కొద్ది రోజుల్లో కొత్త సంవత్సరం.. ఈ ఏడాదిలో మిగిలిన రోజుల్లో ఈ పనులు చేయండి.. అప్పుడే బంగారు భవిష్యత్తు!

ABN , First Publish Date - 2021-12-13T18:00:46+05:30 IST

కొద్ది రోజుల్లో ఈ ఏడాది వెళ్లిపోతోంది..

కొద్ది రోజుల్లో కొత్త సంవత్సరం.. ఈ ఏడాదిలో మిగిలిన రోజుల్లో ఈ పనులు చేయండి.. అప్పుడే బంగారు భవిష్యత్తు!

కొద్ది రోజుల్లో ఈ ఏడాది వెళ్లిపోతోంది... కోటి ఆశలతో నూతన సంవత్సరం(2022) రాబోతోంది. కొత్త సంవత్సరాన్ని స్వాగతిస్తూ, ముగిసిపోతున్న ఈ సంవత్సరం చివరిలో మనం ఏం చేయాలి? దీని గురించి మానసిక వైద్య నిపుణులు ఏమంటున్నారు? ఈ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. సంవత్సరంలోని చివరి మాసంలో ఆత్మావలోకనం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ విధమైన ఆత్మావలోకనం ద్వారా 2022లో విజయం సాధించేందుకు పక్కా ప్రణాళిక వేసుకోగుతాం. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఎంత కష్టపడుతున్నప్పటికీ అన్ని పనుల్లోనూ విజయవంతం కాలేం. అటువంటప్పుడు మంచి ప్లానింగ్‌తో వ్యవహరిస్తే  విజయం సాధించేందుకు అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే ఈ ఏడాది చివరిలో మీరు ఆత్మపరిశీలన చేసుకోవడం ద్వారా ఎక్కడ తప్పులు చేస్తున్నారో తెలుసుకోగలుగుతారు. మన అలవాట్లను మార్చుకోవడం ద్వారా మనల్ని మనం మరింతగా మెరుగు పరుచుకోగలమని అప్పుడే గ్రహించగలుగుతాం. మనం ఎటువంటి అలవాట్లను మార్చుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.


నాకు అన్నీ తెలుసు

ఇది ఎవరికీ ఉండకూడని అలవాటు. ఈ అలవాటు ఉన్నవారు తమ గురించి మాత్రమే ఆలోచిస్తూ, ఇతరుల అభిప్రాయాలను అస్సలు పట్టించుకోరు. అటువంటప్పుడు జీవితంలో తప్పుడు నిర్ణయాలు తీసుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది. రాబోయే సంవత్సరంలో మీరు ఏదైనా నూతన పనిని ప్రారంభించాలనుకుంటే.. మీకు ఆ ఫీల్డ్‌పై అవగాహన లేకపోతే, మీరు ఇతరుల సలహాలు తప్పకుండా తీసుకోవాలి. లేదంటే అనవసర శ్రమతో పాటు మీ సమయం వృథా అవుతుంది. నేను సర్వజ్ఞుడినని, నేను తలచుకుంటే ఏమైనా చేయగలనే ధోరణి మీలో ఉంటే వెంటనే ఆ అభిప్రాయాన్ని తొలగించుకోండి. 

ఒక సమూహంలో సభ్యుడినని గుర్తించండి

మీ కార్యాలయంలో, లేదా మీరు ప్రతిరోజూ కలిసి పనిచేసే వ్యక్తులతో పరస్పరం సంభాషించినట్లయితే వారి ఆలోచనలు, అభిప్రాయాలు తెలుస్తాయి. అప్పుడు మీకు పలు విషయాలపై అవగాహన పెరుగుతుంది. ఇలా చేయని పక్షంలో మీ అభివృద్ధి మార్గం మూతపడుతుంది.  అందుకే మంచి వ్యక్తుల సహకారం తీసుకోండి నిరంతరం ఒకే తరహాలో ఆలోచించే వ్యక్తుల మధ్య కాకుండా.. రకరకాల మనస్తత్వాలు కలిగినవారితో తిరగండి. అప్పుడు మీ ఆలోచనా శక్తి మరింత విస్తృత మవుతుంది. విజయం మీకు చేరువుతుంది. 

పర్ఫెక్షన్ ట్యూన్

మనం చేస్తున్న పని ఎప్పుడూ సక్రమంగా జరగాలి. ఈ విషయంలో రాజీ పడకూడదు. ఏదైనా పనిని మీరు నిర్ణీత సమయానికి పూర్తి చేయాలనుకుంటే.. అందుకు అనుగుణమైన ప్రణాళికను అమలు చేయండి. అంతేగానీ మీరు చేయాలనుకున్న పనులను వాయిదా వేస్తుంటే, అది ఎప్పటికీ పూర్తికాదు. అలాగే చేస్తున్న పనికి పర్ఫెక్షన్ ట్యూన్ అవసరం. చేయాల్సిన పనికి సంబంధించిన బలాలు, బలహీనతల గురించి లెక్కలు వేయకండి. ఇలా చేస్తే మీరు బలహీనపడేందుకు అవకాశం ఏర్పడుతుంది. మీరు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని, వాటిని ఒక్కొక్కటిగా చేసుకుంటూ ముందుకు సాగాలనే విషయాన్ని గుర్తుంచుకోండి. 

సమయాన్ని వృథా చేయకండి

మీరు ఎప్పుడూ ఆన్‌లైన్‌లో ఉంటున్నారా? ఈ మెయిల్, మెసెంజర్‌లలో వచ్చే వ్యాఖ్యలన్నింటికీ ప్రతిస్పందిస్తుంటే మీరు మీ విలువైన సమయాన్ని వృథా చేసుకున్నట్లే. ఈ అలవాటు కారణంగా మీరు మీ స్మార్ట్‌ఫోన్‌కు అతుక్కుపోతారు. రోజులో రెండు-మూడు గంటల సమయాన్ని మాత్రమే ఈ పనుల కోసం వినియోగించాలి. మిగిలిన సమయంలో ప్రయోజనకర పనులను చేయవచ్చు లేదా కొత్త విషయాలు నేర్చుకోవచ్చు.


విజయం సాధించాలంటే..

మీరు ఎప్పుడూ 100% విజయానికి గ్యారెంటీ ఉన్న పనులనే చేస్తుంటే, పెద్దపెద్ద పనులు చేయలేరు. 'నో పెయిన్, నో గెయిన్' అనేది జీవితంలో విజయం సాధించడానికి ఖచ్చితంగా ఉపయోగపడే మంత్రం. మీరు ఏదో ఒక పనిని మాత్రమే చేస్తుంటే దానిలో ఖచ్చితంగా ఇబ్బందులు ఎదురుకావచ్చు. విజయంతో వచ్చే ఆనందం రిస్క్‌తో పోలిస్తే ఎంతని మనసులో అనుకోవాలి. మీరు చేయబోయే పనులకు ప్లాన్-బిని సిద్ధం చేసుకోవాలి. 

నిర్ణయం తీసుకునే సామర్థ్యాన్ని పెంచుకోండి

అనిశ్చితి లేదా గందరగోళ పరిస్థితులు పురోగతిని అడ్డుకుంటాయి. అటువంటప్పుడు సరైన నిర్ణయం తీసుకోవడం ఎంతో అవసరం. సరైన నిర్ణయం మంచి మార్పునకు దారి తీస్తుంది. 

క్రమశిక్షణ అలవర్చుకోండి

అస్థిరమైన జీవనశైలి.. శరీరానికి, మనస్సుకు హానికరం. అందుకే క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని అలవర్చుకోవాలి. ఉదయాన్నే లేవడం, అనుకున్న సమయానికి పని పూర్తి చేయడం, అన్నీ క్రమపద్ధతిలో చేయడం.. మీ ప్రగతికి మొదటి మెట్టు అనే విషయాన్ని గ్రహించండి. 

ఓపెన్ మైండ్‌తో ఉండండి

మీరు పక్షపాత వైఖరితో ఉండకూడదు. మీకు తెలిసిన దానికి, మీరు భావిస్తున్నదానికే కట్టుబడి ఉండకండి.  అనునిత్యం ఓపెన్ మైండ్‌తో ఉండండి. కొత్త విషయాలు నేర్చుకుని, అవసరమైనప్పుడు వాటిని జీవితంలో అమలు చేయండి. ఇతరులతో మాట్లాడుతూ వారి అభిప్రాయాలు తెలుసుకోండి. పరిస్థితిని బట్టి పనితీరును మార్చుకుంటూ ముందడుగు వేయండి. 

Updated Date - 2021-12-13T18:00:46+05:30 IST