ఎక్కడా లేని ప్రత్యేకత ఈ కాళీ ఆలయం సొంతం.. ప్రసాదంగా ఏమిస్తారంటే..

ABN , First Publish Date - 2022-04-10T15:51:40+05:30 IST

మన దేశం సామాజిక, సాంస్కృతిక, మతపరమైన దృక్కోణంలో...

ఎక్కడా లేని ప్రత్యేకత ఈ కాళీ ఆలయం సొంతం.. ప్రసాదంగా ఏమిస్తారంటే..

మన దేశం సామాజిక, సాంస్కృతిక, మతపరమైన దృక్కోణంలో చాలా ఎంతో సుసంపన్నమైనది. భారతదేశాన్ని దేవతల భూమి అని కూడా అంటారు. దేవుడు అవతరించేందుకు ఈ భూమిని ఎంచుకున్నాడని చెబుతారు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు చాలా దేవాలయాలు ఉన్నాయి. అవి వేటికవే ఎంతో ప్రత్యేకత కలిగివున్నాయి. ఆయా దేవాలయాల్లోనూ భారతీయ సంస్కృతి వైవిధ్యం కనిపిస్తుంది. దేశంలోని అనేక దేవాలయాలు వాటి వైభవం, ప్రత్యేకత, ప్రాముఖ్యత కారణంగా ప్రపంచవ్యాప్త గుర్తింపును కలిగి ఉన్నాయి. తూర్పు నుండి పడమర వరకు, ఉత్తరం నుండి దక్షిణం వరకు భారతదేశంలో అనేక దేవాలయాలు ఉన్నాయి. ఇవి అక్కడి సంప్రదాయాలకు ప్రసిద్ధి చెందాయి. ఇక ఆలయాల్లో ప్రసాదం విషయానికొస్తే అది సాత్వికంగా ఉంటుందని మనకు తెలిసిందే.


అయితే దీనికి భిన్నమైన ఆలయం ఒకటుంది. ఆ దేవాలయం పేరు చైనీస్ కాళికాలయం. ఇది పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని టెంగ్రా ప్రాంతంలో ఉంది. ఈ ప్రాంతాన్ని చైనా టౌన్ అని కూడా అంటారు. ఆలయానికి ఈ పేరు పెట్టడం వెనుక ప్రత్యేక కథ ఉంది. గతంలో ఇక్కడ చెట్టుకింద ఉన్న రాళ్లకు పూజలు చేసేవారని స్థానికులు చెబుతుంటారు. ఆ తర్వాత ఆలయాన్ని నిర్మించి కాళి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ ఆలయ చరిత్ర 60 ఏళ్ల నాటిదని చెబుతారు. ఈ ఆలయంలో హిందువులతో పాటు చైనీయులు కూడా కనిపిస్తారు. మీడియాకు తెలిసిన వివరాల ప్రకారం ఈ ప్రాంతానికి చెందిన ఒక చైనీస్ కుటుంబంలోని 10 ఏళ్ల పిల్లాడి ఆరోగ్యం విషమించింది. పిల్లవాడు బతికే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని వైద్యులు తెలిపారు. దీంతో పిల్లాడి తల్లిదండ్రులు ఆ చెట్టుకింద పిల్లాడిని పడుకోబెట్టి పూజలు చేశారు. దీంతో కాళీమాత వారి ప్రార్థనలను విన్నదని, ఫలితంగా ఆ పిల్లాడు కోలుకున్నాడని స్థానికులు చెబుతుంటారు. తదనంతర కాలంలో అమ్మవారి ఆలయాన్ని నిర్మించి, విగ్రహాన్ని ప్రతిష్ఠించినప్పటికీ, ఆలయంలో రెండు నల్లరాళ్లు కనిపిస్తాయి. ఈ ప్రాంతంలో చైనీయులు అధికంగా ఉండటంతో వారు కూడా ఉదయం, సాయంత్రం అమ్మవారిని పూజిస్తారు. ఆలయ నిర్వహణను చూస్తున్న వారిలో చైనా సభ్యుడు కూడా ఉన్నాడు. ఈ ఆలయంలో కనిపించే భిన్నమైన విషయం ఏమిటంటే ఇక్కడ ప్రత్యేకమైన ప్రసాదాలు అందజేస్తుంటారు. ఇక్కడ ప్రసాదం రూపంలో కేవలం చైనీస్ ఆహార పదార్థాలు కనిపిస్తాయి.  నూడుల్స్, చౌమీన్, ఫ్రైడ్ రైస్, మంచూరియన్ మొదలైన వాటిని భక్తులకు ప్రసాదంగా అందిస్తారు. ఆలయంలో ఉదయం, సాయంత్రం పూజలు, హారతి మొదలైనవి హిందూ సంప్రదాయం ప్రకారం జరుగుతాయి. కాళీ పూజ సమయంలో కొవ్వొత్తులను వెలిగిస్తారు. దీంతో పాటు చేతితో తయారు చేసిన పేపర్‌ను కూడా కాల్చివేస్తుంటారు. దుష్టశక్తులకు దూరంగా ఉండేందుకే ఇలా చేస్తుంటామని స్థానికులు చెబుతుంటారు.



Updated Date - 2022-04-10T15:51:40+05:30 IST