కలిసికట్టుగా పనిచేయండి.. ఉమ్మడి ఖమ్మం నేతలకు కేటీఆర్‌ దిశానిర్దేశం

ABN , First Publish Date - 2021-01-22T05:15:53+05:30 IST

ఇటు పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గం.. అటు ఖమ్మం కార్పొరేషన్‌కు జరగబోయే ఎన్నికలపై టీఆర్‌ఎస్‌ అధినాయకత్వం దృష్టి సారించింది. అయితే ఉమ్మడి జిల్లాలో అంతర్గతపోరు పెరుగుతోందన్న వార్తల నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా టీఆర్‌ఎస్‌ నేతల సమావేశం ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ అధ్యక్షతన హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో గురువారం జరిగింది.

కలిసికట్టుగా పనిచేయండి.. ఉమ్మడి ఖమ్మం నేతలకు కేటీఆర్‌ దిశానిర్దేశం
సమావేశానికి ముందు కేటీఆర్‌ను సత్కరిస్తున్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

మండలి, కొర్పొరేషన్‌ ఎన్నికల్లో పార్టీని గెలిపించాలని సూచన

వచ్చే అసెంబ్లీ పోరులో పదికి పది గెలవాలని ఆకాంక్ష 

హైదరాబాద్‌ ప్రగతిభవన్‌లో సమావేశం

ఖమ్మం, జనవరి 21 (ఆంధ్రజ్యోతిప్రతినిధి) : ఇటు పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గం.. అటు ఖమ్మం కార్పొరేషన్‌కు జరగబోయే ఎన్నికలపై టీఆర్‌ఎస్‌ అధినాయకత్వం దృష్టి సారించింది. అయితే ఉమ్మడి జిల్లాలో అంతర్గతపోరు పెరుగుతోందన్న వార్తల నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా టీఆర్‌ఎస్‌ నేతల సమావేశం ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ అధ్యక్షతన హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో గురువారం జరిగింది. జిల్లా నేతల మధ్య అంతరం పెరుగుతున్న తరుణంలో జరిగిన ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఖమ్మం, మహబూబాబాద్‌ ఎంపీలు నామ నాగేశ్వరరావు, మాళోత్‌ కవిత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, జడ్పీ, మునిసిపల్‌, కార్పొరేషన్‌ చైర్మన్లు, ఇతర ముఖ్య నాయకులు హాజరయ్యారు. అయితే తొలుత మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు మంత్రి కేటీఆర్‌తో ఏకాంతంగా సమావేశమై వెళ్లిపోయారు. ఆతర్వాత ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలతో సమీక్ష నిర్వహించిన కేటీఆర్‌ నేతల మధ్య సయోధ్య కుదురుస్తూ.. రాబోయే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కేటీఆర్‌ ఉమ్మడి జిల్లా నేతలకు దిశానిర్దేశం చేశారని, పనిలోపనిగా కొందరు నేతల తీరుపై ఒకింత తీవ్రంగా స్పందించారని సమాచారం. ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా నేతలు, ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, శ్రేణులు అంతా కలిసికట్టుగా పనిచేసి.. వచ్చే పట్టభద్రుల ఎమ్మెల్సీతోపాటు ఖమ్మం కార్పొరేషన్‌ ఎన్నికల్లో పార్టీని గెలిపించాలని దిశానిర్దేశం చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో లక్షా 31వేల పట్టభద్రుల ఓట్లు ఉన్నందున పోలింగ్‌ కేంద్రాల వారీగా బూత్‌ ఇన్‌చార్జ్‌లను, ప్రతీ 50మందికి పార్టీ ఇన్‌చార్జ్‌ను నియమించి పోలింగ్‌ అనుకూలంగా ఉండేలా చూడాలని సూచించిన ఆయన.. ఎమ్మెల్సీ అభ్యర్థిగా పల్లా రాజేశ్వరరెడ్డి పేరును పరోక్షంగా వెల్లడించినట్టు తెలిసింది ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత మార్చిలో ఖమ్మం కార్పొరేషన్‌కు ఎన్నికలు ఉండే అవకాశం ఉందని, మళ్లీ కార్పొరేషన్‌లో జెండా ఎగురవేసేలా పనిచేయాలని ఆదేశించారు. అలాగే గత అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ప్రతికూల ఫలితాలను దృష్టిలో పెట్టుకుని రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటి నుంచే కార్యాచరణ రూపొందించుకోవాలని, ఈసారి ఉమ్మడి జిల్లాలోని పది అసెంబ్లీ స్థానాలను గెలుచుకునేలా పనిచేయాలని సూచించారు. కొందరు ఎమ్మెల్యేల తీరు దురుసుగా ఉందని, వారు తీరు మార్చుకోవాలని, జిల్లాలో మాజీ ఎమ్మెల్యేలను కలుపుకొనిపోవాలని సూచించినట్టు తెలిసింది. సమావేశానికి ముందు ఎంపీ నామ నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో మరికొందరు కేటీఆర్‌తో సమావేశమయ్యారు. అయితే సమావేశంలో జిల్లాకు చెందిన నేతలెవరూ పార్టీలో ఉన్న విబేధాలపై పెదవి విప్పలేదని, కేవలం కేటీఆర్‌ ప్రసంగం వినేందుకే పరిమితమయ్యారని సమాచారం. 

కేటీఆర్‌ను సత్కరించిన మాజీమంత్రి తుమ్మల

సమావేశానికి ముందే మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులు, పార్టీ విషయాలు, రాజకీయసమీకరణపై ముచ్చటించారు. ఈ సందర్భంగా తుమ్మల నాగేశ్వరరావు కేటీఆర్‌ను సత్కరించారు. 

Updated Date - 2021-01-22T05:15:53+05:30 IST