‘తల్లిదండ్రులకు’ లీగల్ నోటీసులు పంపించిన Dhanush

Published: Sat, 21 May 2022 16:50:15 ISTfb-iconwhatsapp-icontwitter-icon
తల్లిదండ్రులకు లీగల్ నోటీసులు పంపించిన Dhanush

హీరోగా నటించడంతో పాటు నిర్మాత గాను సత్తాను చాటుతున్న కోలీవుడ్ నటుడు ధనుష్ (Dhanush). ‘అసురన్’(Asuran), ‘కర్ణన్’(Karnan) వంటి సినిమాలతో అభిమానులను ఆకట్టుకున్నాడు. టాలీవుడ్‌లోకి కూడా త్వరలోనే ఎంట్రీ ఇస్తున్నాడు. మధురైకు చెందిన కతిరేసన్, మీనాక్షి దంపతులు ధనుష్ తమ కొడుకే అంటూ గతేడాది నవంబర్‌లో మద్రాస్ హై కోర్టును ఆశ్రయించారు. అతడు తమ మూడో కుమారుడని తెలిపారు. సినిమాల్లో నటించాలని ఉండటంతో ఇంటి నుంచి పారిపోయి వచ్చాడని పేర్కొన్నారు. అందువల్ల తమ ఖర్చుల కోసం నెలకు రూ. 65వేలు ఇవ్వాలని కోరారు. ఆ భార్యాభర్తలు చెప్పిన విషయాలతో ధనుష్ ఏకీభవించలేదు. తాను తమిళ్ ఫిల్మ్ మేకర్ కస్తూరి రాజా(Kasthuri Raja), అతడి భార్య విజయలక్ష్మీకి జన్మించానని ధనుష్ తెలిపాడు. వివాదాన్ని పరిష్కారించుకోవడానికి డీఎన్‌ఏ టెస్ట్ చేయించుకోవాల్సిందిగా కోర్టు సూచించింది. కానీ, ఆ సూచనకు ధనుష్, అతడి తరఫు న్యాయవాదులు అంగీకరించలేదు. తన జనన ధృవీకరణ పత్రాన్ని సమర్పించడంతో కోర్టు ఈ పిటిషన్‌ను ఏప్రిల్ 2022లో కొట్టివేసింది. తన పరువుకు భంగం కలిగిస్తున్నారని ధనుష్ తాజాగా ఈ దంపతులకు లీగల్ నోటీసులు పంపించాడు. 


తనపై ఆరోపణలు మానుకోవాలని ధనుష్ తెలిపాడు. క్షమాపణలు చెబుతూ ప్రకటన విడుదల చేయాలని కోరాడు. ఈ విధంగా చేయకపోతే రూ.10కోట్లకు పరువునష్టం దావా వేస్తానన్నాడు. ధనుష్, అతడి తండ్రి కస్తూరి రాజా ఓ న్యాయవాది ద్వారా వారికి నోటీసులు పంపించారు. ‘‘ నా క్లయింట్స్‌పై అబద్ధపు ఆరోపణలు మానుకోవాలి. మీరు ఆ విధంగా చేయకపోతే వారు హక్కులను కాపాడుకోవడానికీ ఉన్నత న్యాయస్థానాలను ఆశ్రయిస్తారు. పరువుకు భంగం కలిగించే వ్యాఖ్యలు చేస్తున్నందున మిమ్మల్ని ప్రాసిక్యూషన్ కూ‌డా చేస్తారు’’ అని ఆ నోటీసులో వెల్లడించారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International