KomatiReddy VenkatReddy: కాక పుట్టిస్తున్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

ABN , First Publish Date - 2022-08-13T21:08:38+05:30 IST

తెలంగాణ కాంగ్రెస్‌లో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (KomatiReddy VenkatReddy) వ్యవహారం కాక పుట్టిస్తోంది.

KomatiReddy VenkatReddy: కాక పుట్టిస్తున్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్‌లో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (KomatiReddy VenkatReddy) వ్యవహారం కాక పుట్టిస్తోంది. ట్విటర్‌ (Twitter) హిస్టరీ వెంకట్‌రెడ్డి మార్చారు. ‘‘నాలుగుసార్లు ఎమ్మెల్యే, ఒకసారి మంత్రి, ప్రస్తుతం ఎంపీగా ఉన్నాను. 3 దశాబ్దాలుగా పార్టీకి హోంగార్డుగా పనిచేస్తున్నాను’’ అని ట్విటర్‌ ప్రొఫైల్‌లో వెంకటరెడ్డి పేర్కొన్నారు. కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీపై వెంకటరెడ్డి అలకబూనారు. మునుగోడు ఉప ఎన్నిక(Munugode by-election)ల ప్రచారానికి తనను పిలవలేదని, అందుకే ఆ ఉప ఎన్నికకు పూర్తిగా దూరంగా ఉంటున్నానని ఆయన తెలిపారు. మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి నిర్వహించిన సమావేశాలకు పార్టీ నుంచి తనకు ఎలాంటి సమాచారం లేదన్నారు. తన నివాసంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ఏ మీటింగ్‌ జరిగినా నాకు సమాచారం ఇవ్వడం లేదు. సమావేశానికి రావాలని ఆహ్వానించకపోతే ఎలా వెళ్లాలి? చండూరులో జరిగిన బహిరంగ సభలో నన్ను అసభ్యంగా తూలనాడారు. హోం గార్డుతో పోల్చారు. దీని వెనక ఎవరున్నారో అందరికీ తెలుసు. పార్టీ నుంచి నన్ను బయటకు వెళ్లగొట్టే ప్రయత్నం జరుగుతోంది. అవమానిస్తే పార్టీ నుంచి నా అంతట నేనే వెళ్లిపోతానని అనుకుంటున్నారు. నన్ను వెళ్లగొట్టి కాంగ్రెస్‌ను ఖాళీ చేద్దామనుకుంటున్నారు’’ అని ఆరోపించారు. జరుగుతున్న విషయాలన్నింటినీ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, నాయకుడు రాహుల్‌ గాంధీ (Rahul Gandhi)కి వివరిస్తానన్నారు.

Updated Date - 2022-08-13T21:08:38+05:30 IST