జ్ఞానమార్గమే అత్యున్నతం!

ABN , First Publish Date - 2020-12-18T05:30:26+05:30 IST

జ్ఞానం ఎలా పొందాలి? జ్ఞానం ఎలా వస్తుంది? ఈ విషయాల గురించి భగవద్గీత నాలుగో అధ్యాయం 38వ శ్లోకంలో చెప్పాడు శ్రీకృష్ణపరమాత్మ.

జ్ఞానమార్గమే అత్యున్నతం!

జ్ఞానం ఎలా పొందాలి? జ్ఞానం ఎలా వస్తుంది? ఈ విషయాల గురించి భగవద్గీత నాలుగో అధ్యాయం 38వ శ్లోకంలో చెప్పాడు శ్రీకృష్ణపరమాత్మ. 



న హి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే

తత్స్వయం యోగసంసిద్ధః కాలేనాత్మని విందతి


ఎప్పుడూ ఏదీ ఒక్క క్షణంలో రాదు. ఎంతో కష్టపడితే గానీ రాదు. జ్ఞానం కావాలంటే క్షణ క్షణం కష్టపడాలి. డబ్బు కావాలంటే రూపాయి రూపాయి పోగు చేయాలి. జ్ఞాన సాధనలో ఉన్న వాడికి ప్రతి క్షణం విలువైనదే. డబ్బు సంపాదించే వాడికి ప్రతి రూపాయి విలువైనదే. ‘‘అర్జునా! ఎంతో మంది ఎన్నో మాటలు చెబుతారు. ‘కర్మమార్గం’ అంటారు, ‘భక్తిమార్గం’ అంటారు, ‘యోగమార్గం’ అంటారు. కానీ జ్ఞానమార్గాన్ని మించింది లేదు. దాన్ని స్వయంగానే, కాలం గడుస్తున్న కొద్దీ, తనలోనే పొందుతారు. జీవితం నేర్పిస్తుంది.’’ అని చెప్పాడు శ్రీకృష్ణపరమాత్మ. పాలు కాచాం. అందులో కాస్త మజ్జిగ చుక్క వేస్తే పెరుగు అవుతుంది. అది ఇంకో రూపం. దాన్ని మళ్లీ చిలికితే వెన్న వచ్చింది. అది మరో రూపం. దాన్ని మళ్లీ కాచాం. నెయ్యి వచ్చింది. ఇంకో రూపం. పచ్చి పాల రూపానికి, నెయ్యికి సంబంధం ఉందా? కానీ ఇదంతా తోడు పెట్టడం వల్ల, అగ్ని మీద పెట్టడం వల్ల జరిగింది. అలాగే జీవితాన్ని కాచాలి. నెయ్యి అంతిమమైన రూపం. దాన్ని ఏం చేసినా రూపం మారదు. మళ్లీ పాలుగా మారదు. జీవిత అనుభవాన్ని కాచితే జ్ఞానం కూడా అలాగే వస్తుంది.



గరికిపాటి నరసింహారావు

Updated Date - 2020-12-18T05:30:26+05:30 IST