కబ్జాపై కన్నెర్ర

ABN , First Publish Date - 2022-05-24T06:13:44+05:30 IST

దొడగట్ట చెరువు పూడ్చివేత వెనుక మంత్రి ఉష శ్రీచరణ్‌ హస్తం ఉందని రైతులు ఆరోపిస్తున్నారు. సర్వే నెంబర్‌ 329లో 92.81 ఎకరాల విస్తీర్ణంలో ఈ చెరువులో 44 మందికి పట్టాలు ఉన్నట్లు రెవెన్యూ డైక్లాట్‌లో పేర్లు నమోదయ్యాయి.

కబ్జాపై కన్నెర్ర

మంత్రి తీరుపై రైతుల మండిపాటు

దుమారం రేపిన దొడగట్ట చెరువు పూడ్చివేత

టీడీపీ ఆధ్వర్యంలో రెండు రోజుల పోరుబాట

పనులను నిలిపివేయించిన రెవెన్యూ అధికారులు


నీరు జీవనాధారం. అందుకే పూర్వీకులు నీటి సంరక్షణకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. చెరువులు, కుంటలు తవ్వించారు. తలిపిరులు, వంకలు, వాగుల సంరక్షణకు పాటుపడ్డారు. కానీ ఇప్పుడు అవేమీ పట్టడం లేదు. బతికించే చెరువులను, మరణించాక అంత్యక్రియలు నిర్వహించే శ్మశానాలనూ వదలడం లేదు. ఆ కోవలోనిదే దొడగట్ట చెరువు కబ్జా. కొన్నేళ్ల క్రితం 92.81 ఎకరాల్లో ఏర్పాటైన ఈ చెరువు.. వాటికీ, వీటికీ పోనూ.. నీటి నిల్వ భూమి 33 ఎకరాలకు పరిమితమైందని రెవెన్యూ రికార్డుల ఆధారంగా తెలుస్తోంది. ఈ కాస్త భూమినీ వదలకుండా, స్వార్థ చింతనతో కొందరు అధికారులు, నాయకులు కబ్జాకు తెరలేపడం ఆ ప్రాంత రైతుల్లో తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. అందుకే.. టీడీపీ ఆందోళనకు వందలాదిగా కలిసొచ్చారు. ఏది ఏమైనా.. చెరువును కాపాడుకుంటామని ప్రతినబూనారు.


కళ్యాణదుర్గం


మంత్రి వైపే వేళ్లు

దొడగట్ట చెరువు పూడ్చివేత వెనుక మంత్రి ఉష శ్రీచరణ్‌ హస్తం ఉందని రైతులు ఆరోపిస్తున్నారు. సర్వే నెంబర్‌ 329లో 92.81 ఎకరాల విస్తీర్ణంలో ఈ చెరువులో 44 మందికి  పట్టాలు ఉన్నట్లు రెవెన్యూ డైక్లాట్‌లో పేర్లు నమోదయ్యాయి. ఇందులో 19.42 ఎకరాలు సీలింగ్‌ భూమిగా గుర్తించి, డైక్లాట్‌ నుంచి తొలగించారు. మరో 1.50 ఎకరాలను అనంతపురం-రాయదుర్గం హైవే కోసం తీసుకున్నారు. మిగిలిన 71.89 ఎకరాల భూమి రైతుల పేరిట రిజిస్టర్‌ అయింది. ఇందులో 33 ఎకరాల విస్తీర్ణం నీటి నిల్వ ప్రాంతంగా రెవెన్యూ రికార్డులలో నమోదైందని తహసీల్దార్‌ బ్రహ్మయ్య తెలిపారు.


కన్నేశారు..

     ప్రజాప్రయోజనాల దృష్ట్యా పూర్వీకులు చెరువును నిర్మించారు. చెరువు నిండితే భూగర్భ జలాలు పెరుగుతాయి. గూబనపల్లి, దొడగట్ట, కళ్యాణదుర్గం ప్రాంత బోరుబావుల్లో పుష్కలంగా నీరు ఉంటుంది. రైతులు వందలాది ఎకరాల్లో పంటలను సాగు చేస్తున్నారు. నాటి చెరువు భూ యజమానులు (కరణాలు) కాలక్రమంలో పలువురికి విక్రయించారు.

     ఇటీవల భూముల ధర పెరగడంతో చెరువుపై వైసీపీ నాయకుల కన్నుపడింది. కొందరు అధికార పార్టీ నాయకులు, మంత్రి ఉష శ్రీచరణ్‌ రైతుల నుంచి తక్కువ ధరకు చెరువు భూమిని కొన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ భూమిని విశాఖపట్నానికి చెందిన ఓ రియల్టర్‌కు విక్రయించి కోట్లు గడించారని ఆ పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. నిర్వహణ పేరిట మరో అగ్రిమెంట్‌ చేసుకున్నారని, అందులో భాగంగానే చెరువు పూడ్చివేతకు శ్రీకారం చుట్టారని అంటున్నారు.


చెరువులోనే నిద్ర

చెరువు పూడ్చివేతను టీడీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. చెరువు వద్ద రైతులతో కలిసి రెండు రోజులు ఆందోళన చేపట్టాయి. పార్టీ కళ్యాణదుర్గం నియోజకవర్గ ఇనచార్జ్‌ ఉమామహేశ్వరనాయుడు ఆధ్వర్యంలో టిప్పర్లు, ఎక్స్‌కవేటర్‌ను ఆదివారం అడ్డుకున్నారు. చెరువు కబ్జాకు పాల్పడుతున్న మంత్రిని బర్తరఫ్‌ చేయాలని నినదించారు. అర్ధరాత్రి అక్కడే వంటావార్పు చేశారు. చెరువులోనే నిద్రించారు. దీంతో స్పందించిన తహసీల్దార్‌ బ్రహ్మయ్య సోమవారం చెరువు వద్దకు వెళ్లి మూడు టిప్పర్లు, ఎక్స్‌కవేటర్‌ను సీజ్‌ చేసి తీసుకెళ్లారు. వాహనాలు సీజ్‌ చేసినట్లు పంచనామా ఇవ్వాలని ఉమా డిమాండ్‌ చేశారు. దీనికి తహసీల్దార్‌ స్పందించలేదు.


అప్పట్లోనే..

చెరువు విస్తీర్ణం, స్వరూపాన్ని తేల్చేందుకు 1974లో ప్రభుత్వం ఓ కమిటీని నియమించింది. చెరువు ప్రాంతం క్రయవిక్రయాలకు గురవుతోందని సమీప గ్రామ ప్రజలు గతంలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అప్పట్లో రిజిస్ట్రేషనలు నిలుపుదల చేయాలని సబ్‌ రిజిస్టర్‌ కార్యాలయానికి ఆదేశాలు జారీ అయిన్నట్లు సమాచారం. రియల్టర్లు, కొందరు రెవెన్యూ అధికారులు కుమ్మక్కై, 329 సర్వే నెంబర్‌ను సబ్‌ డివిజన చేస్తూ, క్రయ విక్రయాలు జరిగేలా రికార్డులను సృష్టించారు.


ఇలా.. అడ్డుకట్ట

     చెరువును కాపాడేందుకు టీడీపీ చేపట్టిన పోరాటానికి మద్దతుగా సమీప గ్రామాల నుంచి వందలాది మంది రైతులు తరలివచ్చారు. రెవెన్యూ అధికారుల, పాలకుల తీరును నిరసిస్తూ నినాదాలతో హోరెత్తించారు. న్యాయం జరిగేదాకా కదిలేది లేదని భీష్మించారు. 

     ఆందోళన ఉధృతం కావడంతో సీఐలు తేజోమూర్తి, శ్రీనివాసులు, ఎస్‌ఐలు ఆశాబేగం, పరశురాముడు, యువరాజ్‌, కృష్ణమూర్తి సిబ్బందితో కలిసి టీడీపీ శ్రేణులను చుట్టుముట్టారు. తహసీల్దార్‌ రెవెన్యూ రికార్డులను ఉమా మహేశ్వర నాయుడుకు చూపించారు. చెరువు స్థితిగతులను వివరించారు. 71.89 ఎకరాల్లో చెరువు ఉన్నప్పటికీ, 1926 క్రితం పట్టా భూమిగా డైక్లాట్‌లో ఉందని తెలియజేశారు. ఇందులో నీటి నిల్వ ప్రాంతం 33 ఎకరాలు మాత్రమే ఉందని వివరించారు. కాగా, చెరువులోకి నీరు రాకుండా పలుచోట్ల తూములను మట్టితో మూసేశారు.

     చెరువు ప్రాంతాన్ని సమగ్రంగా సర్వే చేయాలని, నీటి నిల్వ చేయాల్సిన భూమి ఎక్కడుందో హద్దులు ఏర్పాటు చేయాలని తహసీల్దారును ఉమా కోరారు. చెరువులో పట్టా భూమి ఉన్నప్పటికీ, పూడ్చకూడదని సుప్రీం కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని గుర్తు చేశారు. రైతు ప్రయోజనాల దృష్ట్యా చెరువు పూడ్చివేత పనులను తక్షణమే నిలిపివేయాలని, వాహనాలను సీజ్‌ చేయాలని నాయకులు డిమాండ్‌ చేశారు. 

     ఉన్నతాధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చేంత వరకు మట్టితవ్వకాలు, చెరువు పూడ్చివేత పనులు జరగవని తహసీల్దార్‌ హామీ ఇచ్చారు. దీంతో టీడీపీ నాయకులు ఆందోళనను విరమించారు. నిరసన కార్యక్రమంలో నాయకులు మురళి, తలారి సత్యప్ప, కొల్లప్ప, శ్రీరాములు, బిక్కి గోవిందప్ప, రామరాజు, ధనుంజయ, పోస్టు పాలన్న, నాగరాజు, విరుపాక్షి, వెంకటేశులు, సురేంద్ర, కొల్లాపురప్ప, మంజు, మధు, రోషన తదితరులు పాల్గొన్నారు.


తీవ్ర నష్టం..

నీటితో కళకళలాడుతున్న చెరువును పూడ్చివేస్తే రైతులకు తీవ్ర నష్టం జరుగుతుంది. చెరువు కారణంగానే మా బోరుబావుల్లో పుష్కలంగా నీరు వస్తోంది. లేదంటే పంటల సాగు కష్టమౌతుంది. చెరువును పూడ్చివేస్తే రైతులు వలస వెళ్లాల్సివస్తుంది.

 రైతు శ్రీనివాసులు, గూబనపల్లి


అడ్డుకుంటాం..

పురాతన చెరువును పూడ్చే హక్కు మంత్రి ఉష శ్రీచరణ్‌కు ఎవరిచ్చారు..? నిబంధనలకు విరుద్ధంగా పూడ్చివేస్తే అడ్డుకునేందుకు సిద్ధంగా ఉన్నాం. మా ప్రాంతానికి కొత్తగా వచ్చి సమస్యలు సృష్టిస్తే సహించేది లేదు. చెరువే మా గ్రామాలకు జీవనాధారం.

రైతు పెద్దన్న, గూబనపల్లి


Updated Date - 2022-05-24T06:13:44+05:30 IST