కోనసీమకు అప్పుడే పేరెందుకు పెట్టలేదు!

ABN , First Publish Date - 2022-05-26T10:00:28+05:30 IST

రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ను ఒక్క ప్రాంతానికే పరిమితం చేయడమంటే ఆయన స్థాయిని తగ్గించినట్లే అవుతుందని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు.

కోనసీమకు అప్పుడే పేరెందుకు పెట్టలేదు!

  • దళితులపై దాష్టీకాలు కప్పిపుచ్చేందుకే అంబేడ్కర్‌ పేరు తెరమీదకి తెచ్చారా? 
  • ఆందోళనల్లో వైసీపీ వ్యక్తిదే కీలక పాత్ర
  • ఎంపీ రఘురామ వ్యాఖ్యలు

న్యూఢిల్లీ, మే 25(ఆంధ్రజ్యోతి): రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ను ఒక్క ప్రాంతానికే పరిమితం చేయడమంటే ఆయన స్థాయిని తగ్గించినట్లే అవుతుందని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు. అంబేడ్కర్‌కు అమలాపురానికి ఉన్న సంబంధం ఏమిటిని ఒక్కసారి ఆలోచిేస్త... ఏమీ లేదని స్పష్టమవుతోందన్నారు. బుధవారం ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ.. 26 జిల్లాలు ఏర్పాటు చేసినప్పుడు అల్లూరి పేరిట మన్యం జిల్లాను, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ పేరిట ఒక జిల్లాను, కడప జిల్లాను వైఎ్‌సఆర్‌ జిల్లాగా పేర్కొనప్పుడు కోనసీమ జిల్లాకు కూడా అంబేడ్కర్‌ పేరు పెడితే పరిస్థితి మరోలా ఉండేదేమోనన్నారు. కానీ, ఇప్పుడు సమయం సందర్భం లేకుండా దళితులపై జరుగుతున్న దాష్టీకాలను కప్పిపుచ్చుకునేందుకు అంబేడ్కర్‌ పేరును తెరపైకి తీసుకురావడం శోచనీయమన్నారు. కోనసీమ జిల్లాకు అంబేడ్కర్‌ పేరు పెట్టేందుకు ప్రజాభిప్రాయాన్ని కోరుతూ ఈ నెల 18న నోటిఫికేషన్‌ జారీ చేసి, నెల రోజుల గడువు ఇచ్చారని గుర్తు చేశారు. కానీ అన్ని ఆలోచించే కోనసీమకు అంబేడ్కర్‌ పేరు పెట్టాలన్న నిర్ణయం తీసుకున్నట్లు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారని చెప్పారు.


అంటే ముందుగానే నిర్ణయించుకొని ప్రజాభిప్రాయాన్ని కోరినట్టు స్పష్టమవుతోందని తెలిపారు. ముందే నిర్ణయించుకున్న తర్వాత ప్రజాభిప్రాయం అనే సినిమా స్టంట్‌ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. కోనసీమలోని కొన్ని  ప్రాంతాలను ఎంపిక చేసి ఓటింగ్‌ పెట్టాలని సూచించారు. కోనసీమలో జరిగిన ఆందోళన వెనుక వైసీపీకి చెందిన సాయి పేరు ప్రముఖంగా వినిపిస్తోందన్నారు. మంత్రి, ఎమ్మెల్యేల ఇళ్ల దహనానికి ముందే, కుటుంబ సభ్యులను తరలించారని, ఆ ఇంట్లో ఒక డాక్యుమెంట్‌ కూడా కాలిపోలేదని రఘురామ తెలిపారు. ఎమ్మెల్యే, మంత్రి ఇల్లు దహనమవుతుంటే ఫైరింజన్లు ఎందుకు రాలేదని ప్రశ్నించారు.  ఇంట్లో మనుషులను జాగ్రత్తగా కాపాడిన పోలీసులు, దాడిని అరికట్టలేక పోయారంటే వారి వైఫల్యం కాదా? అని నిలదీశారు. కాగా, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెనలకు అంబేడ్కర్‌ పేరు పెట్టాలని డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2022-05-26T10:00:28+05:30 IST