కొండపల్లిలో హైడ్రామా

ABN , First Publish Date - 2021-11-23T06:33:39+05:30 IST

కొండపల్లి పురపాలక సంఘ చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల ఎన్నిక ఉద్రిక్తతకు దారితీసింది.

కొండపల్లిలో హైడ్రామా

చైర్మెన్‌, వైస్‌ చైర్మెన్ల ఎన్నికలో ఉద్రిక్తం

ఎన్నిక రేపటికి వాయిదా

క్యాంపుల నుంచే హాజరైన టీడీపీ, వైసీపీ సభ్యులు

ప్రమాణస్వీకారం చేయకుండా వైసీపీ సభ్యుల ఆందోళన

సమావేశ మందిరంలోని బల్లలు, కుర్చీలు ధ్వంసం 

సంయమనం పాటించిన టీడీపీ సభ్యులు

ఏకపక్షంగా వ్యహరించిన రిటర్నింగ్‌ అధికారి, పోలీసులు


కొండపల్లి పురపాలక సంఘ చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల ఎన్నిక ఉద్రిక్తతకు దారితీసింది. ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ నేతృత్వంలో వైసీపీ సభ్యులు ఆందోళనకు దిగిన నేపథ్యంలో ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి శివనారాయణరెడ్డి ప్రమాణస్వీకార ప్రక్రియను ప్రారంభించకుండానే ఎన్నికను మంగళవారానికి వాయిదా వేశారు. కోరం ఉన్నప్పటికీ ఎన్నిక ఎందుకు వాయిదా వేస్తున్నారో లిఖిత పూర్వక వివరణ ఇవ్వాలని ఎక్స్‌అఫిషియో సభ్యుడు ఎంపీ కేశినేని శ్రీనివాస్‌ (నాని) రిటర్నింగ్‌ అధికారిని కోరారు. ఆయన సమాధానం ఇవ్వకపోవడంతో ఆరు గంటల వరకు వేచి చూసి, టీడీపీ సభ్యులతో కలిసి కేశినేని బయటకు వెళ్లిపోయారు.


ఇబ్రహీంపట్నం, నవంబరు 22 : కొండపల్లి పురపాలక సంఘ ఎన్నికల్లో వైసీపీ 14 వార్డుల్లో విజయం సాధించగా, ఎక్స్‌ అఫిషియో సభ్యుడిగా వసంత కృష్ణప్రసాద్‌ ఉన్నప్పటికీ వారి బలం 15కే పరిమితం అయింది. టీడీపీ 14 వార్డుల్లో విజయం సాధించగా, స్వతంత్ర సభ్యురాలి చేరికతో ఆ పార్టీ సభ్యుల సంఖ్య 15కు చేరింది. ఎక్స్‌ అఫిషియోగా ఎంపీ కేశినేని నానీకి కోర్టు ఓటు హక్కును కల్పించడంతో టీడీపీ బలం 16కు పెరిగింది. దీంతో చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల ఎన్నిక వాయిదా పడేలా వైసీపీ నాయకులు తమ సభ్యులకు క్యాంపులో శిక్షణ ఇచ్చినట్టు సమాచారం. ఎట్టి పరిస్థితుల్లో ఎన్నిక జరగకుండా నిలువరించాలని, అవసరమైతే ఎంపీపైకి కుర్చీ విసిరి, టీడీపీ సభ్యులను రెచ్చగొట్టాలని వైసీపీ సభ్యులకు సూచించినట్టు తెలిసింది. అందుకనుగుణంగానే కౌన్సిల్లో సభ్యుల ప్రమాణస్వీకారానికి సిద్ధమవుతుండగా, ఒక్కసారిగా వైసీపీ సభ్యులు బల్లలు, కుర్చీలతో సిబ్బందిపై దాడికి తెగబడ్డారు. అంతటితో ఆగక, ఎంపీ కేశినేనిపై కుర్చీ విసిరివేయగా, ఆయనకు తృటిలో ప్రమాదం తప్పింది. అయితే ఎంపీ కేశినేనితో పాటు టీడీపీ సభ్యులు కూడా సంయమనం పాటించడంతో పరిస్థితి అదుపులోనే ఉంది.


కార్యాలయం వద్ద వైసీపీ నేతల అరాచకం

పురపాలక సంఘ కార్యాలయం బయట నుంచి లోపలకు చొచ్చుకుని వచ్చిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు కౌన్సిల్‌ హాల్లో ఉన్న టీడీపీ సభ్యులపై దాడికి యత్నించగా, పోలీసులు నిలువరించారు. ఈ క్రమంలో వారు పోలీసులకు కూడా ఎదురుతిరిగారు. దీంతో పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. 


అధికారుల తీరు ఏకపక్షం

ఎన్నిక కేంద్రం వద్ద పోలీస్‌ యంత్రాంగం, రిటర్నింగ్‌ అధికారులు వైసీపీ అనుకూలంగా ఏకపక్షంగా వ్యహరించారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కోరం ఉన్నా ఎన్నిక జరపకుండా రిటర్నింగ్‌ అధికారి కాలయాపన చేయటం, వైసీపీ కార్యకర్తలను లోపలకు పంపించే విధంగా పోలీసులు వ్యవహరించటం అనేక సందేహాలకు తావిస్తోందని టీడీపీ సభ్యులు ఆరోపిస్తున్నారు.

---


టీడీపీ శిబిరంలో కలకలం

పురపాలక సంఘ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నికలో వైసీపీకి దీటుగా వ్యూహ ప్రతివ్యూహాల్లో నిమగ్నమైన టీడీపీ శిబిరంలో కలకలం రేగింది. టీడీపీకి చెందిన 16వ వార్డు సభ్యురాలు ధరణికోట విజయలక్ష్మి టీడీపీ సభ్యులను వదలి, భర్త శ్రీనివాసరావుతో కలసి తన కార్యాలయానికి వెళ్లటంతో టీడీపీ నాయకులు ఉలిక్కిపడ్డారు. వెంటనే మాజీ మంత్రి దేవినేని ఉమా ఆమె కార్యాలయానికి వెళ్లి, విజయలక్ష్మిని, ఆమె భర్త శ్రీనివాసరావును వెంటబెట్టుకుని వెళ్లారు.


నిరవధిక వాయిదాకు వైసీపీ ఎత్తుగడ

కొండపల్లి పురపాలక సంఘ చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల ఎన్నికను నిరవధిక వాయిదా వేయించేందుకు వైసీపీ కొత్త ఎత్తుగడ వేస్తోంది. టీడీపీ సభ్యులను ఇబ్బందులకు గురిచేసి, ధ్వంస రచనతో ఎన్నిక ప్రక్రియ వాయిదా వేసేలా ప్రయత్నించాలని సభ్యులకు నాయకులు సూచించినట్టు తెలిసింది. ఎన్నికల ప్రక్రియ రెండుసార్లు వాయిదా పడితే, తిరిగి, ఎన్నికల సంఘం జోక్యం చేసుకునేంత వరకు ఎన్నిక జరగదని, ఇందుకోసం లోపల ఉన్న సభ్యులు ఎంపీని టార్గెట్‌ చేయాలని, టీడీపీ సభ్యులను రెచ్చగొట్టాలని, అదే సమయంలో వైసీపీ నేతలు, కార్యకర్తలు బయట హడావిడి చేయాలని ఎత్తుగడ పన్నినట్టు తెలుస్తోంది.

----------------


జగ్గయ్యపేటలో ఎన్నిక ప్రశాంతం


జగ్గయ్యపేట, నవంబరు 22 : జగ్గయ్యపేట మునిసిపల్‌ చైర్మన్‌గా 11వ వార్డు కౌన్సిలర్‌ రంగాపురం రాఘవేంద్ర, వైస్‌ చైర్మన్లుగా ఆరో వార్డు కౌన్సిలర్‌ తుమ్మల ప్రభాకర్‌, షేక్‌ హాఫీజున్నీసా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం మునిసిపల్‌ కౌన్సిల్‌ హాలులో ఎన్నికల నిర్వహణ అధికారి సరస్వతి ఆధ్వర్యంలో తొలుత ఎన్నికైన 31 మంది వైసీపీ, టీడీపీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం చైర్మన్‌, వైస్‌చైర్మన్ల ఎన్నికను నిర్వహించారు.  కౌంటింగ్‌లో అక్రమాలకు పాల్పడి, దొడ్డిదారిన మునిసిపాలిటీని అధికార పార్టీ హస్తగతం చేసుకున్నందుకు నిరసనగా ఎన్నికను బహిష్కరిస్తున్నట్టు 10వ వార్డు సభ్యురాలు కన్నెబోయిన రామలక్ష్మి ప్రకటించగా, మిగిలిన టీడీపీ సభ్యులంతా బయటకు వెళ్లిపోయారు. అనంతరం ఎన్నిక ప్రక్రియను ప్రారంభించారు. చైర్మన్‌గా రంగాపురం రాఘవేంద్ర పేరును రెండో వార్డు వైసీపీ కౌన్సిలర్‌ కొలగాని రాము ప్రతిపాదించగా, 16వ వార్డు కౌన్సిలర్‌ తన్నీరు నాగమణి బలపరిచారు. వైస్‌చైర్మన్‌గా తుమ్మల ప్రభాకర్‌ పేరును ఐదో వార్డు కౌన్సిలర్‌ వట్టెం మనోహర్‌ ప్రతిపాదించగా, 26వ వార్డు కౌన్సిలర్‌ పాకాలపాటి సుందరమ్మ బలపరిచారు. రెండో వైస్‌చైర్మన్‌గా షేక్‌ హఫీజున్నీసా పేరును ఎనిమిదో వార్డు కౌన్సిలర్‌ సామినేని వెంకటకృష్ణప్రసాద్‌ ప్రతిపాదించగా, మూడో వార్డు కౌన్సిలర్‌ కాశీ అనూరాధ బలపరిచారు. వైసీపీ కౌన్సిలర్లందరూ ఈ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. అనంతరం వారితో ఎన్నికల నిర్వహణ అధికారి సరస్వతి ప్రమాణస్వీకారం చేయించారు.



Updated Date - 2021-11-23T06:33:39+05:30 IST