నీళ్లలోనే జనజీవనం

ABN , First Publish Date - 2022-08-19T07:22:03+05:30 IST

కోనసీమ జిల్లాలోని లంక గ్రామాల ప్రజలు ఇంకా కష్టాల కడలిలో ఈదుతూనే ఉన్నారు. ఎన్నడూ లేని విధంగా రెండు దఫాలుగా వరద ఆయా గ్రామాలను ముంచెత్తడంతో ఉక్కిరిబిక్కిరి అయిపోయారు. జూలై నెలలో వచ్చిన వరదతో ఎంతో నష్టపోవడంతోపాటు అష్టకష్టాలు పడ్డారు.

నీళ్లలోనే జనజీవనం
పడవపై బయటికి వస్తున్న మామిడికుదురు మండలం పాశర్లపూడి శ్రీరామపేట వాసులు..

  • అక్కడ తగ్గి.. ఇక్కడ పెరిగిన గోదారి
  • జలదిగ్బంధంలో లంక గ్రామాలు
  • కాజ్‌వేలు మునక.. రవాణా బంద్‌
  • పడవలు లేక అనేక ఇబ్బందులు
  • ఇప్పటికే రెండుసార్లు మునకతో విసిగివేసారి పోయిన ప్రజలు
  • నీటిలోనే తిరుగుతూ రోజువారీ పనులు చేసుకుంటున్న వైనం
  • ఉపాధి కోల్పోయాం.. ఆదుకోవాలని బాధితుల వినతులు
  • అధికారులూ వరదపై పెద్దగా దృష్టిపెట్టడం లేదని ఆవేదన
  • పశువుల పరిస్థితి మరీ దయనీయం
  • కోతకు గురవుతున్న భూములు

కోనసీమ జిల్లాలోని లంక గ్రామాల ప్రజలు ఇంకా కష్టాల కడలిలో ఈదుతూనే ఉన్నారు. ఎన్నడూ లేని విధంగా రెండు దఫాలుగా వరద ఆయా గ్రామాలను ముంచెత్తడంతో ఉక్కిరిబిక్కిరి అయిపోయారు. జూలై నెలలో వచ్చిన వరదతో ఎంతో నష్టపోవడంతోపాటు అష్టకష్టాలు పడ్డారు. అయితే ప్రభుత్వం ఏదో కొద్దిపాటి సాయం, పడవల ఏర్పాటు వంటివి చేసింది. పంట        నష్ట పరిహారాల జాడ ఇంకా లేదు. ఇప్పుడు వరద మరోసారి ముంచెత్తడంతోపాటు గత ఐదారు రోజులుగా ముంపులోనే అక్కడి జనం జీవనం సాగిస్తున్నారు. ఈసారి ప్రభుత్వం కూడా పట్టించుకోవడం మానేసింది. ఒకటి రెండు చోట్ల మాత్రం అధికారులు తాగునీరు, కొన్నిచోట్ల మాత్రమే పడవలు ఏర్పాటుచేస్తున్నా రు. అన్ని ముంపు ప్రాంతాల్లో పడవలు ఏర్పాటుచేసినా రోజువారీ పనులకు ఇబ్బంది ఉండదని బాధితులు మొరపెట్టుకుంటున్నారు.

(అమలాపురం-ఆంధ్రజ్యోతి)

భద్రాచలం వద్ద వరద తగ్గుముఖం పడుతున్నప్పటికీ కోన సీమలో మాత్రం తీవ్రరూపం దాల్చింది. గ్రామాలకు గ్రామాలే నీట మునిగాయి. రెండోసారి విపత్తుకు సంబంధించి అధికార యంత్రాంగం కొన్ని ప్రాంతాల్లో పడవలు ఏర్పాటు చేయడం మినహా బాధితులకు ఎటువంటి పునరావాస చర్యలు చేపట్టడం లేదంటూ లంక  గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రికార్డుస్థాయిలో వరద పెరగడం వల్ల డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోని నలభైకు పైగా గోదావరి పరీవాహక లంక గ్రామాల ప్రజలకు వరద ముంపు తీవ్రమైంది. ఫలితంగా వేలాది మంది ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. కాజ్‌వేల వద్ద నిన్న టి వరకు ట్రాక్టర్లు, టాటాఎస్‌లపై వరదనీటిలో ప్రయాణికులను దాటించే పరిస్థితి ఉండేది. అయితే వరద తీవ్రంగా పెరగడంతో ట్రాక్టర్లు, ఇతర వాహనాలు నదీ ప్రవాహంలో వెళ్లే అవకాశం లేక పోవడంతో కోనసీమలోని లంక గ్రామాల ప్రజలు అక్కడక్కడా మొక్కుబడిగా ఏర్పాటుచేసిన పడవలపైనే ప్రయాణిస్తున్నారు. లంక గ్రామాల బాధితులు కోరే డిమాండ్లపై అధికారులు సైతం చేతులెత్తేస్తున్న పరిస్థితులు. దాదాపు 35 రోజులుగా కోనసీమలోని నదీతీర గ్రామాలు ఇంకా జలదిగ్బంధంలోనే కొనసాగుతుండడంతో ఆయా ప్రాంతాలకు చెందిన కొందరు జ్వరాలు, ఇతర అనారోగ్య సమస్యలతో ఇబ్బందులకు గురవుతున్నారు. భద్రాచలం దగ్గర మూడో ప్రమాద హెచ్చరిక, ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరికలు గురువారం కూడా కొనసాగుతుంది. శబరి నది మరింత ఉగ్రరూపం దాల్చి పోటెత్తడంతో ముఖ్యంగా కోనసీమ జిల్లాపై వరద ప్రభావం తీవ్రమైంది. గురువారం సుమారు 15 లక్షల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేయడంతో జిల్లాలోని వశిష్ఠ, వైనతేయ, గౌతమీ, వృద్దగౌతమీ నదీపాయలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వీటిని ఆనుకుని ఉన్న ప్రధాన డ్రెయి న్లలోకి వరదనీరు పోటెత్తడంతో అల్లవరం, అమలాపురం రూరల్‌ మండలంలోని కొన్ని గ్రామాల్లోకి నీరు మళ్లీ ప్రవేశించడం వల్ల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ముక్తేశ్వరం-అయినవిల్లిలంక వద్దనున్న ఎదురు బిడియం కాజ్‌వేకు వదరనీరు పోటెత్తడంతో సుమారు నాలుగు గ్రామాలకు చెందిన ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. అదేవిధంగా మామిడికుదురు మండలం పాశర్లపూడి, అప్పనపల్లి మధ్య ఉన్న కాజ్‌ వే జలదిగ్బంధానికి గురైంది. పిగన్నవరం మండలంలోని కనకాయలంక, కె.ఏనుగుపల్లి, జి.పెదపూడి కాజ్‌వేలు నీట మునిగి ఆయా గ్రామాల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. 35 రోజులుగా వరద తీవ్రత  కొనసాగుతుండడంతో లంక గ్రామాల ప్రజలు పడుతున్న ఇబ్బందులు దుర్భరంగా ఉన్నాయి. ఉపాధి కరువై, తీవ్రమైన ఇబ్బందులకు  గురవుతున్నారు. ముక్తేశ్వరం-కోటిపల్లి, నర్సాపురం- సఖినేటి పల్లి రేవుల్లో పంటు ప్రయాణాలు నిలిపివేశారు. అల్లవరం మండలం బోడసకుర్రు పల్లిపాలెంలోని 120 ఇళ్ల వరకు వరద దిగ్బంధంలో ఉన్నాయి. ప్రభుత్వం ఏర్పాటుచేసిన పునరావాస కేంద్రాల్లో బాధి తులు భోజనం చేసి దొంగల బెడదతో తిరిగి ఇళ్లకు వెళ్లిపోతున్నారు. కాట్రేనికోన మండల పరిధిలో పలు ప్రాంతాలు వరద దిగ్బంధంలో ఉన్నాయి. పల్లంకుర్రు బూలవారిపేట వద్ద ఏటిగట్టు బలహీ నంగా ఉండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అనేక ప్రాంతాల్లోని ఇళ్లు జలదిగ్బంధంలో ఉన్నాయి. ముమ్మిడివరంలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఆలమూరు మండలం బడుగు వానిలంకలో విలువైన కొబ్బరితోటలు నదీపాతానికి గురవుతున్నాయి. ఆ గ్రామంలోని పలు ప్రాంతా లకు వరదనీరు చేరింది. కపిలేశ్వరపురం మండలం కేదారలంక వద్ద కాజ్‌వేను  తాకి వరద నీరు పారుతోంది. రాజోలు ప్రాంతంలో అనేక గ్రామాలు జల దిగ్బంధానికి గురయ్యాయి. వరద తీవ్రత పెరుగుతున్నప్పటికీ అధికార యం త్రాంగం మొక్కుబడి చర్యలు మాత్రమే చేపట్టింది. అయితే శుక్రవారం వాయుగుండం ఏర్పడే ప్రమాదమున్న దృష్ట్యా వర్షాలు కురిస్తే మళ్లీ తమ పరిస్థితి ఏమిటంటూ ఆయా గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. భద్రాచలం వద్ద తగ్గుతున్నా కోనసీమను మాత్రం వరద ముంచెత్తింది. 

Updated Date - 2022-08-19T07:22:03+05:30 IST