తెలంగాణలో కేసీఆర్‌ కుటుంబ పాలన

ABN , First Publish Date - 2022-10-01T05:07:58+05:30 IST

తెలంగాణలో కేసీఆర్‌ కుటుంబ పాలన

తెలంగాణలో కేసీఆర్‌ కుటుంబ పాలన
స్వాతంత్ర సమరయోధుడు కోల రామేశ్వరం చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న కోదండరాం

 ప్రజల చెంతన ఉండాల్సిన పాలన చేజారి పోయింది

 తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం

ఎల్కతుర్తి, సెప్టెంబరు 30: సకల జనులు కొట్లాడి సాధించుకున్న తెలంగాణ కేసీఆర్‌ కుటుంబంలో బందీ అయిందని, ప్రజల చెంతన ఉండాల్సిన పాలన చేజారి పోయిందని తెలంగాణ జన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు కోదండరాం ఆవేదన వ్యక్తం చేశారు. ఎల్కతుర్తి మండలం బావుపేట గ్రామానికి చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు కోల రామేశ్వరం ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా ఆయన కుటుంబ సభ్యులను శుక్రవారం పరామర్శించి ప్రగఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 

మహానీయుల ఆశయాలను నెరవేర్చడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. కేవలం డబ్బు సంపాదన కోసమే రాజకీయం చేస్తూ విలువలను దిగజార్చారని వాపోయారు. మహానీయుల చరిత్రలు, ఆనవాళ్లను, విలువలను మర్చిపోయారని వాటిని తిరిగి పునరుద్ధరించుకుని సమాజాన్ని చక్కదిద్దుకున్నప్పుడే నాయకత్వం బలపడుతుందన్నారు. తెలంగాణ రాష్ట్ర  ఏర్పాటు కోసం 1996లో వరంగల్‌ నగరంలో తెలంగాణ విద్రోహ దినోత్సవాన్ని జరుపుకున్న సమయంలో కేసీఆర్‌ తెరమీదికి రాలేదన్నారు. 2011లో సహాయ నిరాకరణ ఉద్యమం, మిలియన్‌ మార్చ్‌, 40 రోజుల పాటు సకల జనుల సమ్మె చేయడం వల్ల ప్రజల ఆకాంక్షను గుర్తించి రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారన్నారు. హైదరాబాద్‌ ట్యాంక్‌ బండ్‌పై సాగరహారం చేపట్టి నేటికి 10 యేళ్లు గడిచాయన్నారు. ఆ సాగరహారానికి కేసీఆర్‌ హాజరుకాలేదని ఆరోపించారు. 

ప్రజాధనం దుర్వినియోగానికి పాల్పడుతూ దేశాలు తిరగడానికి విమానాలు కొనుగోలు చేస్తున్నాడని మండిపడ్డారు. కేసీఆర్‌ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను తన అనుభవంలో ఎప్పుడూ చూడలేదన్నారు. మహానీయుల అడుగుజాడల్లో నడుస్తూ చేజారిన తెలంగాణను తిరిగి తెచ్చుకుందామని కోదండరామ్‌ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీజేఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు అంబటి శ్రీనివాస్‌, బైరి రమేష్‌, హనుమకొండ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ ఎ.తిరుపతి, జాతీయ బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి కోల జనార్దన్‌ మాణిక్యాపూర్‌ మాజీ సర్పంచ్‌ రాజయ్య, నాయకులు సోమ రాంమూర్తి, కోల ప్రకాష్‌, సబ్బు కొంరెల్లి, గ్రామస్ధులు తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2022-10-01T05:07:58+05:30 IST