పత్తి కొనేదెప్పుడు?

ABN , First Publish Date - 2020-10-30T10:33:10+05:30 IST

గూడూరు మండలంలోని పెంచికలపాడుకు చెందిన ఈ రైతు పేరు అలీఫ్‌ బాషా. తనకున్న ఐదెకరాలకు తోడు మరో ఐదెకరాలు కౌలుకు తీసుకుని పత్తి సాగు చేశాడు.

పత్తి కొనేదెప్పుడు?

ఇంకా మొదలవ్వని సీసీఐ కేంద్రాలు

11 చోట్ల ఏర్పాటుకు ప్రతిపాదన

ప్రభుత్వ అనుమతి కోసం ఎదురు చూపు

ఎడతెరిపి లేని వర్షాలతో రైతుకు తీవ్ర నష్టం

మిగిలిన దిగుబడికి మద్దతు ధర దక్కేనా..!


కర్నూలు(అగ్రికల్చర్‌), అక్టోబరు 29: గూడూరు మండలంలోని పెంచికలపాడుకు చెందిన ఈ రైతు పేరు అలీఫ్‌ బాషా. తనకున్న ఐదెకరాలకు తోడు మరో ఐదెకరాలు కౌలుకు తీసుకుని పత్తి సాగు చేశాడు. రూ.5 లక్షల దాకా పెట్టుబడి ఖర్చు అయింది. జూన్‌ నుంచి కురుస్తున్న వర్షాలకు 50 శాతం పంట నీట మునిగింది. తెగుళ్లు సోకి నష్టం జరిగింది. మిగిలిన పంట దిగుబడిని కేంద్రం ప్రకటించిన మద్దతు ధరకు అమ్ముకుందామని ఆశిస్తున్నాడు. సీసీఐ అధికారులు  ఇప్పటికీ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయలేదు. దసరాలోపు కొనుగోలు చేస్తే తనకు కేంద్రం ప్రకటించిన మద్దతు ధర లభిస్తుందని, లేదంటే వ్యాపారులకు అమ్మి నష్టపోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. 


ముంచెత్తుతున్న వర్షం

జిల్లాలో పత్తి పంటను వర్షం ముంచెత్తింది. రైతులు తీవ్రంగా నష్టపోయారు. పత్తికి కేంద్రం రూ.5,825 మద్దతు ధరను మద్దతు ధర ప్రకటించింది. జిల్లాలో పత్తి పంట సాధారణ విస్తీర్ణం 2,33,933 హెక్టార్లు కాగా, అంతకు మించి 2,69,619 హెక్టార్లలో సాగు చేశారు. రాష్ట్ర మొత్తం మీద పత్తి పంటను అత్యధికంగా సాగు చేసిన జిల్లాగా కర్నూలు గుర్తింపు పొందింది. ఆదోని, ఆలూరు, కర్నూలు, కోడుమూరు, ఎమ్మిగనూరు, నంద్యాల, డోన్‌, పత్తికొండ, పాణ్యం సబ్‌ డివిజన్లలో పత్తి పంట అత్యధికంగా సాగైంది. 


11 కొనుగోలు కేంద్రాలు

జిల్లాలో పత్తి కొనుగోలుకు మార్కెటింగ్‌ శాఖ అధికారులు 11 కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వ అనుమతి కోరారు. ఆదోని, ఎమ్మిగనూరు, డోన్‌, నంద్యాల, నందికొట్కూరు, ఆలూరు, ఆత్మకూరు, కోడుమూరు, పత్తికొండ, కోసిగి మార్కెట్‌ యార్డుల్లో సీసీఐ ఆధ్వర్యంలో కొనేలా ప్రతిపాదనలు పంపారు. దసరా పండుగలోపు జిల్లా వ్యాప్తంగా పత్తి కొనుగోళ్లను ప్రారంభించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటే తాము లాభపడుతామని, లేకుంటే మిగిలిన పత్తి కూడా వర్షాలకు పాడైపోతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 50 లక్షల క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. అయితే నిబంధనలను సడలిస్తేనే రైతులకు ప్రయోజనం చేకూరుతుంది.


తేమతో ఇబ్బందులు..

సీసీఐ నిబంధనల ప్రకారం 8 నుంచి 12 శాతం మాత్రమే తేమ ఉండాలి. అంతకు మించి తేమ ఉంటే ఆ పత్తిని కొనుగోలు చేసేందుకు సీసీఐ అధికారులు నిరాకరించే అవకాశం ఉందని మార్కెటింగ్‌ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే తేమ విషయమై మార్కెటింగ్‌ శాఖ అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. అధికారులు, వ్యాపారులు నిర్ధారించే తేమ శాతానికి భారీ వ్యత్యాసం ఉంటోంది. దీంతో ధర నిర్ణయంలో ఇబ్బందులు ఎదురవుతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. తేమ శాతాన్ని నిర్ధారించే పరికరాలను కొనుగోలు కేంద్రాల్లో అధికారులు ఏర్పాటు చేసిన దాఖలాలు లేవు. అధికారులు అవగాహన కల్పించకపోవడం వల్ల రైతులు తేమను పట్టించుకోకుండా  మార్కెట్‌ యార్డులకు తీసుకువెళుతున్నారు. ఈసారి వర్షాల వల్ల పత్తి రైతులు భారీగా దెబ్బతిన్నారు. సీసీఐ అధికారులు తేమతో పాటు కొన్ని నిబంధనలను సడలిస్తే వారికి ఊరట లభిస్తుంది. 


గులాబీ పురుగు బెడద

జిల్లాలో పత్తి పంటపై వైరస్‌ వేగంగా విస్తరిస్తోంది. రోజూ వర్షాలు కురుస్తుండటం వల్ల పొలాల్లో నీరు వారాల తరబడి నిల్వ ఉంటోంది. దీంతో గులాబి రంగు పురుగు విజృంభిస్తోంది. వైరస్‌తో పాటు గులాబి రంగు పురుగును నిర్మూలించేందుకు రైతులు ఎకరానికి రూ.10 వేల దాకా ఖర్చు చేస్తున్నారు. ఎకరాకు 12 క్వింటాళ్ల దిగుబడి రావాలని, వర్షం కారణంగా నాలుగైదు క్వింటాళ్ల దిగుబడి మాత్రమే అందే అవకాశం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


జిల్లాలో పత్తి పంట సాగు విస్తీర్ణం వివరాలు 

--------------------------------------------------------------------------------------------------

సబ్‌ డివిజన్‌ సాధారణ విస్తీర్ణం సాగైన విస్తీర్ణం (హెక్టార్లలో)

--------------------------------------------------------------------------------------------------

కర్నూలు 31,564 38,282

ఆదోని        63,397 65,662

ఎమ్మిగనూరు       41,224 51,234

ఆలూరు      43,302         51,175

డోన్‌     10,996        13,684

నందికొట్కూరు      8,230       15,491

ఆత్మకూరు     2,813 3,463

నంద్యాల     5,241 4,782

ఆళ్లగడ్డ 1,852 1,427

కోవెలకుంట్ల 2,537 3,046

పత్తికొండ 6,724 6,150

--------------------------------------------------------------------------------------------------

మొత్తం 2,33,933 2,69,619

--------------------------------------------------------------------------------------------------


నాణ్యమైన పత్తి తేవాలి.. సత్యనారాయణ చౌదరి, ఏడీఎం 

జిల్లాలో ఈసారి పత్తి పంటను ఎక్కువగా సాగు చేశారు. గతంతో పోలిస్తే అధికంగా ఖర్చు చేశారు. వర్షం, తెగుళ్ల కారణంగా రైతులు నష్టపోయారు. ఈ పరిస్థితుల్లో రైతులకు మద్దతు ధరను అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. క్వింటం పత్తికి రూ.5,825 మద్దతు ధరగా ప్రకటించాయి. ఈ నెలాఖరులోపు సీసీఐ ద్వారా పత్తి కొనుగోలుకు చర్యలు చేపడుతున్నాము. రైతులు నాణ్యమైన పత్తిని తెచ్చి మద్దతు ధర పొందాలి. సీసీఐ నిబంధనల ప్రకారమే తేమ శాతం ఉండేలా రైతులు జాగ్రత్త పడాలి. చిన్నపాటి మెలకువలు పాటిస్తే రైతులు మంచి ధరను పొందవచ్చు. దళారులను ఆశ్రయిస్తే తూకం, ధర విషయంలో మోసపోతారు. 


 

వెంటనే ప్రారంభించాలి..  క్రిష్ణ, పత్తి రైతు, పెంచికలపాడు

ఈ సంవత్సరం జూన్‌లోనే వర్షాలు మొదలయ్యాయి. ఐదెకరాల్లో పత్తి సాగు చేశాను. రోజూ వర్షాలు కురుస్తుండటం వల్ల 50 శాతం పంట నీట మునిగింది. చేతికందిన పత్తికైనా మద్దతు ధరకు అమ్ముదామని ఎదురు చూస్తున్నాను. సీసీఐ అధికారులు ఇంకా పత్తి కొనుగోలును ప్రారంభించలేదు. తొందరగా కొనుగోలు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. 

Updated Date - 2020-10-30T10:33:10+05:30 IST