కోడి కత్తిపై వేటెయ్యండి

ABN , First Publish Date - 2022-01-05T08:55:21+05:30 IST

సంక్రాంతి పండగ సంప్రదాయం పేరుతో కోడికి కత్తి కట్టి పందేలు నిర్వహిస్తే అడ్డుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. జంతు హింస అరికట్టేందుకు గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పునకు..

కోడి కత్తిపై వేటెయ్యండి

  • సంక్రాంతి పండగ బరులపై ఉక్కుపాదం..
  • కోడి కత్తుల తయారీ, విక్రయాలపై నిఘా
  • ఆడించే బాధ్యులపై బైండోవర్‌ కేసులు..
  • డ్రోన్లతో పసిగట్టి జూదం డెన్లపై దాడులు
  • కోర్టు మార్గదర్శకాలు అమలుచేయండి..
  • ఎస్పీలకు పోలీసు శాఖ ఆదేశాలు
  • కోడి పందేలను ఆపించండి.. హైకోర్టులో వ్యాజ్యం


అమరావతి, జనవరి 4(ఆంధ్రజ్యోతి): సంక్రాంతి పండగ సంప్రదాయం పేరుతో కోడికి కత్తి కట్టి పందేలు నిర్వహిస్తే అడ్డుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. జంతు హింస అరికట్టేందుకు గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పునకు అనుగుణంగా ముందస్తు చర్యలు చేపట్టాలని పోలీసు శాఖ   ఎస్పీలకు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. ఎక్కడికక్కడ ముందస్తుగా ర్యాలీలు చేపడుతూ ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని పోలీసు ప్రధాన కార్యాలయం దిశానిర్దేశం చేసింది. అయితే మంత్రు లు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజా ప్రతినిధుల సహకారంతో నడిచే కోడి పందేలను అరికట్టడం పోలీసులకు సాధ్యమేనా? అనే ప్రశ్న మొదలైంది. ఏటా సంక్రాంతి పండగ వచ్చిందంటే చిత్తూరు జిల్లాలో జల్లికట్టు, కోస్తాలో కోడి పందేలపై వివాదం రేగుతూనే ఉంటుంది. దీనిపై జంతు ప్రేమికులు, పక్షి ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తుంటారు. ఈ నేపథ్యంలో  పోలీసుశాఖ రంగంలోకి దిగింది. క్షేత్ర స్థాయిలో కోడి పందేలు నిర్వహించే వారి జాబితా సేకరించాలని పోలీసుస్టేషన్ల ఎస్‌హెచ్‌వోలకు ఎస్పీ లు ఆదేశాలిచ్చారు. గత ఐదేళ్లుగా పోలీస్‌ స్టేషన్ల పరిధిలో కోడికి కత్తికట్టి పందేలు నిర్వహించారు.. వాటి నిర్వాహకులు ఎవరనేది పక్కా సమాచారాన్ని సేకరించి బైండోవర్‌ చేయాలని ఆదేశించారు. 


కోడి వద్దు.. కబడ్డీ ముద్దు..

అన్నిచోట్ల కోడిపందేలు సాగినా.. గోదావరి జిల్లాల్లో ఏర్పాటుచేసే బరులకు ప్రత్యేక గుర్తింపుంది. ఈ నేపథ్యంలో పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ మంగళవారం సీఐలు, ఎస్‌ఐలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కోళ్ల కత్తుల తయారీదారులు, విక్రేతలపై నిఘాపెట్టి బాధ్యులపై కేసులు నమోదుచేయాలని ఆదేశించారు. కొబ్బరి తోటల్లో నిర్వహించే కోడి పందేలు, గుండాట, పేకాట రహ స్య స్థావరాలు కనిపెట్టేందుకు డ్రోన్‌ కెమెరాలు వినియోగించాలని గోదావరి జిల్లాల ఎస్పీలు ఎస్‌హెచ్‌వోలకు దిశా నిర్దేశం చేశారు. మరోవైపు తూర్పు గోదావరి జిల్లాలో ఎస్పీ రవీంద్రనాథ్‌ బాబు అవగాహన కార్యక్రమాలపై దృష్టిపెట్టారు. కబడ్డీ, ఫుట్‌బాల్‌, కోకో లాంటి ఆటల పోటీలు నిర్వహించేలా గ్రామ పెద్దలను ఒప్పించాలనీ, ఎన్‌జీవోలతో కలిసి పనిచేయాలనీ పోలీసులకు దిశానిర్దేశం చేస్తున్నారు. 


‘బరి’ నేతతో భేటీలా..!

రాష్ట్రంలోనే అతి పెద్ద కోడిపందేల బరి కృష్ణా జిల్లా గన్నవరంలో ఏర్పాటు చేస్తారు. కీలక ప్రజా ప్రతినిధి సహకారంతోనే అక్కడ బరులు నిర్వహిస్తారనేది జగమెరిగిన సత్యం. కొత్తగా జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన సిద్ధార్థ్‌ కౌశల్‌ నేరుగా ఆయన ఇంటికెళ్లి కలిసి వచ్చారు. దీంతో కింది స్థాయి పోలీసులు అటువంటి కోళ్ల బరులను అడ్డుకోగలరా... అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Updated Date - 2022-01-05T08:55:21+05:30 IST