కేఎల్ రాహుల్ కెప్టెన్సీ సరుకు కాదు: మనోజ్ తివారీ

ABN , First Publish Date - 2022-01-28T01:23:22+05:30 IST

దక్షిణాఫ్రికా పర్యటనలో కేఎల్ రాహుల్‌ను టీమిండియా స్టాండ్ ఇన్ కెప్టెన్‌గా సెలక్టర్లు నియమించడాన్ని

కేఎల్ రాహుల్ కెప్టెన్సీ సరుకు కాదు: మనోజ్ తివారీ

న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికా పర్యటనలో కేఎల్ రాహుల్‌ను టీమిండియా స్టాండ్ ఇన్ కెప్టెన్‌గా సెలక్టర్లు నియమించడాన్ని భారత మాజీ బ్యాటర్ మనోజ్ తివారీ తప్పుబట్టాడు. అతడేమీ కెప్టెన్సీ సరుకు కాదని, అతడిలో వారికేం కనిపించిందని ప్రశ్నించాడు. ఓ ఆటగాడు నాయకత్వ పాత్రలోకి మారాలంటే చాలా సమయమే పడుతుందన్నాడు. 

 

 ‘‘రాహుల్‌లో కెప్టెన్సీ మెటీరియల్‌ మీకు ఏం కనిపించింది? అతడిని కెప్టెన్‌గా తీర్చిదిద్దుతున్నామని వారు చెబుతున్నారు. నాకు తెలియక అడుగుతున్నా.. కెప్టెన్‌ను మీరెలా తయారు చేస్తారు?’’ అని ఓ ఇంటర్వ్యూలో తివారీ ప్రశ్నించాడు.


నాయకత్వ లక్షణం అనేది సహజ సిద్ధంగా రావాలని, అది అంతర్గతంగానే ఉంటుందని పేర్కొన్నాడు. కెప్టెన్‌ను తయారుచేయడం  సాధ్యమయ్యే పనేనని, అయితే, అందుకు సుదీర్ఘ సమయం పడుతుందని అన్నాడు. నిర్ణయాలు తీసుకోవడమెలా? అనే విషయం 20-25 మ్యాచ్‌లు ఆడితే గానీ తెలుసుకోలేరని, అయినప్పటికీ విజయంపై గ్యారెంటీ ఉండదని చెప్పుకొచ్చాడు. కాబట్టి అంతర్జాతీయంగా ఆడే ప్రతీ మ్యాచ్‌ భారత్‌కు ఎంతో ముఖ్యమని మనోజ్ తివారీ వివరించాడు. 


తాను రాహుల్ కెప్టెన్సీ నిందించడం లేదని, సెలక్టర్ల తీరు తనను నిరాశ పరిచిందని అన్నాడు. నాయకత్వ నైపుణ్యం ఉందో, లేదో చూడాల్సిన బాధ్యత వారిదేనని తివారీ అన్నాడు. గాయం కారణంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ దూరం కావడంతో దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌కు కేఎల్ రాహుల్ నాయకత్వం వహించాడు.


మూడు వన్డేల ఈ సిరీస్‌లో భారత్ 0-3 తేడాతో దారుణంగా ఓడింది. కాగా, వచ్చే నెలలో స్వదేశంలో వెస్టిండీస్‌తో జరగనున్న వన్డే, టీ20 సిరీస్ కోసం ప్రకటించిన భారత జట్టుకు రాహుల్ వైస్ కెప్టెన్‌గా కొనసాగుతాడు. 

Updated Date - 2022-01-28T01:23:22+05:30 IST