కేకేఆర్‌ బోణీ అదిరె..

Published: Sun, 27 Mar 2022 04:22:00 ISTfb-iconwhatsapp-icontwitter-icon
కేకేఆర్‌ బోణీ అదిరె..

చెన్నైపై ఘనవిజయం   

ధోనీ అర్ధసెంచరీ వృథా 


ముంబై: డిఫెండింగ్‌ చాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌కు ఆరంభ మ్యాచ్‌లోనే ఝలక్‌ తగిలింది. కొత్త కెప్టెన్‌ జడేజా ఆధ్వర్యంలో జట్టు ఏ విభాగంలోనూ ఆకట్టుకోలేకపోయింది. ఇక ఆల్‌రౌండ్‌షోతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (కేకేఆర్‌) ఆరు వికెట్ల తేడాతో గెలిచి గత ఫైనల్‌ ఓటమికి బదులు తీర్చుకుంది. శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా చెన్నై 20 ఓవర్లలో ఐదు వికెట్లకు 131 పరుగులు మాత్రమే చేసింది. చివర్లో కెప్టెన్‌ ధోనీ (38 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 50 నాటౌట్‌) విరుచుకుపడడంతో జట్టు ఆ మాత్రమైనా స్కోరు చేసింది. ఉమేశ్‌ యాదవ్‌కు రెండు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత స్వల్ప ఛేదనలో కోల్‌కతా 18.3 ఓవర్లలో 4 వికెట్లకు 133 పరుగులు చేసింది. అజింక్యా రహానె (34 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 44) టాప్‌ స్కోరర్‌. బ్రావోకు మూడు వికెట్లు దక్కాయి. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా ఉమేశ్‌ యాదవ్‌ నిలిచాడు.


సునాయాసంగా..: స్వల్ప ఛేదనను కేకేఆర్‌ ధాటిగా ఆరంభించింది. ఓపెనర్‌గా బరిలోకి దిగిన రహానె తొలి ఓవర్‌ నుంచే జోరు చూపాడు. నాలుగో ఓవర్‌లో 4,6 బాది తన ఉద్దేశాన్ని చాటుకున్నాడు. మరో ఓపెనర్‌ వెంకటేశ్‌ అయ్యర్‌ (16) కూడా బంతికో పరుగు చొప్పున బాదడంతో పవర్‌ప్లేలో జట్టు 43 పరుగులు రాబట్టింది. ఆ వెంటనే వెంకటేశ్‌ను బ్రావో అవుట్‌ చేసినా.. బరిలోకి దిగిన నితీష్‌ రాణా (21) మరింతగా చెలరేగాడు. అయితే ఈ దశలో రాణాను బ్రావో.. దూకుడు మీదున్న రహానెను శాంట్నర్‌ పెవిలియన్‌కు చేర్చారు. అయినా అప్పటికే జట్టు పటిష్ట స్థితిలో ఉండడంతో ఇబ్బంది ఎదురుకాలేదు. సామ్‌ బిల్లింగ్స్‌ (25) వేగంగా ఆడి 18వ ఓవర్‌లో అవుటయ్యాడు. ఇక కెప్టెన్‌ శ్రేయాస్‌ (20 నాటౌట్‌) ఫోర్‌తో మరో తొమ్మిది బంతులుండగానే మ్యాచ్‌ను ముగించాడు.


చివర్లో వేగం పెంచినా..: టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నైని మొదటి ఓవర్‌ నుంచే కోల్‌కతా బౌలర్లు వణికించారు. పచ్చికతో కూడిన పిచ్‌తో పాటు బంతి బౌన్స్‌, స్వింగ్‌ కావడంతో 17 ఓవర్ల వరకు తెగ ఇబ్బందిపడ్డారు. కానీ చివరి మూడు ఓవర్లలో ధోనీ ఎదురుదాడితో జట్టు 18 బంతుల్లో 47 పరుగులు రాబట్టింది. అయితే అప్పటికే చాలా ఆలస్యమైపోయింది. ఆరంభంలో పేసర్‌ ఉమేశ్‌ ఇన్నింగ్స్‌ మూడో బంతికే రుతురాజ్‌ను డకౌట్‌ చేశాడు. టాపార్డర్‌లో ఊతప్ప మాత్రం టచ్‌లో కనిపించాడు. వేగంగా ఆడుతూ రెండు సిక్సర్లతో ఆకట్టుకున్నాడు. కానీ ఐదో ఓవర్‌లో ఓపెనర్‌ కాన్వే (3)ను కూడా ఉమేశ్‌ అవుట్‌ చేయడంతో పవర్‌ప్లేలో జట్టు 35/2 పరుగులు మాత్రమే చేసింది. ఆ తర్వాత చక్కగా కుదురుకున్న ఊతప్పను జాక్సన్‌ స్టంపౌట్‌ చేయడంతో పాటు రాయుడు (15) రనౌట్‌ కావడం దెబ్బతీసింది. శివమ్‌ దూబే (3) నిష్క్రమణతో 61/5 స్కోరుతో జట్టు దారుణ స్థితిలో నిలిచింది. 11వ ఓవర్‌లో జడేజా (26 నాటౌట్‌)కు ధోనీ జత కలిసినా స్కోరులో వేగం పెరగలేదు. స్పిన్నర్లను ఎదుర్కోవడంలో ధోనీ ఇబ్బందిపడగా అటు జడ్డూ తన సహజశైలిలో ఆడలేకపోయాడు. ఓ దశలో ఏడు ఓవర్లపాటు జట్టు కనీసం ఫోర్‌ కూడా సాధించలేదు. దీంతో 17వ ఓవర్‌లో చెన్నై స్కోరు 84/5.. కానీ 18వ ఓవర్‌ నుంచి ధోనీ ఎదురుదాడితో సీన్‌ మారింది. ఆ ఓవర్‌లో తను మూడు ఫోర్లతో 14.. తర్వాతి ఓవర్‌లో 4,6తో 15 రన్స్‌ రాబట్టాడు. ఇక ఆఖరి ఓవర్‌లోనూ చెలరేగి రెండు ఫోర్లు రాబట్టగా జడేజా సిక్సర్‌తో ఇన్నింగ్స్‌ ముగిసింది. దీంట్లో 18 రన్స్‌ రావడంతో జట్టు పరువు కాపాడుకుంది. అటు జడ్డూ-ధోనీ మధ్య ఆరో వికెట్‌కు అజేయంగా 70 పరుగులు జత చేరాయి.



ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు (170) తీసిన బౌలర్‌గా డ్వేన్‌ బ్రావో. మలింగతో సమానంగా నిలిచాడు.



కేకేఆర్‌ బోణీ అదిరె..

 ఐపీఎల్‌లో ధోనీ అర్ధ సెంచరీ సాధించడం 2019 సీజన్‌ (బెంగళూరుపై 84 నాటౌట్‌) తర్వాత  ఇదే తొలిసారి.


స్కోరుబోర్డు

చెన్నై సూపర్‌కింగ్స్‌: రుతురాజ్‌ (సి) రాణా (బి) ఉమేశ్‌ 0; కాన్వే (సి) శ్రేయాస్‌ అయ్యర్‌ (బి) ఉమేశ్‌ 3; ఊతప్ప (స్టంప్డ్‌) జాక్సన్‌ (బి) చక్రవర్తి 28; రాయుడు (రనౌట్‌) 15; జడేజా (నాటౌట్‌) 26; శివమ్‌ దూబె (సి) నరైన్‌ (బి) రస్సెల్‌ 3; ధోనీ (నాటౌట్‌) 50; ఎక్స్‌ట్రాలు: 6; మొత్తం: 20 ఓవర్లలో 131/5. వికెట్ల పతనం: 1-2; 2-28, 3-49, 4-52, 5-61. బౌలింగ్‌: ఉమేశ్‌ యాదవ్‌ 4-0-20-2; శివమ్‌ మావి 4-0-35-0; వరుణ్‌ చక్రవర్తి 4-0-23-1; నరైన్‌ 4-0-15-0; రస్సెల్‌ 4-0-38-1.


కోల్‌కతా నైట్‌రైడర్స్‌: రహానె (సి) జడేజా (బి) శాంట్నర్‌ 44; వెంకటేశ్‌ అయ్యర్‌ (సి) ధోనీ (బి) బ్రావో 16; రాణా (సి) రాయుడు (బి) బ్రావో 21; శ్రేయాస్‌ (నాటౌట్‌) 20; బిల్లింగ్స్‌ (సి) తుషార్‌ (బి) బ్రావో 25; జాక్సన్‌ (నాటౌట్‌) 3; ఎక్స్‌ట్రాలు: 4; మొత్తం: 18.3 ఓవర్లలో 133/4. వికెట్ల పతనం: 1-43, 2-76, 3-87, 4-123. బౌలింగ్‌: తుషార్‌ 3-0-23-0; మిల్నే 2.3-0-19-0; శాంట్నర్‌ 4-0-31-1; బ్రావో 4-0-20-3; శివమ్‌ దూబే 1-0-11-0; జడేజా 4-0-25-0.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.