Virat Kohli: ఆ ఘనతకు ఒక్క అడుగు దూరంలో కోహ్లీ!

ABN , First Publish Date - 2022-08-27T21:49:38+05:30 IST

టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ (Virat Kohli) రికార్డుల కిరీటంలోకి మరోటి వచ్చి చేరబోతోంది. రికార్డుల రారాజుగా,

Virat Kohli:  ఆ ఘనతకు ఒక్క అడుగు దూరంలో కోహ్లీ!

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ (Virat Kohli) రికార్డుల కిరీటంలోకి మరోటి వచ్చి చేరబోతోంది. రికార్డుల రారాజుగా, పరుగుల యంత్రంగా పేరుగాంచిన కోహ్లీ తన కెరియర్‌లో లెక్కలేనని రికార్డులు సాధించాడు. అయితే, ఎందుకనో గత రెండుమూడేళ్లుగా ఈ రన్ మెషీన్ నుంచి పరుగులు రావడం గగనంగా మారిపోయింది. అతడి బ్యాట్ నుంచి సెంచరీ చూసి ఎన్నాళ్లయిందో! ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్న కోహ్లీ ఇంటాబయట విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఈ విమర్శలన్నింటికీ ఆదివారం నుంచి ప్రారంభం కానున్న ఆసియా కప్‌ (Asia Cup)తో సమాధానం చెప్పాలని కోహ్లీ కృతనిశ్చయంతో ఉన్నాడు. 


ఆసియా కప్‌లో భాగంగా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ (Pakistan)తో భారత్ తన తొలి మ్యాచ్‌లో తలపడనుంది. ఈ మ్యాచ్‌తో కోహ్లీ ఖాతాలోకి మరో అరుదైన రికార్డు వచ్చి చేరబోతోంది. ఇప్పటి వరకు 99 టీ20 మ్యాచ్‌లకు ప్రాతినిధ్యం వహించిన కోహ్లీకి రేపటి (ఆదివారం) మ్యాచ్ 100వది. ఫలితంగా అన్ని ఫార్మాట్లలోనూ ‘సెంచరీ’ కొట్టిన తొలి ఇండియన్‌గా రికార్డులకెక్కబోతున్నాడు. 2008లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన కోహ్లీ అద్భుత కెరియర్‌కు ఇది ఉదాహరణ. 


ఇప్పటి వరకు 99 టీ20లు ఆడిన కోహ్లీ 50.12 సగటుతో 3,308 పరుగులు చేశాడు. ఈ ఫార్మాట్‌లో అతడి వ్యక్తిగత అత్యధిక స్కోరు 94 పరుగులు. 30 అర్ధ సెంచరీలు చేశాడు. 2017-2021 మధ్య కాలంలో కోహ్లీ 50 మ్యాచ్‌లకు ప్రాతినిధ్యం వహించాడు. అందులో 30 మ్యాచుల్లో జట్టును విజయాల బాటలో నడపగా 16 మ్యాచుల్లో జట్టు ఓటమి పాలైంది. రెండు మ్యాచ్‌లు టై కాగా, మరో రెండింటిలో ఫలితం తేలలేదు. కెప్టెన్‌గా అతడి విజయాల రేటు 64.58గా ఉంది. 


కోహ్లీ బ్యాట్ నుంచి సెంచరీ రాక 1000 రోజులు దాటిపోయింది. కాబట్టి పాకిస్థాన్‌తో మ్యాచ్ అతడికి చాలా కీలకం. ఈ మ్యాచ్‌లో సెంచరీ సాధించడం ద్వారా జట్టుకు విజయాన్ని అందించడంతోపాటు తన సెంచరీల సంఖ్యను 71కి పెంచుకోవాలని కోహ్లీ పట్టుదలగా ఉన్నాడు. కోహ్లీ చివరి సారి నవంబరు 2019లో సెంచరీ బాదాడు. ఆ తర్వాత 27 టీ20లు ఆడినా సెంచరీ చేయడంలో విఫలమయ్యాడు. అలాగే, చివరి సెంచరీ తర్వాత 8 అర్ధ సెంచరీలు సాధించాడు. అలాగే, చివరి సెంచరీ తర్వాత అన్ని ఫార్మాట్లలో కలిపి ఇప్పటి వరకు 68 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి 2,554 పరుగులు చేశాడు. అందులో 24 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 


ఈ ఏడాది కోహ్లీ ఇప్పటి వరకు ఆడింది నాలుగు టీ20 మ్యాచ్‌లే. 81 పరుగులు చేశాడు. ఈ ఫార్మాట్‌లో ఈ ఏడాది విరాట్ అత్యధిక స్కోరు 52 పరుగులు మాత్రమే. అన్ని ఫార్మాట్లలో కలిపి ఈ ఏడాది 16 మ్యాచుల్లో 19 ఇన్నింగ్స్‌లు ఆడాడు. 476 పరుగులు మాత్రమే చేశాడు. బెస్ట్ 79 కాగా, నాలుగు అర్ధ సెంచరీలు మాత్రమే చేశాడు. ఈ నేపథ్యంలో ఆసియాకప్‌లో భాగంగా ఆదివారం పాకిస్థాన్‌తో జరగనున్న మ్యాచ్‌పైనే అందరి కళ్లూ ఉన్నాయి.


Updated Date - 2022-08-27T21:49:38+05:30 IST