మీ తల్లిదండ్రుల గురించి తెలుసుకోండి... యువతకు Anand Mahindra సలహా...

ABN , First Publish Date - 2022-06-05T20:13:11+05:30 IST

పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్ర యువతకు మంచి సలహా

మీ తల్లిదండ్రుల గురించి తెలుసుకోండి... యువతకు Anand Mahindra సలహా...

న్యూఢిల్లీ : పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్ర యువతకు మంచి సలహా ఇచ్చారు. తల్లిదండ్రులు అందుబాటులో ఉన్నపుడు వారితో బాగా మాట్లాడాలని, వారి గురించి ఎక్కువగా తెలుసుకోవాలని చెప్పారు. ఆయన గత నెలలో అమెరికాలోని ఓ విశ్వవిద్యాలయంలో మాట్లాడిన నేపథ్యంలో పెట్టిన తాజా పోస్ట్‌లో ఈ సలహా ఇచ్చారు. ఆయన తండ్రి హరీశ్ మహీంద్ర ఉద్యోగం కోసం చేసిన దరఖాస్తు నకలును ఆ విశ్వవిద్యాలయం ఆయనకు ఇవ్వడంతో చాలా సంతోషం వ్యక్తం చేశారు. 


ఆనంద్ మహీంద్ర తండ్రి హరీశ్ మహీంద్ర 1945లో అమెరికాలోని టఫ్ట్స్ విశ్వవిద్యాలయంలోని ది ఫ్లెచర్ స్కూల్ ఆఫ్ లా అండ్ డిప్లమసీలో ఉద్యోగం కోసం దరఖాస్తు చేశారు. ది ఫ్లెచర్ స్కూల్‌లో క్లాస్ డే అడ్రస్ ఇవ్వడం కోసం ఆనంద్ గత నెలలో అక్కడికి వెళ్ళారు. ఆయన తండ్రి 1945లో చేసిన దరఖాస్తు నకళ్ళను ఎంతో గౌరవప్రదంగా ఆయనకు ఆ స్కూల్ యాజమాన్యం అందజేసింది. ఈ పత్రాలను తప్పనిసరిగా 75 ఏళ్ళపాటు గోప్యంగా ఉంచాలని ఆ స్కూల్ నిబంధనలు చెప్తున్నాయని, అయితే ఈ గడువు గత ఏడాదితో ముగిసిందని ఆయన పేర్కొన్నారు. ఈ గడువు ముగియడం, తాను వెళ్ళడం ఒకేసారి జరగడం యాధృచ్ఛికమని, ఇది చాలా అద్భుతమని వ్యాఖ్యానించారు. 


ఆనంద్ పెట్టిన పోస్ట్‌లో తెలిపిన వివరాల ప్రకారం, ది ఫ్లెచర్ స్కూల్ నుంచి గ్రాడ్యుయేట్ అయిన మొదటి భారతీయుడు హరీశ్ మహీంద్ర. హరీశ్ చేసిన దరఖాస్తులో, ‘‘నా వృత్తిపరమైన లక్ష్యాల మేరకు , నేను ఫారిన్ సర్వీస్‌ను ఎంచుకున్నాను. ఎందుకంటే, నా దేశానికి అంతర్జాతీయ వ్యవహారాల్లో శిక్షణ పొందినవారు చాలా అవసరం. భారత దేశానికి ఇప్పటికీ తనదైన విదేశాంగ విధానం లేదు. ఈ యుద్ధం అనంతరం, భారత దేశం డొమీనియన్ స్టేటస్‌ను సాధించినా, పూర్తి స్వాతంత్ర్యాన్ని సాధించినా, ప్రపంచంలోని ఇతర దేశాలతో స్నేహపూర్వక, ఆర్థిక సంబంధాలను ఏర్పరచుకునేలా చూడటం కోసం శిక్షణ పొందినవారి అవసరం ఉంది. భారత దేశ విదేశాంగ విధానాన్ని బ్రిటిష్‌వారు నడపటానికి బదులుగా, భారత దేశంలో బ్రిటిషర్లు తమ ప్రయోజనాలను సాధించుకోవడానికి దోహదపడే తప్పుడు ప్రచారం వ్యాపించడానికి బదులుగా, భారత దేశంలో ఇండియన్ ఫారిన్ సర్వీస్‌, ప్రపంచవ్యాప్తంగా ఇండియన్ కాన్సులేట్స్  ఏర్పాటుకావడాన్ని చూడాలనుకుంటున్నాను. తద్వారా ఇతర దేశాల ముందు భారత దేశ వాస్తవ రూపాన్ని ఉంచడానికి, లీగ్ ఆఫ్ నేషన్స్‌లో స్వేచ్ఛాయుతమైన, సమాన భాగస్వామిగా భారత దేశం ఉండటం వల్ల పొందగలిగే ప్రయోజనాలను చూపించడానికి అవకాశం రావాలని  కోరుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు. 


తన తండ్రికిగల బలమైన ఆకాంక్షల గురించి తెలుసుకోవడం తనకు చాలా గర్వంగా ఉందని ఆనంద్ మహీంద్ర ఈ పోస్ట్‌లో పేర్కొన్నారు. భారత దేశం బ్రిటిష్ వలస రాజ్యంగా ఉన్నప్పటికీ ఆయన చాలా ధైర్యంగా ఈ స్టేట్‌మెంట్ ఇచ్చారన్నారు. ఆ ఆకాంక్షల గురించి తాను తన తండ్రితో ఎన్నడూ మాట్లాడలేదన్నారు. ‘‘యువతకు నా సలహా : మీ తల్లిదండ్రులు అందుబాటులో ఉన్నపుడే వారితో బాగా మాట్లాడండి, వారి గురించి మరింత ఎక్కువగా తెలుసుకోండి’’ అని సలహా ఇచ్చారు. 


భారత దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 సంవత్సరాలు అవుతున్న సమయంలో ఫ్లెచర్ స్కూల్ క్లాస్ డే అడ్రస్‌లో మాట్లాడిన తొలి భారతీయుడిగా తనకు గౌరవం లభించిందని తెలిపారు. అంతేకాకుండా తాను డీన్స్ మెడల్ స్వీకరించానని పేర్కొన్నారు. దీనిని తాను తన తండ్రి తరపున స్వీకరించినట్లు భావిస్తున్నానని చెప్పారు. 




Updated Date - 2022-06-05T20:13:11+05:30 IST