లో లక్షకుపైగా మంది గర్భిణులు వైద్యం చేయించుకున్నా రంటే ప్రభుత్వం లక్ష్యం ఏ మేర సక్సెస్‌ అయ్యిందో ఆర్థం చేసుకోవచ్చు. అంతకుముందు పై మొత్తంలో కనీసం సగం కూడా సర్జరీలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో జరగలేదు. అయితే కరోనా లాక్‌డౌన్‌లో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు తగ్గినా.. తర్వాత మళ్లీ పుంజుకున్నాయి. ఇప్పటికీ మెజారిటీ బాలింతలు, గర్భిణులు ఏఎన్‌సీ, జీరో, ఫుల్‌ ఇమ్యూనైజేషన్‌ కోసం ప్రభుత్వ ఆస్పత్రులకే వెళ్తున్నారు. కేసీఆర్‌ కిట్‌ ద్వారా ఏఎన్‌సీ చెకప్‌లకు రూ.3 వేలు, ఆడపిల్ల పుడితే రూ.5 వేలు, మగపిల్లాడు పుడితే రూ.4 వేలు, జీరో ఇమ్యూనైజేషన్‌కు రూ.2 వేలు, ఫుల్‌ ఇమ్యూనైజేషన్‌కు రూ.3 వేల చొప్పున అందజేస్తారు. ప్రసవం ప్రభుత్వ ఆస్పత్రిలో చేయించుకోకుండా, మిగతా దశలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో చూయించుకుంటే రూ.8 వేలు ఖాతాల్లో జమ అవుతాయి. 


వేల సంఖ్యలో పెండింగ్‌..

కేసీఆర్‌ కిట్‌ పథకం కింద వనపర్తి జిల్లాలో ఇప్పటివరకు 70,650 మందికి రూ.21 కోట్లా 21 లక్షలా 32000 మొత్తం చెల్లించారు. మరో 26,959 మందికి సుమారు రూ.7 కోట్లా 84 లక్షలా 25000 పెండింగ్‌లో ఉన్నాయి. ఇందులో ఏఎన్‌సీ చెకప్‌ల దశలో రూ.2 కోట్లా 33 లక్షలా 88,000 పెండింగ్‌లో ఉండగా, ప్రసవాల దశలో రూ.2 కోట్లా 54 లక్షలా 8000 పెండింగ్‌లో ఉన్నాయి. జీరో ఇమ్యూనైజేషన్‌ దశలో రూ.1 కోటీ 51 లక్షలా 78,000, ఫుల్‌ ఇమ్యూనైజేషన్‌ దశలో రూ.కోటీ 93 లక్షా 11,000 పెండింగ్‌లో ఉన్నాయి. చెల్లించిన మొత్తం కంటే చెల్లించాల్సిన మొత్తం చాలా తక్కువగానే ఉన్నప్పటికీ, డబ్బులు మాత్రం బాలింతల ఖాతాల్లో పడటం లేదు.

గద్వాల జిల్లాలో ఇప్పటి వరకు కేసీఆర్‌ కిట్‌ కోసం 29,683 మంది అర్హత సాధించగా, 29,682 మందికి డబ్బులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇందులో ఏఎన్‌సీ చెకప్‌లు పూర్తి చేసుకుని 9,182 మంది అర్హత సాధించారు. వారికి రూ.2 కోట్లా 75 లక్షలా 49,000, డెలివరీ దశలో 4,659 మందికి సుమారు రూ.1.90 కోట్లు, జీరో ఇమ్యూనైజేషన్‌ దశలో 8,391 మందికి రూ.కోటీ 67 లక్షలా 82,000, ఫుల్‌ ఇమ్యూనైజేషన్‌ దశలో రూ.2 కోట్లా 23 లక్షలా 50,000 పెండింగ్‌లో ఉన్నాయి. మొత్తంగా గద్వాల జిల్లాలో 29,682 మందికిగాను రూ.8 కోట్లా 56 లక్షలా 81,000 పెండింగ్‌లో ఉన్నాయి. గద్వాల, వనపర్తి జిల్లాలు కలిపి 56,641 మందికి రూ.16.41 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. అసలే కరోనా పీడకాలం తర్వాత ఉపాధి లేక అల్లాడుతుంటే వైద్యం, పౌష్ఠికాహారం ఖర్చులు బాలింతల కుటుంబాలకు తడిసిమోపెడవుతున్నాయి. వారికి అత్యంత సాంత్వన చేకూర్చే ఈ పథకం పెండింగ్‌ డబ్బులను వెంటనే చెల్లించాల్సిన అవసరం ఉంది. 

Updated Date - 2022-05-29T04:55:23+05:30 IST