కట్టుబాట్ల కట్టకట్టి..

Published: Sun, 27 Mar 2022 00:15:09 ISTfb-iconwhatsapp-icontwitter-icon
కట్టుబాట్ల కట్టకట్టి..చటాకాయ గ్రామంలోని కొల్లేరు అభయారణ్య పరిధిలో ఎక్స్‌కవేటర్లతో చేపల చెరువుల తవ్వకాలు

కొల్లేరులో అక్రమ చేపల చెరువుల తవ్వకాలు

చటాకాయ గ్రామానికి ముంపు అంటూ మాయ

200 ఎకరాలకుపైగా తవ్వకాలకు శ్రీకారం

సుప్రీంకోర్టు నిబంధనలకు తూట్లు

పట్టించుకోని అటవీ అధికారులు


కట్టుబాట్ల కనికట్టులో కొల్లేరులో అక్రమాల కట్ట కట్టేస్తున్నారు. ముంపు ముప్పు అంటూ మాయచేసి వందల ఎకరాల్లో చేపల చెరువులు తవ్వేస్తున్నారు. చటాకాయ గ్రామ సరిహద్దుల్లో భారీ ఎక్స్‌కవేటర్లతో నిర్విరామంగా దున్నేస్తున్నారు. కొల్లేరు అభయారణ్య పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న ఈ తంతుపై అటవీ అధికారులు కన్నెత్తి చూడకపోవడంతో అక్రమ తవ్వకాలు యథేచ్ఛగానే సాగుతున్నాయి.


కైకలూరు, మార్చి 26 : కొల్లేరు సరస్సు సుప్రీంకోర్టు సాధికారిక కమిటీ పరిధిలో ఉంది. వాటి నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి చేపల చెరువులు, ఇతర అక్రమ కట్టడాలు నిర్మించకూడదని, భారీ యంత్రాలు ఉపయోగించకూడదనే ఆంక్షలు ఉన్నాయి. అయినాకొల్లేరు గ్రామాల కట్టుబాట్ల మధ్య చేపల చెరువుల అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. వర్షాకాలంలో కొల్లేరుకు వచ్చే వరద తాకిడి నుంచి గ్రామాన్ని కాపాడుకునే సాకుతో గట్టు నిర్మాణం చేస్తున్నట్లు అధికారులను, ప్రజాప్రతినిధులను నమ్మబలికి సుమారు 200 ఎకరాలకు పైబడి చేపల చెరువుల తవ్వకాలు చేపట్టారు.

కట్టుబాట్ల మధ్య..

కైకలూరు మండలం చటాకాయ గ్రామస్థులు ఈ చేపల చెరువుల తవ్వకాలకు శ్రీకారం చుట్టారు. రెండేళ్లుగా వర్షాకాలంలో కొల్లేరులోకి భారీ ఎత్తున వరద నీరు చేరుతోందని, దానివల్ల గ్రామానికి ముంపు ముప్పు ఉందని ప్రచారం చేస్తూ ఈ కట్ట నిర్మాణం చేపట్టారు. అయితే, గ్రామానికి సంబంధం లేకుండానే వందలాది ఎకరాల గట్టు నిర్మించేసి వరద కట్టగా చూపే ప్రయత్నాలు చేస్తున్నారు. 8 ఎక్స్‌కవేటర్లతో రెండు రోజులుగా తవ్వకాలు జరుపుతున్నప్పటికీ అటవీశాఖ అధికారులు కన్నెత్తి చూడట్లేదు. గ్రామం వైపునే గట్టు నిర్మించాల్సి ఉండగా, వందలాది ఎకరాలను దాటించి అభయారణ్య పరిధిలో దాదాపు మూడువైపులా గట్టు నిర్మించేశారు. గతంలో అనేకసార్లు కట్ట నిర్మించాలని చటాకాయ గ్రామస్థులు తవ్వకాలు చేపట్టినప్పటికీ అప్పటి అధికారులు అడ్డుకున్నారు. ఎవరైనా కొత్త వ్యక్తి వచ్చి తవ్వకాలవైపు చూసినా సరే క్షణాల్లో గ్రామ పెద్దలకు సమాచారం అందవేస్తున్నారు. ఆ వచ్చిన వ్యక్తి వివరాలను సేకరించి ఏయే పనులపై ఎవరింటికి వచ్చిందీ ఆరా తీస్తున్నారు. కట్ట పేరుతో  వందలాది ఎకరాలను చేపల చెరువులుగా మార్చేందుకు ప్రయత్నించడంలో భాగంగానే ఇలా చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కొల్లేరును పరిరక్షించేందుకు ప్రభుత్వం ఏర్పాటుచేసిన అటవీశాఖ అధికారులకు భారీగా ముడుపులు అందడంతో ఇటువైపు కన్నెత్తి కూడా చూడట్లేదు. ఈ తవ్వకాలను ప్రారంభించి మొత్తం కొల్లేరునే చేపల చెరువుగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు.  పరిరక్షించాల్సిన అధికారులు తవ్వకాలపై ఏ విధమైన చర్యలు తీసుకుంటారో చూడాలి. 


నా దృష్టికి రాలేదు

చటాకాయ గ్రామంలో చేపల చెరువు గానీ, కట్ట నిర్మాణం గానీ చేస్తున్నట్లు నా దృష్టికి రాలేదు. ఒకవేళ అలా జరిగి ఉంటే పరిశీలించి చర్యలు తీసుకుంటాను. - వి.కుమార్‌ , అటవీశాఖ ఇన్‌చార్జి రేంజర్‌ 

కట్టుబాట్ల కట్టకట్టి..చటాకాయలో నిర్మించిన చెరువు గట్టు


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.