కార్మిక శాఖ మంత్రి అవినీతి చిట్టాను బయటపెట్టిన కొల్లు రవీంద్ర

ABN , First Publish Date - 2022-04-07T21:25:55+05:30 IST

కార్మిక శాఖ మంత్రి అవినీతి చిట్టాను టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర బయటపెట్టారు.

కార్మిక శాఖ మంత్రి అవినీతి చిట్టాను బయటపెట్టిన కొల్లు రవీంద్ర

అమరావతి: కార్మిక శాఖ మంత్రి అవినీతి చిట్టాను టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర బయటపెట్టారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ గుమ్మనూరి జయరాం కమీషన్ల శాఖా మంత్రిగా మారారని, మూడేళ్లలో రూ. 735 కోట్ల అవినీతికి పాల్పడ్డారన్నారు. కార్మికులకు గంజి కూడా లేకుండా చేసి.. ఆయన బెంజిలో తిరుగుతున్నారన్నారు. పారిశ్రామికవేత్తలను బెదిరించి భూకబ్జాలకు పాల్పడ్డారని, పేదలకు వైద్యం అందించే ఈఎస్‌ఐలలో కౌంటర్లు పెట్టి జే ట్యాక్స్ వసూలు చేశారని ఆరోపించారు. జయరాం మంత్రి పదవి అడ్డుపెట్టుకొని వేల కోట్లు సంపాదించుకున్నారన్నారు. 


కార్మికశాఖ మంత్రిగా జయరాం ప్రజలకు ఉపాధి చూపలేదు గానీ తాగుడుకు బానిసలుగా చేశారని కొల్లు రవీంద్ర విమర్శించారు. మంత్రి నియోజకర్గంలో పేకాట క్లబ్బులు, సారా దుకాణాలు విచ్చలవిడిగా సాగుతున్నాయని, ఆయా కేంద్రాలు మూడు పువ్వులు, ఆరు కాయలుగా వర్ధిల్లాయన్నారు. పేకాట శిబిరాలు, నాటుసారా కేంద్రాలను పెంచి పోషించారని ఆరోపించారు. నియోజకవర్గంలో మంత్రి శాఖలో ఏ పని జరిగిన అందులో భారీ మొత్తంలో ఆయనకు కమీషన్ ఇవ్వాల్సిందేనని కొల్లు రవీంద్ర విమర్శించారు.

Updated Date - 2022-04-07T21:25:55+05:30 IST