కియ ఘనత మనదే..

ABN , First Publish Date - 2022-05-21T06:42:47+05:30 IST

కరువు జిల్లాకు కియ కార్ల పరిశ్రమను తెచ్చిన ఘనత మనదేనని టీడీపీ అఽధినేత చంద్రబాబు నాయుడు.. శ్రేణులనుద్దేశించి పేర్కొన్నారు.

కియ ఘనత మనదే..
సోమందేపల్లిలో రోడ్‌షోలో భారీ జనసందోహం

సోమందేపల్లి నుంచే ప్రజా ఉద్యమానికి నాంది

‘బాదుడే బాదుడు’లో చంద్రబాబు

టీడీపీ అధినేతకు అడుగడుగునా నీరా‘జనం’

రాప్తాడు నుంచి సోమందేపల్లి వరకు పోటెత్తిన శ్రేణులు

గజమాలలతో ఘన స్వాగతం పలికిన నాయకులు


పుట్టపర్తి, మే 20(ఆంధ్రజ్యోతి): కరువు జిల్లాకు కియ కార్ల పరిశ్రమను తెచ్చిన ఘనత మనదేనని టీడీపీ అఽధినేత చంద్రబాబు నాయుడు.. శ్రేణులనుద్దేశించి పేర్కొన్నారు. సోమందేపల్లిలోని ఎన్టీఆర్‌ సర్కిల్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడారు. టీడీపీ హయాంలోనే కరువు జిల్లా అనంత అభివృద్ధి సాగిందన్నారు. సాగు, తాగునీరు ఇచ్చి, పారిశ్రామికంగా అభివృద్ధి చేశామన్నారు. అంతర్జాతీయ కియ కార్ల పరిశ్రమను తీసుకొచ్చి, పారిశ్రామికులను అనంత వైపు చూసేలా చేశామన్నారు. హంద్రీనీవా కాలువ పూర్తిచేసి, జిల్లాలో ప్రతి చెరువుకు నీరిచ్చిన ఘనత టీడీపీదేనన్నారు. ప్రస్తుతం చెరువులకు నీరివ్వలేని దుస్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉందన్నారు. రైతును ఆదుకునేందుకు పంట నష్టపరిహారం అమలు చేశామన్నారు. వ్యవసాయ పరికరాలను సబ్సిడీతో అందిస్తే.. ఇప్పుడు దానిని లేకుండా చేశారన్నారు.  సోమందేపల్లి సభలో వైసీపీ పాలనపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు. నిత్యావసర వస్తువులు అందనంత ఎత్తులో ఉన్నాయనీ, కిలో పామాయిల్‌ రూ.200, టమోటా రూ.100 ఎప్పుడన్నా చూశామా తమ్ముళ్లూ అంటూ ధరల బాదుడుపై ప్రశ్నించారు. జగన పాదయాత్రతో వచ్చి, నెత్తిన చెయ్యిపెట్టి.. ముద్దులు పెట్టి.. ఇప్పుడు పిడిగుద్దులు గుద్దుతూ బాదుడు కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. విద్యుత, బస్సుచార్జీలు పెంచి, చెత్తపై పన్ను వేసి, చెత్త ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్న ఘనత జగనకే దక్కుతుందన్నారు. యువతకు ఉద్యోగాలు కల్పిస్తానని హామీ ఇచ్చి, చివరికి వారిని రోడ్డుపై పడేశారన్నారు. టీడీపీ హయాంలో పోలీసు, టీచర్‌ పోస్టులు భర్తీ చేశామనీ, నేడు వలంటీర్‌ ఉద్యోగం ఇచ్చి రూ.5 వేలు జీతం ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇలాంటి పార్టీని బంగాళాఖాతంలోకి కలపాలా.. వద్దా.. అంటూ యువతను ప్రశ్నించారు. గుంటూరులో అమ్మాయిని ముగ్గురు రేప్‌ చేశారనీ, గోరంట్లలో కూడా విద్యార్థినిపై అత్యాచారం చేసి, హత్య చేస్తే పోలీసులు ఆత్మహత్యగా చిత్రీకరించారన్నారు. వెనుకబడిన వర్గాలే టీడీపీకి వెన్నెముక అనీ, వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటామన్నారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన ఇస్తే ఈ ప్రభుత్వం 25 శాతానికి కుదించిందన్నారు. రాష్ట్రం గంజాయి హబ్‌గా మారిందనీ, దీనికి పిల్లలు బానిసలు కాకుండా తల్లిదండ్రులు జాగ్రత్త పడాలన్నారు.  అన్నా క్యాంటీన,  పెళ్లి కానుక, ఉగాది, సంక్రాంతి, రంజానతోఫా ఏమయ్యాయని ప్రశ్నించారు. చంద్రన్న బీమా లేకుండా చేశారన్నారు. ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ప్రశ్నించినందుకు ఉమ్మడి జిల్లాలో కేసులు బనాయించారన్నారు. వైసీపీ ప్రజాఉద్యమాన్ని సోమందేపల్లి నుంచి కొనసాగిస్తామనీ ఇదే ఊపును ఇవ్వాలన్నారు. యువతకు ప్రభుత్వాన్ని దించే సత్తా ఉందన్నారు. అందుకు తనతో కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఉమ్మడి జిల్లా ప్రజల ప్రేమానురాగాలు మరువలేనన్నారు.

అడుగడుగునా నీరాజనం

టీడీపీ అఽధినేత చంద్రబాబుకు జనం నీరాజనం పలికారు. శుక్రవారం అనంతపురంలో టీడీపీ సమీక్షా సమావేశం ముగించుకుని జాతీయ రహదారి మీదుగా సోమందేపల్లికి బయల్దేరారు. రాప్తాడు నుంచి సోమందేపల్లి వరకు జనం అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. జాతీయ రహదారిలో ఎక్కడ చూసిన బారులు తీరారు. రాప్తాడు, సీకేపల్లి, కియ పరిశ్రమ వద్ద  క్రేన్లతో భారీ గజమాలలు వేసి, స్వాగతం పలికారు. సోమందేపల్లికి 4 గంటలకు రావాల్సి ఉండగా.. సభాస్థలికి 8.15 గంటలకు చంద్రబాబు చేరుకున్నారు. అర కిలోమీటరు రావడానికి గంటకుపైగా పట్టిందంటే జనం ఏస్థాయిలో పోటెత్తారో అర్థం చేసుకోవచ్చు. మధ్యాహ్నం నుంచి సోమందేపల్లిలో టీడీపీ శ్రేణులతోపాటు ప్రజలు.. చంద్రబాబు రాకకోసం ఎదురు చూశారు. సభ వద్దకు రాగానే హర్షధ్వానాలతో స్వాగతం పలికారు. చంద్రబాబును చూడటానికి చిన్నారుల నుండి వృద్ధుల వరకు అన్నివర్గాల వారు తరలివచ్చారు. చంద్రబాబు ఆలస్యమవడంతో ర్యాలీని రద్దు చేశారు.

      పర్యటన విజయవంతం

చంద్రబాబు ప్రసంగంలో సభికుల నుంచి హర్షధ్వానాలు వెల్లువెత్తాయి. సభపై అటుఇటు తిరుగుతూ సభకు వచ్చిన వారందరినీ ఉత్తేజపరిచారు. సో మందేపల్లి వీధులన్నీ పార్టీ శ్రేణులతో కిక్కిరిసిపోయాయి. అధినేత పర్యటన విజయవంతమవడం నాయకులు, శ్రేణుల్లో ఆనందం నింపింది. రాప్తాడు వద్ద పరిటాల శ్రీరామ్‌, పెనుకొండ కియ పరిశ్రమ వద్ద సవిత, సోమందేపల్లిలో బీకే పార్థసారథి క్రేన్లతో భారీ గజమాలలతో అధినేతకు స్వాగతం పలికారు. సభ ముగించుకుని చంద్రబాబు ప్రత్యేక కాన్వాయ్‌లో బెంగళూరు ఎయిర్‌పోర్టుకు వెళ్లారు. సమావేశంలో టీడీపీ పార్లమెంటు అధఽ్యక్షుడు బీకే పార్థసారథి, అనంత అధ్యక్షుడు కాలవ శ్రీనివాసులు, పీఏసీ చైర్మన పయ్యావుల కేశవ్‌, ఎమ్మెల్సీ బీటీ నాయుడు, మాజీ మంత్రులు అమర్‌నాథ్‌రెడ్డి, పల్లె రఘునాథరెడ్డి, యువనేత పరిటాల శ్రీరామ్‌, టీడీపీ రాష్ట్రకార్యనిర్వాహక కార్యదర్శి సవిత, మాజీ ఎంపీలు నిమ్మల కిష్టప్ప,  జేసీ దివాకర్‌రెడ్డి, గుండుమల తిప్పేస్వామి, కందికుంట వెంకటప్రసాద్‌, ఉమామహేశ్వర నాయుడు, హనుమంతరాయచౌదరి, ఈరన్న, చాంద్‌బాషా, చంద్రదండు ప్రకాశనాయుడు, ఎంఎస్‌ రాజు, వడ్డెర రాష్ట్ర సాధికార సమితి కన్వీనర్‌ వెంకట్‌, అంబికా లక్ష్మీనారాయణ, బీవీ వెంకటరాముడు, సుబ్బరత్నమ్మ పాల్గొన్నారు.




Updated Date - 2022-05-21T06:42:47+05:30 IST