70 మందికి గాయాలు

ABN , First Publish Date - 2020-10-28T08:44:23+05:30 IST

దేవరగట్టు మాళమల్లేశ్వరస్వామి ఆలయంలో సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకూ బన్ని వేడుక హోరాహోరీగా సాగింది.

70 మందికి గాయాలు

రద్దు చేసినా కొనసాగిన బన్ని

ఆంక్షలతో తగ్గిన భక్తుల సంఖ్య


ఆలూరు, అక్టోబరు 27: దేవరగట్టు మాళమల్లేశ్వరస్వామి ఆలయంలో సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకూ బన్ని వేడుక హోరాహోరీగా సాగింది. కర్రల సమరంలో 70 మంది వరకు గాయపడ్డారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. కొవిడ్‌ నేపథ్యంలో ఉత్సవాలను ప్రభుత్వం రద్దు చేసింది. పోలీస్‌, రెవెన్యూ అధికారులు ఈ విషయంపై విస్తృత ప్రచారం చేశారు. దీంతో సోమవారం రాత్రి 11 గంటల వరకు భక్తులు ఎవరూ బయటకు రాలేదు. తమ ప్రయత్నాలు ఫలించాయని పోలీసులు భావించారు. ఆ తరువాత ఉన్నట్లుండి భక్తులు కాలినడకన వందలాదిగా కర్రలతో తరలివచ్చారు.


దీంతో పోలీసులు అదుపు చేయలేకపోయారు. ఎప్పటిలాగానే ఈ ఏడాది కూడా బన్ని ఉత్సవం జరిగింది. అయితే పోలీసులు, అధికారుల ప్రయత్నాలు ఫలించి.. ఇతర ప్రాంతాల నుంచి ఎవరూ వేడుకలకు రాలేదు. కొవిడ్‌ నేపథ్యంలో స్థానికులు మాత్రమే వేడుకల్లో పాల్గొనేలా చేయడంలో అధికారులు సఫలమయ్యారు. ఆలూరుకు చెందిన ఈరన్న, నెరణికి గ్రామానికి చెందిన చంద్రన్న తలకు బలమైన గాయం కావడంతో బళ్లారి ఆసుపత్రికి తరలించారు. సమ్మతగేరి గ్రామానికి చెందిన రంగన్న, హెబ్బటం గ్రామానికి చెందిన నారాయణను ఆదోని ఆసుపత్రికి తరలించారు. 


భక్తుల సంఖ్య తగ్గింది: డీఎస్పీ

దేవరగట్టు ఉత్సవాల్లో భక్తుల సంఖ్య తగ్గిందని, ఇతర ప్రాంతాల నుంచి భక్తులు రాకుండా కట్టడి చేశామని ఆదోని డీఎస్పీ వినోద్‌కుమార్‌ తెలిపారు. బన్ని ఉత్సవాల అనంతరం మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉత్సవాలను రద్దు చేసినందున పరిసర గ్రామాల నుంచి మాత్రమే భక్తులు హాజరయ్యారని తెలిపారు. బన్ని వేడుకలో పలువురికి స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయని. ఇద్దరికి మాత్రమే తీవ్ర గాయాలు అయ్యాయని తెలిపారు. వారిని మెరుగైన చికిత్స కోసం బళ్లారి, ఆదోని ఆసుపత్రులకు తరలించినట్లు తెలిపారు. ఉత్సవాల్లో ఘర్షణలకు పాల్పడిన వారిని గుర్తించి కేసులు నమోదు చేస్తామని అన్నారు. సమావేశంలో సీఐలు పార్థసారథి, అబ్దుల్‌ గౌస్‌, ఎస్‌ఐలు శ్రీనివాసులు, విజయ్‌ పాల్గొన్నారు. 


ధరలపై భవిష్యవాణి

బన్ని ఉత్సవాల అనంతరం మంగళవారం ఉదయం 6 గంటలకు మల్లయ్యస్వామి భవిష్యవాణి (కార్నీకం) వినిపించారు. ఒక్కసారిగా స్వామి గోపరాక్‌ అని గట్టిగా అనగానే భక్తులందరూ మధ్యలో నిలబడి భవిష్యవాణిని విన్నారు. పత్తి క్వింటం రూ.4,800, జొన్న క్వింటం రూ.1,600 ధర పలుకుతుందని కార్నీకం వినిపించారు. ఈ ఏడాది 6 నెలలు, 3 నెలలు ధరలు నిలకడగా ఉంటాయని అన్నారు. స్వామి చెప్పిన భవిష్యవాణి తప్పకుండా జరుగుతుందని భక్తులు విశ్వసిస్తారు.


సంప్రదాయబద్ధంగా ఉత్సవాలు..ఆలయ కమిటీ చైర్మన్‌ శ్రీనివాసులు

దేవరగట్టు ఉత్సవాలు సంప్రదాయ బద్ధంగా జరిగాయని, కొవిడ్‌ కారణంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తుల సంఖ్య తగ్గిందని దేవరగట్టు ఆలయ కమిటీ చైర్మన్‌ గుమ్మనూరు శ్రీనివాసులు అన్నారు. దేవరగట్టులో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉత్సవాలను రద్దు చేసినా, ప్రజలు స్వామి వారిని దర్శించుకునేందుకు తరలిరావడం స్వామి వారి మహిమ అని పేర్కొన్నారు. ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించేందుకు సహకరించిన పోలీస్‌, రెవెన్యూ యంత్రాంగానికి, గ్రామాల పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు నారాయణస్వామి, మల్లికార్జున రెడ్డి పాల్గొన్నారు. 


దశాబ్దాలుగా పాటిస్తున్నాం..మల్లిగౌడ్‌, నెరణికి

దశాబ్దాలుగా వస్తున్న ఆచారాన్ని మేము పాటిస్తున్నాం. మా ఆరాధ్య దైవమైన మాళమల్లేశ్వరుడికి పూజలు జరిపి బన్ని జైత్రయాత్రలో పాల్గొంటాం. ఇది కర్రల సమరం కాదు.. సంప్రదాయం.

Updated Date - 2020-10-28T08:44:23+05:30 IST