‘నెట్‌’ పాట్లు!

ABN , First Publish Date - 2022-05-27T07:20:44+05:30 IST

కోనసీమ జిల్లాలో గత రెండ్రోజలుగా ఇంటర్నెట్‌ సేవలు నిలిపివేయడంతో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాల్లో కార్యకలాపాలు స్తంభించిపోయాయి. కొన్ని బ్యాంకుల లావాదేవీలు స్తంభించిపోయాయి. ఏటీఎంలు పనిచేయడం లేదు. గూగుల్‌పే, ఫోన్‌పేల సేవలు నిలిచిపోయాయి.

‘నెట్‌’ పాట్లు!
ఇంటర్నెట్‌ నిలిపివేయడంతో సందడి లేని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం

  • కశ్మీర్‌ తరహాలో కోనసీమలో ఇంటర్నెట్‌ సేవలు బంద్‌
  • స్తంభించిన బ్యాంకులు, ఏటీఎంలు, ప్రభుత్వ ఆఫీసులు
  • డిజిటల్‌ లావాదేవీల స్తంభనతో ప్రజలకు ఆర్థిక ఇబ్బందులు
  • సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులకు కష్టాలు
  • పరిస్థితి పూర్తిగా అదుపులోకి వస్తేనే సేవల పునరుద్ధరణ : ఎస్పీ 

(అమలాపురం-ఆంధ్రజ్యోతి)

కోనసీమ జిల్లాలో గత రెండ్రోజలుగా ఇంటర్నెట్‌ సేవలు నిలిపివేయడంతో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాల్లో కార్యకలాపాలు స్తంభించిపోయాయి. కొన్ని బ్యాంకుల లావాదేవీలు  స్తంభించిపోయాయి. ఏటీఎంలు పనిచేయడం లేదు. గూగుల్‌పే, ఫోన్‌పేల సేవలు నిలిచిపోయాయి. సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో రిజిస్ర్టేషన్ల లావాదేవీలు నెట్‌వర్క్‌ లేకపోవడం వల్ల నిలిచిపోయాయి. ముఖ్యంగా కోనసీమ జిల్లాలో వందలమంది సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రభుత్వం నుంచి హోంమంత్రి తానేటి వనిత మాత్రమే ఇంటర్నెట్‌ సేవలు నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. జిల్లాకు చెందిన కలెక్టర్‌, ఎస్పీ కార్యాలయంనుంచి ఎటువంటి సమాచారం లేదు. ఇంటర్నెట్‌ సేవలు ఎప్పుడు పునరుద్ధరిస్తారనేదానిపై స్పష్టత కరువైంది. దేశంలో కశ్మీర్‌లో ఈ తరహా ఇంటర్నెట్‌ సేవలు నిలిపివేస్తారు. అదే తరహాలో కోనసీమ జిల్లాలో ఇంటర్నెట్‌ సేవలు నిలిపివేయడం ఇక్కడ నెలకొన్న పరిస్థితుల తీవ్రతకు అద్దంపడుతోంది. సబ్‌రిజిష్ట్రార్‌ కార్యాలయాల్లో సర్వర్లు పనిచేయకపోవడం వల్ల రెండ్రోజుల నుంచి రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. ప్రభుత్వానికి సంబంధించిన అన్ని కార్యాలయాల్లో సేవలు స్తంభించిపోయాయి. కలెక్టరేట్‌లో సైతం ఇదే పరిస్థితి. ము ఖ్యంగా బ్యాంకులు, ఏటీఎం సెంటర్లతోపాటు ఆన్‌లైన్‌ పేమెంట్‌కు సంబంధించి ఫోన్‌పే, గూగుల్‌పే సేవలు పనిచేయకపోవడంతో కోట్ల రూపాయల మేర లావాదేవీలు స్తం భించిపోయాయి. ముఖ్యంగా ప్రజల దగ్గర డబ్బులు లేవు. ఎందుకంటే ప్రతిఒక్కరూ డిజిటల్‌ లావాదేవీలకు అలవాటు పడడంతో జేబులు ఖాళీ అయ్యాయి. రూ.5లు టీకు కూడా డిజిటల్‌ స్కాన్‌ చేయడానికే వినియోగదారులు అలవాటు పడడం వల్ల ఇంటర్నెట్‌ సేవల బంద్‌ వారిపాలిట శాపంగా మారాయి. బ్యాంకు లావాదేవీలన్నీ స్తంభించిపోవడంతో వివిధ ఏజన్సీలకు సంబంధించి వ్యవహారాలు నిలిచిపోయాయి. వర్తక, వాణిజ్య, వ్యాపార సంస్థలపై ఈ ప్రభావం తీవ్రంగా ఉంది. డిజిటల్‌ లావాదేవీలు లేకపోవడంతో అన్నిరకాల వ్యాపార సంస్థ లు సైతం కొనుగోలుదారులు లేక వెలవెలబోతున్నాయి. ముఖ్యం గా సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్ల కష్టాలు వర్ణనాతీతం. వందలాదిమంది కోనసీమ జిల్లాలో వర్క్‌ఫ్రమ్‌హోమ్‌తో విధులు నిర్వర్తిస్తున్నారు. నెట్‌సేవలు లేకపోవడం వల్ల ఇప్పుడా సంస్థలు తమను కంపెనీలకు వచ్చేయాలని ఆదేశిస్తున్నారంటూ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. ఉద్యమాలు నెట్‌సేవలు బంద్‌చేస్తే ఆగవని, ప్రభుత్వం సామరస్యంగా వ్యవహరించి పరిస్థితులను చక్కదిద్దాలే తప్ప అన్నివర్గాల ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. తక్షణమే ప్రభుత్వం జోక్యం చేసుకుని కోనసీమలో ఇంటర్నెట్‌ సేవలు పునరుద్ధరించాలని వేడుకొంటున్నారు. దీనిపై కృష్ణా జిల్లా ఎస్పీ సిద్ధార్ధకౌశిల్‌ విలేకరులతో మాట్లాడుతూ కోనసీమ జిల్లాలో పరిస్థితులు పూర్తిగా అదుపులోకి వచ్చాయని తాము భావించినప్పుడే ఇంటర్నెట్‌ సేవలు పునరుద్ధరిస్తామని వెల్లడించారు. ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్‌ గానీ, ఎస్పీ కార్యాలయం నుంచిగానీ ఇంటర్నెట్‌ సేవల బంద్‌పై అధికారిక సమాచారం లేదు. ఎప్పుడు పునరుద్ధరిస్తామనే దానిపై స్పష్టత ఇవ్వకపోవడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. 

మొబైల్‌ డేటాకు అవకాశమివ్వాలి

షణ్ముఖి, సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌, అమలాపురం

కొవిడ్‌ వచ్చిన నాటి నుంచి వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌లో ఉన్నాం. కోనసీమలో జరిగిన అల్లర్ల నేపథ్యంలో ఇంటర్నెట్‌ సేవలు నిలిపివేయడంతో ఉద్యోగ విధులు చేసుకోలేకపోతున్నాం. కంపెనీల నుంచి ఒత్తిడి పెరిగిపోయింది. ఇంటర్నెట్‌ అందుబాటులోకి రాకపోతే వెంటనే కంపెనీకి బయలుదేరి రమ్మంటున్నారు. కనీసం మొబైల్‌ డేటాకైనా అవకాశమివ్వాలి. 

సర్వీసులన్నీ నిలిచిపోయాయి

ప్రశాంతి, సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌, అమలాపురం

డెలాయిట్‌ కంపెనీలో ఇటీవల ఉద్యోగంలో చేరి వర్క్‌ఫ్రమ్‌హోమ్‌ చేస్తున్నా. ఇంటర్నెట్‌ సేవలు నిలిపివేయడంతో అన్ని సర్వీసులు నిలిచిపోయాయి. ఎప్పుడు ఇంటర్నెట్‌ సేవలు అందిస్తారో అధికారులు మాత్రం చెప్పడం లేదు. కంపెనీ నుంచి ఒత్తిడి పెరిగిపోయింది. వైఫై, మొబైల్‌డేటా సదుపాయాలను  కల్పించడం ద్వారా కోనసీమలో వేలాదిమంది వర్క్‌ఫ్రమ్‌హోమ్‌ చేసుకునేవారికి అవకాశం ఉంటుంది. లేదంటే మాలాంటి వారికోసం ప్రత్యేక కేంద్రాన్ని మీరైనా ఏర్పాటు చేయండి.

Updated Date - 2022-05-27T07:20:44+05:30 IST