కొలిక్కిరాని సినిమా సమస్య.. RRR రిలీజ్‌, టికెట్‌ ధరలపై ఉత్కంఠ!

ABN , First Publish Date - 2022-01-01T07:43:14+05:30 IST

కొలిక్కిరాని సినిమా సమస్య.. RRR రిలీజ్‌, టికెట్‌ ధరలపై ఉత్కంఠ!

కొలిక్కిరాని సినిమా సమస్య.. RRR రిలీజ్‌, టికెట్‌ ధరలపై ఉత్కంఠ!

  • టికెట్ల ధరలు, థియేటర్ల వర్గీకరణపై కమిటీ చర్చ
  • సినీ గోయర్స్‌, ఎగ్జిబిటర్ల వేర్వేరు అభిప్రాయాలు
  • 11వ తేదీన సమగ్రంగా చర్చిద్దామన్న చైర్మన్‌ విశ్వజీత్‌
  • 7న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ విడుదల..

అమరావతి, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సినిమా టికెట్ల వ్యవహారం ఇంకా కొలిక్కి రాలేదు. సినిమా టికెట్ల ధరలు, థియేటర్ల వర్గీకరణ అంశాలపై జనవరి 11న మరోసారి చర్చించి నిర్ణయం తీసుకుంటామని హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్‌ విశ్వజీత్‌ నేతృత్వంలోని కమిటీ వెల్లడించింది. టికెట్ల ధరలపై వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని (జీవో 35) సవాల్‌ చేస్తూ ఎగ్జిబిటర్లు హైకోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానంలో జగన్‌ సర్కారుకి ఎదురు దెబ్బ తగలడంతో సమస్య పరిష్కారానికి ప్రభుత్వం హోంశాఖ ముఖ్యకార్యదర్శి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసింది.


ఆర్థిక, న్యాయ, రెవెన్యూ, పట్టణాభివృద్ధి శాఖల అధికారులతోపాటు ఎగ్జిబిటర్లతో ఏర్పడిన కమిటీ శుక్రవారం వర్చువల్‌గా సమావేశమైంది. సినిమా టికెట్ల ధరలు, పట్టణ, గ్రామీణ ప్రాంతా ల్లో థియేటర్ల వర్గీకరణ, మౌలిక సదుపాయాలు, తినుబండారాల నాణ్యత, పార్కింగ్‌ ఫీజులు తదితర అంశాలపై చర్చించింది. టికెట్‌ ధరలు తగ్గించడాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారని సినీ గోయర్ల సంఘం ప్రతినిధులు చెప్పగా ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు మాత్రం భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇరువురి అభిప్రాయాలు విన్న కమిటీ చైర్మన్‌ విశ్వజీత్‌ జిల్లాల నుంచి జేసీల నివేదికలు తెప్పించుకోవాల్సి ఉందన్నారు. అవి అందిన తర్వాత దీనిపై 11న మరింత సమగ్రంగా చర్చిద్దామని ప్రతిపాదించారు. దీనికి అందరూ సమ్మతించారు.


అయితే జనవరి 7న విడుదల కానున్న ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా టికెట్ల ధరపై ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాలు ఆ సినిమాకు టికెట్ల ధర విషయంలో కొన్ని వెసులుబాట్లు కల్పించాయి. అందుకు ససేమిరా అంటోన్న వైసీపీ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

Updated Date - 2022-01-01T07:43:14+05:30 IST