
కోలీవుడ్: ఇళయదళపతి విజయ్ - మాళవికా మోహనన్ జంటగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘మాస్టర్’. కరోనా కష్టకాలంలో విడుదలై బాక్సాఫీసును షేక్ చేస్తూ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం కరోనా అన్‌లాక్ నిబంధనలతో పాటు థియేటర్లలోకి 50 శాతం మందిని మాత్రమే అనుమతిస్తున్న తరుణంలోనూ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఇదిలా ఉంటే కరోనా కష్టకాలంలో, ప్రేక్షకులు థియేటర్‌కు వస్తారన్న నమ్మకం లేని పరిస్థితుల్లోనూ హీరో విజయ్‌తో పాటు ‘మాస్టర్’ చిత్ర నిర్మాత జేవియర్ బ్రిట్టో సాహసం చేసి థియేటర్లలో సినిమాని విడుదల చేశారు. వీరిచ్చిన ధైర్యంతో ఇపుడు అనేక మంది నిర్మాతలు తమ చిత్రాలను థియేటర్లలో విడుదల చేసేందుకు ఉత్సాహం చూపుతున్నారు.
ఈ కోవలో హీరో శిబి సత్యరాజ్ - నందితా శ్వేత నటించిన ‘కబడదారి’, సూపర్ గుడ్ ఫిలిమ్స్ 90వ చిత్రం ‘కళత్తిల్ సందిప్పోం’ చిత్రాలు ఈ నెల 28న థియేటర్లలో విడుదలకానున్నాయి. అలాగే, వచ్చే నెల 5న ‘ట్రిప్’ మూవీ రిలీజ్ కానుంది. ఆ తర్వాత మరో స్టార్ హీరో ధనుష్ నటించిన ‘జగమే తందిరమ్’ చిత్రం కూడా థియేటర్లలోనే విడుదలకానుంది. వీటితో పాటు మరికొన్ని చిత్రాలు కూడా విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అయినప్పటికీ కొంతమంది ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ యజమానులు.. ఈ చిత్రాలను భారీ మొత్తానికి కొనుగోలు చేసేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తుండటం విశేషం.