‘సీతారామ’ పనులను వేగిరం చేయండి : సీఎం

ABN , First Publish Date - 2021-01-22T05:08:25+05:30 IST

ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసే సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టు పనులను వేగిరం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నీటిపారుదలశాఖ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌లో సీఎం కేసీఆర్‌ గురువారం సీతారామ ప్రాజెక్టు పనులపై సమీక్షించారు.

‘సీతారామ’ పనులను వేగిరం చేయండి : సీఎం
హైదరాబాద్‌లో సీతారామప్రాజెక్టుపై సమీక్ష నిర్వహిస్తున్న సీఎం

నీటిపారుదల శాఖ అధికారులకు పలు సూచనలు

మంత్రి, ఉమ్మడిజిల్లా ఎమ్మెల్యేలతో కలిసి హైదరాబాద్‌లో సమీక్ష

ఖమ్మం, జనవరి21 (ఆంధ్రజ్యోతిప్రతినిధి) : ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసే సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టు పనులను వేగిరం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నీటిపారుదలశాఖ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌లో సీఎం కేసీఆర్‌ మంత్రులు పువ్వడ అజయ్‌కుమార్‌, వేముల ప్రశాంతరెడ్డి, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలతో కలిసి గురువారం సీతారామ ప్రాజెక్టు పనులపై సమీక్షించారు. కొత్త ఆయకట్టును సృష్టించడంతోపాటు సాగర్‌ఆయకట్టును కలుపుకొని పదిక్షల ఎకరాలకు సాగునీరు అందించే ఈ ప్రాజెక్టును కీలకమైందిగా భావించాలని, అధికారులకు సూచించారు. ఇటు గోదావరి అటు కృష్ణా నదుల మధ్య ఉన్న ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేయడానికి సీతారామ ఎత్తిపోతల ఫథకాన్ని మంజూరు చేశామని, దుమ్ముగూడెం పాయింట్‌వద్ద గోదావరినదిలో ఏడాది పొడవునా పుష్కలమైన నీరు అందుబాటులో ఉంటుందని, ఈ నీటిని ఉమ్మడి ఖమ్మం జిల్లా అంతటా సాగునీరుగా అందించాలన్నారు. దుమ్ముగూడెం నుంచి నీటిని ఎత్తి పోసి ఇల్లెందు వైపు, సత్తుపల్లి వైపు, పాలేరు రిజర్వాయర్‌ వైపు కాలువల ద్వారా, లిప్టుల ద్వారా తరలించాలని, సత్తుపల్లి, ఇల్లెందు వైపు వెళ్లేకాలువలకు సంబంధించిన సర్వే వెంటనే పూర్తిచేసి టెండర్లు పిలవాలన్నారు. మున్నేరు, ఆకేరు వాగులపై అక్విడెక్టు నిర్మించాలని, పాలేరు రిజర్వాయర్‌ వరకు కాలువల నిర్మాణం జూన్‌కల్లా పూర్తిచేయాలని సూచించారు. కృష్ణానదిలో నీటి సమస్య తలెత్తినప్పుడు గోదావరి జలాలను పాలేరు రిజర్వాయర్‌కు తరలించాలని, తద్వారా సాగర్‌ ఆయకట్టుకూడా సస్యశ్యామలమవుతుందని వివరించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, ఇరిగేషన్‌ ముఖ్య కార్యదర్శి రజత్‌కుమార్‌, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు, సీఎం కార్యదర్శి స్మితాసబర్వాల్‌, ఈఎంసీలు మురళీధర్‌రావు, హరేరాం, సీఈలు వెంకటకృష్ణ, శంకర్‌నాయక్‌, మదుసూదన్‌రావు, ఎస్‌ఈ శ్రీనివాసరెడ్డి, సత్తుపల్లి, పాలేరు, ఇల్లెందు ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, కందాల ఉపేందర్‌రెడ్డి, హరిప్రియ, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-22T05:08:25+05:30 IST