ప్రమాదమని తెలిసినా...

ABN , First Publish Date - 2022-05-26T06:14:28+05:30 IST

ప్రజలకు వైద్య సేవలందించి రోగాలను నయంచేయాల్సిన ఆస్పత్రులు కొత్త వ్యాధులను అంటించేలా వ్యవహరిస్తున్నాయి. ఆస్పత్రుల్లోని మెడికల్‌ వ్యర్థాలను ని బంధనల మేరకు ధ్వంసం(డిస్పోజ్‌) చేయాల్సి ఉండ గా, ఇష్టానుసారంగా బయట పడేస్తున్నారు. దీంతో ప్రాణాంతక వ్యాధులు వ్యాపించే అవకాశం ఉంది.

ప్రమాదమని తెలిసినా...
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిని తనిఖీచేస్తున్న డీఎంహెచ్‌వో కోట చలం

 మెడికల్‌ వ్యర్థాలను పడేస్తున్న ఆస్పత్రులు

 డిస్పోజల్‌ ఏజెన్సీకి అప్పగించని యాజమాన్యాలు

 పట్టించుకోని పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు


సూర్యాపేట(కలెక్టరేట్‌): ప్రజలకు వైద్య సేవలందించి రోగాలను నయంచేయాల్సిన ఆస్పత్రులు కొత్త వ్యాధులను అంటించేలా వ్యవహరిస్తున్నాయి. ఆస్పత్రుల్లోని మెడికల్‌ వ్యర్థాలను ని బంధనల మేరకు ధ్వంసం(డిస్పోజ్‌) చేయాల్సి ఉండ గా, ఇష్టానుసారంగా బయట పడేస్తున్నారు. దీంతో ప్రాణాంతక వ్యాధులు వ్యాపించే అవకాశం ఉంది.  దీన్ని నియంత్రించాల్సిన పొల్యూషన్‌ కంట్రోల్‌బోర్డు అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.


ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లోని వ్యర్థాలను సేకరించి వాటిని ప్రజా సంచారానికి దూ రంగా తరలించాలి. అక్కడ వ్యర్థాలను వేరుచేసి డిస్పోజ్‌ చేయాలి. ఈ పనిని నిర్వహించేందుకు ప్రభుత్వం ఉమ్మడి జిల్లా మొత్తా న్ని ఓ ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించింది. సదరు ఏజెన్సీ నిర్వాహకులు నిత్యం ఆస్పత్రులకు వెళ్లి మెడికల్‌ వ్యర్థాల ను సేకరించాలి. వాటిని సదరు ఏజె న్సీ కంపెనీకి తరలించి డిస్పోజ్‌ చే యాలి. అందుకు ఆస్పత్రుల యాజమాన్యాలు పడకల సంఖ్యను బట్టి ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఖర్చును తప్పించుకునేందుకు ఆస్పత్రుల యాజమాన్యాలు నిబంధనలు పాటించకుండా వ్యర్థాలను ఇష్టానుసారంగా బయట పడేస్తున్నాయి. సాధారణ వ్యర్థాలుగా చాలా సందర్భాల్లో మునిసిపాలిటీ సిబ్బంది తీసుకెళ్తున్నారు.


ఉమ్మడి జిల్లాలో 614 ప్రైవేట్‌ ఆస్పత్రులు

ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు వద్ద 614 ప్రైవేటు ఆస్పత్రులు పేరు నమోదు చేసుకున్నాయి. కానీ, 262 ఆస్పత్రులు మాత్రమే ఏజెన్సీకి మెడికల్‌ వ్యర్థాలను ఇస్తున్నాయి. మిగ తా ఆస్పత్రులు ప్రమాదకర వ్యర్థాలను బయటపడేస్తున్నాయి. నిత్యం 100 ఓపీ పేషంట్లు ఉండే ఆస్పత్రులు, ఆపరేషన్లు, ప్రసూతీలు చేసే ఆస్పత్రులు సైతం వ్యర్థాలను ఏజెన్సీకి అప్పగించడం లేదు. కొన్ని సందర్భాల్లో ఆస్పత్రుల్లో ప్రమాదకర వ్యాధులు ఉన్న వారికి వైద్యసేవలు అందిస్తారు. వారికి ఉపయోగించిన మెడికల్‌ వ్యర్థాలను బయట పడవేస్తే పరిసరాలు కలుషితమవుతాయి. దీంతో వ్యాధులు వ్యాపించే అవకాశం ఉంది. ప్రధానంగా సిరంజీలు, నీడిల్స్‌, గ్లూకోజ్‌ బాటిల్స్‌, కాటన్‌, శస్త్ర చికిత్సల్లో తొలగించిన శరీర అవయవాల భాగాలను జాగ్రత్తగా భద్రపరిచి డిస్పోజల్‌ ఏజెన్సీకి అప్పగించాలి. అదేవిధంగా వ్యర్థాలను 48గంటల కంటే ఎక్కువ సమయం ఉంచకూడదు.


ఉమ్మడి జిల్లా ఒక్క ఏజెన్సీకి

ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లోని వ్యర్థాలను సేకరించి డిస్పోజ్‌ చేసే బాధ్యతను ఓ ప్రైవేటు ఏజెన్సీకి ప్రభు త్వం అప్పగించింది. సదరు ఏజెన్సీ ఉమ్మడి జిల్లాలో సేకరించిన వ్యర్థాలను భువనగిరి సమీపంలోని కంపెనీలో డిస్పోజ్‌ చేస్తోంది. ఆస్పత్రుల నుంచి వ్యర్థాలను సేకరించినందుకు 20పడకల ఆస్పత్రి అయితే నెలకు రూ.3వేలు, 30 పడకల ఆస్పత్రి అయితే నెలకు రూ.4500, 50 పడకల ఆస్పత్రి అయితే రూ.7500, అదేవిధంగా 100పడకల ఆస్పత్రి రూ.15 వేలు చెల్లించాల్సి ఉంటుంది. అదే విధంగా వ్యర్థాలను నిల్వ చేసేందుకు సదరు ఏజెన్సీ ప్రత్యేక కవర్లను ఆస్పత్రులకు అందిస్తుంది. వాటి సైజు ను బట్టి సంబంధిత ఆస్పత్రి యాజమాన్యాలే కవర్లకు డబ్బు చెల్లించాలి.


ప్రభుత్వ ఆస్పత్రులు సైతం..

ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రులు సైతం మెడికల్‌ వ్యర్థాల నిర్వహణలో నిబంధనలు పాటించడం లేదు. సంబంధిత ఏజెన్సీకి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కేవలం 12 ప్రభుత్వ ఆస్పత్రులు మాత్రమే వ్యర్థాలు అందిస్తున్నాయి. నల్లగొండ, సూర్యాపేట, మిర్యాలగూడ, భువనగిరి, కోదాడ, హుజూర్‌నగర్‌, రామన్నపేట, దేవరకొండ, చౌటుప్పల్‌, నకిరేకల్‌, నాగార్జునసాగర్‌, ఆలేరు ప్రభుత్వ ఆస్పత్రులు మాత్రమే వ్యర్థాలను అప్పగిస్తున్నాయి. మిగతా ఆస్పత్రులు వ్యర్థాలను బయటపడేస్తున్నాయి. ఇటీవల సూర్యాపేట జిల్లా కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి వైద్యశాఖాధికారులతో సమావేశం నిర్వహించి మెడికల్‌ వ్యర్థాల విషయంలో కచ్చితంగా నిబంధనలు పాటించాలని ఆదేశించారు. అంతేగాక ప్రభుత్వ ఆస్పత్రుల వ్యర్థాల నిర్వహణకు అయ్యే ఖర్చును చెల్లిస్తామని స్పష్టం చేశారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు జిల్లాలోని పలు ప్రైవేటు ఆస్పత్రులను డీఎంహెచ్‌వో తనిఖీ చేసి మెడికల్‌ వ్యర్థాలను ఏజెన్సీకి అప్పగించాలని, లేదంటే చర్యలు తప్పని హెచ్చరించారు.


పట్టించుకోని పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు

ఆస్పత్రులు మెడికల్‌ వ్యర్థాలను బయటపడేస్తుండటంతో పరిసరాలు కలుషితమవుతున్నాయి. దీన్ని నియంత్రిచాల్సిన పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు అధికారులు పట్టించుకోవడం లేదు. జిల్లాలో పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు నుంచి 614 ఆస్పత్రులు అనుమతులు పొందగా, అందులో కేవలం 262 ఆస్పత్రులు మాత్రమే వ్యర్థాలను ఏజెన్సీకి అప్పగిస్తున్నాయి. ఈవిషయమై సంబంధిత ఏజెన్సీ నిర్వాహకులు ఇప్పటికే పలుమార్లు పొల్యూషన్‌ బోర్డు అధికారులకు ఫిర్యాదుచేసినా పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి.


అమలుకు నోచుకోని బార్‌కోడింగ్‌ విధానం

ఆస్పత్రుల్లోని మెడికల్‌ వ్యర్థాలను డిస్పోజ్‌ ప్రక్రియలో బార్‌కోడింగ్‌ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం 2016లో జీవో జారీచేసింది. అయితే నేటికీ ఉమ్మడి జిల్లాలో బార్‌ కోడింగ్‌ విధానం అమలు కావడం లేదు. బార్‌కోడింగ్‌ విధానంతో వ్యర్థాల నిర్వహణ సక్రమంగా ఉంటుందని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినా ఉమ్మడి జిల్లాలో అమలుకు నోచుకోవడం లేదు.


నిబంధనలు పాటించాల్సిందే: డాక్టర్‌ కోట చలం, సూర్యాపేట డీఎంహెచ్‌వో

మెడికల్‌ వ్యర్థాలను డిస్పోజ్‌ చేసే విషయంలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు విధిగా నిబంధనలు పాటించాల్సిందే. ఈమేరకు అన్ని ఆస్పత్రులకు ఇప్పటికే ఆదేశాలు సైతం జారీ చేశాం. పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు వద్ద ఆస్పత్రులు పేరును నమోదుచేసుకోవాలి. బోర్డు నిబంధనల ప్రకారం మెడికల్‌ వ్యర్థాలను ఏజెన్సీకి అప్పగించాలి. నిబంధనలు పాటించని ఆస్పత్రులపై చర్యలు తీసుకుంటాం.


Updated Date - 2022-05-26T06:14:28+05:30 IST