Munugode by-election: కోమటిరెడ్డి అనుచర వర్గానికి చెక్ పెడుతున్న కాంగ్రెస్

ABN , First Publish Date - 2022-08-18T22:11:27+05:30 IST

మాజీ ఎమ్మల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి (Komati Reddy Rajagopal Reddy) అనుచర వర్గానికి కాంగ్రెస్ (Congress) చెక్ పెడుతోంది.

Munugode by-election: కోమటిరెడ్డి అనుచర వర్గానికి చెక్ పెడుతున్న కాంగ్రెస్

హైదరాబాద్: మాజీ ఎమ్మల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి  (Komati Reddy Rajagopal Reddy) అనుచర వర్గానికి కాంగ్రెస్ (Congress) చెక్ పెడుతోంది. ఇప్పటికే మునుగోడు మండలాల అధ్యక్షులను తొలగించారు. నల్లగొండ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జితేందర్రెడ్డిని తొలగిస్తూ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనరెడ్డి ఆదేశాలు జారీ చేశారు. నల్లగొండ జిల్లా కొత్త అధ్యక్షుడిగా రాజా రమేష్ (Raja Ramesh) నియమించారు. వాస్తవానికి సిట్టింగ్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామాతో బలమైన నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ ఒక్కసారిగా దిక్కులేని పరిస్థితిలోకి వెళ్లింది. పార్టీ పదవుల్లో అంతా రాజగోపాల్‌ అనుచరులే ఉండటం వారు కూడా ఆయన వెంట నడుస్తుండటం, ఉన్నవారు ఆర్థికంగా ఎన్నికలను ఎదుర్కొనే స్థితిలో లేకపోవడంతో రేవంత్‌రెడ్డి (Revanth Reddy) రంగంలోకి దిగారు. రాజగోపాల్‌ రాజీనామా సమాచారంతో వెనువెంటనే తనకు అనుకూలురైన స్థానిక నేతలను రంగంలోకి దింపారు. పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలకు భరోసా కల్పించే కార్యక్రమం చేపట్టారు. ఆరు మండలాల అధ్యక్షులను సస్పెండ్‌ చేసి త్రీమెన్‌ కమిటీలను ఏర్పాటు చేశారు. 


మునుగోడు ఉప ఎన్నికను ఎదుర్కొనేందుకు ఐదుగురు సభ్యులతో వ్యూహ, ప్రచార కమిటీని ఖరారు చేశారు. మునుగోడులో బలంగా ఉన్న గౌడ సామాజికవర్గాన్ని దృష్టిలో పెటుకొని కీలక నేత మధుయాష్కీ గౌడ్‌ను చైర్మన్‌గా, రెడ్డి, స్థానిక నేత ప్రాతిపదికన దామోదర్‌రెడ్డి, గిరిజనుల ఓట్లను దృష్టిలో పెట్టుకొని ఎమ్మెల్యే సీతక్క, బలరాంనాయక్‌, ఎస్సీల ఓట్ల నేపథ్యంలో అంజన్‌కుమార్‌యాదవ్‌, సంపత్‌కుమార్‌, బీసీల ప్రాతినిధ్యం కోసం మాజీ ఎమ్మెల్యే ఇరావత్రి అనిల్‌కుమార్‌లతో కమిటీని ఏర్పాటు చేశారు. మునుగోడు ఉప ఎన్నిక బాధ్యతను రాంరెడ్డి దామోదర్‌రెడ్డికి అప్పగించారు. అభ్యర్థి ఖరారులో జాప్యం, పెట్టుబడి విషయంలో దిక్కులు చూసే పరిస్థితి నెలకొనడం, రెండు అధికార పార్టీలు ప్రజాప్రతినిధుల వేట ముమ్మరం చేయడంతో వలసల్లో 90 శాతం కాంగ్రెస్‌ నుంచే జరుగుతున్నాయి. గడచిన పది రోజుల్లో కాంగ్రెస్‌కు చెందిన 10మంది సర్పంచ్‌లు, ఏడుగురు ఎంపీటీసీలు పార్టీని వీడిపోగా ఇతర పార్టీల నుంచి ఒక్కరు కూడా కాంగ్రెస్‌ కండువా కప్పుకోకపోవడం స్థానిక పరిస్థితిని తెలియజేస్తోంది.

Updated Date - 2022-08-18T22:11:27+05:30 IST