సినిమా రివ్యూ : ‘కొండా’ (Konda)

Published: Thu, 23 Jun 2022 16:50:11 ISTfb-iconwhatsapp-icontwitter-icon
సినిమా రివ్యూ : కొండా (Konda)

చిత్రం : ‘కొండా’ 

విడుదల తేదీ : జూన్ 23, 2022

నటీనటులు : త్రిగుణ్, ఇర్రామోర్, తులసి, యల్బీ శ్రీరామ్, రామ్ ప్రసాద్, పృధ్విరాజ్, శ్రవణ్, అభిలాష్ చౌదరి, ప్రశాంత్ కార్తీ తదితరులు

సంగీతం : డియస్సార్ బాలాజీ

సినిమాటోగ్రఫీ : మల్హర్ భట్

నిర్మాణం : ఏపిల్‌ట్రీ ప్రొడక్షన్స్, రామ్ గోపాల్ వర్మ కంపెనీ

నిర్మాత : సుస్మితా పటేల్

దర్శకత్వం : రామ్‌గోపాల్‌వర్మ

వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. బయోపిక్స్ తీయడంలో దిట్ట అనే సంగతి తెలిసిందే. ‘రక్తచరిత్ర, వంగవీటి, లక్ష్మీస్ యన్టీఆర్’ లాంటి వివాదాత్మక చిత్రాలతో తనదైన ముద్రవేసుకొన్న ఆయన తాజాగా... దర్శకత్వం వహించిన మరో బయోగ్రాఫికల్ మూవీ ‘కొండా’. వరంగల్ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించిన, ఇంకా పోషిస్తోన్న కొండా మురళి, కొండా సురేఖల జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన ఈ సినిమా నేడే (జూన్ 23) థియేటర్స్ లోకి వచ్చింది. టీజర్, ట్రైలర్స్‌తో విడుదలకు ముందే మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ సినిమా.. అంచనాల్ని ఏమేరకు అందుకుంది? ప్రేక్షకులకు చిత్రం ఏ స్థాయిలో కనెక్ట్ అయింది? అన్న విషయాలు రివ్యూలో చూద్దాం. (Konda Movie Review)

కథ

1990లో తెలంగాణ నేపథ్యంలో సాగుతుంది. అన్యాయం ఎక్కడ కనిపించినా సహించలేని తత్వంతో ఆవేశంతో కొట్లాటలకు దిగుతుంటాడు కొండా మురళి (త్రిగుణ్). అది తల్లిదండ్రులకు తలనొప్పిగా మారుతుంది. ఆ కారణంగా అతడ్ని వరంగల్ లో ఒక కాలేజ్ లో జాయిన్ చేస్తారు. అక్కడ కూడా మురళి రెబల్‌గా ఉంటాడు. అదే కాలేజ్ లో చదువుతూ విప్లవభావాలు కలిగిన ఆర్కే కవితలకు ఆకర్షితుడై.. అతడి బృందంలో చేరతాడు. కాలేజ్ మేట్ సురేఖతో తొలిచూపులోనే ప్రేమలో పడతాడు. ఆమెకు కూడా అతడిపై ఇష్టం ఏర్పడుతుంది. ఆ తర్వాత ఇద్దరూ పెళ్ళిచేసుకుంటారు. రాజకీయ నాయకుడు నల్లసుధాకర్ (పృధ్విరాజ్) కొండాను ఉపయోగించుకొని తన పబ్బం గడుపుకోవాలని చూస్తాడు. ముందుగా అతడితో చేతులు కలిపిన మురళి.. అతడి నిజస్వరూపం తెలుసుకొని అతడ్ని దూరం పెడతాడు. దాంతో కక్ష కట్టిన నల్ల సుధాకర్ .. అతడిపై అటాక్ చేయిస్తాడు. చావునుంచి తప్పించుకొని బైటపడ్డ అతడ్ని తిరిగి  చంపించాలని అన్ని రకాలుగా ప్రయత్నాలు సాగిస్తాడు. ఆ క్రమంలో మురళికి అండగా నిలిచిన నక్సల్స్ నాయకుడు ఆర్కేని, భారతక్కని ఎన్ కౌంటర్ చేయిస్తాడు. దాంతో ఆవేశంతో రగిలిపోయిన మురళి.. చివరికి నల్లసుధాకర్ మీద ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు? రాజకీయ పరంగా అతడు ఎలా ఎదిగాడు అన్నదే మిగతా కథ. (Konda Movie Review)

విశ్లేషణ

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన హత్యా రాజకీయాల్ని, రాజకీయ హత్యల్ని తెరపై చూపించడానికి వర్మ ఎంతో ఉత్సాహం చూపిస్తుంటాడు. ఇదివరకు వచ్చిన ‘రక్తచరిత్ర, వంగవీటి, లక్ష్మీస్ యన్టీఆర్’ లాంటి సినిమాలే దానికి నిదర్శనాలు. అలాంటి జీవిత చరిత్రల్ని తెరకెక్కించేటప్పుడు.. వాటికి సంబంధించిన వ్యక్తుల్ని స్వయంగా కలుసుకొని.. వాస్తవ సంఘటనలపై తనదైన శైలిలో రీసెర్చ్ చేసి.. వాటికి తనదైన శైలిలో డ్రామాను యాడ్ చేసి చిత్రాలుగా మలుస్తాడు. కొండా చిత్రాన్ని తీయడానికి ముందు కూడా వర్మ.. కొండా దంపతులతో చర్చించి, వారిచ్చిన ఇన్ పుట్స్‌తో, తనకున్న పరిజ్ఞానంతో ఈ సినిమాను తెరకెక్కించాడు.  అయితే ఈ సినిమాకి కొత్తగా నక్సల్స్ యాంగిల్ కూడా వచ్చి చేరింది. ఈ యాంగిల్ వర్మకి కొత్త. అయినప్పటికీ తనదైన శైలిలో సాధ్యమైనంత వరకూ వాస్తవికతను తెరపై ఆవిష్కరించడానికి ప్రయత్నించాడు. అయితే ఈ తరహాలో గతంలో ఆయన్నుంచి చాలా చిత్రాలు రావడం వల్ల కొండా చిత్రంతో ఆయన కొత్తగా తీసిందేమీ లేదు అనిపిస్తుంది. అవే షాట్స్, అదే వయలెన్స్.. ఒకే తరహాలో వినిపించే పాటలు. వాటికి తోడు ఆయన వాయిస్. కొండా మురళి పాత్రను హీరోగా చూపించడానికే ఎక్కువ తాపత్రయ పడ్డాడు. అలాగే.. ఆయన భార్య సురేఖ పాత్రను కూడా పవర్ ఫుల్ గా ఆవిష్కరించడానికి చూశాడు. 


టెక్నికల్ పరంగా సినిమా బాగానే ఉందనిస్తుంది కానీ.. కథాకథనాల పరంగా ప్రేక్షకుల్ని ఆసక్తికరంగా కూర్చోబెట్టడంతో మాత్రం విఫలమయ్యాడు దర్శకుడు. కొన్ని సన్నివేశాలు బాగా తీశాడు వర్మ. కొన్ని సన్నివేశాలు బోర్ కొడతాయి. ఒక మనిషిని మర్డర్ చేసే నేపథ్యంలో ఒక విప్లవగీతాన్ని పెట్టడం బాగా అతి అనిపిస్తుంది.  కొండా మురళీ మీద అటాక్ చేసే సీన్, ఒక భూస్వామిని చంపే సీన్,  తనని చంపాలని చూసిన వారిని చంపించే సీన్, నల్ల సుధాకర్ ఇంటికొచ్చి అతడికి వార్నింగిచ్చే సీన్ ఆసక్తిగా ఉంటాయి. సినిమా రన్ టైమ్ రెండు గంటల అవడంవల్ల కొంచెం రిలీఫ్ ఫీలవుతారు ప్రేక్షకులు.


కొండా మురళీగా త్రిగుణ్ అదరగొట్టాడు. అతడికి నటనమీద మంచి అనుభవం ఉండడంతో టైటిల్ రోల్‌ను సమర్ధవంతంగా పోషించాడు. ఇక సురేఖ గా కొత్తమ్మాయి ఇర్రామోర్ సహజంగా నటించి మెప్పించింది. కొన్ని సన్నివేశాల్లో ఆమె నటన ప్రత్యేకంగా అనిపిస్తుంది. ఇక మెయిన్ విలన్ గా పృధ్విరాజ్ అద్భుతంగా నటించాడు. కమెడియన్ రామ్ ప్రసాద్ నెగెటివ్ యాంగిల్ కొత్తగా అనిపిస్తుంది. మురళి తల్లిదండ్రులుగా తులసి, యల్బీ శ్రీరామ్ తమ పాత్రలకు న్యాయం చేశారు. నక్సలైట్ నాయకుడు ఆర్కే గా ప్రశాంత్ కార్తి ఆ పాత్రలో ఒదిగిపోయాడు. డియస్సార్ బాలాజీ సంగీతం పర్వాలేదనిస్తుంది. నిర్మాణ విలువలు పర్వాలేదు. మొత్తానికి ఆర్జీవీ అభిమానులకు ఈ సినిమా బెటర్ ఆప్షన్. (Konda Movie Review) 

ట్యాగ్ లైన్ : టైమ్‌పాస్ బయోపిక్ 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International