ఎట్టకేలకు ఎన్నిక ప్రశాంతం

ABN , First Publish Date - 2021-11-25T06:42:03+05:30 IST

కొండపల్లి మునిసిపల్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల ఎన్నిక ఎట్టకేలకు ప్రశాంతంగా ముగిసింది.

ఎట్టకేలకు ఎన్నిక ప్రశాంతం
ఎన్నిక అనంతరం టీడీపీ సభ్యులతో కలిసి బయటకు వస్తున్న ఎంపీ కేశినేని నాని

భారీ భద్రత నడుమ కొండపల్లి చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల ఎన్నిక

హైకోర్టు ఆదేశాలతో అధికారులు, పోలీసులు అప్రమత్తం

వినిపించని నినాదాలు.. కనిపించని అరాచకం

భారీగా పోలీసుల మోహరింపు.. పత్తాలేని వైసీపీ కార్యకర్తలు

టీడీపీకి అనుకూలంగా 16మంది సభ్యులు


కొండపల్లి మునిసిపల్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల ఎన్నిక ఎట్టకేలకు ప్రశాంతంగా ముగిసింది. రెండు రోజులు వరసగా వైసీపీ సభ్యుల అరాచకం కారణంగా ఎన్నిక వాయిదా పడిన విషయం తెలిసిందే. అనంతరం కోర్టు జోక్యం చేసుకుని ఎన్నిక సజావుగా జరపాలని ఆదేశించడంతో పోలీసులు, ఎన్నికల అధికారి అప్రమత్తమయ్యారు. బుధవారం పోలీసు యంత్రాంగం పెద్ద ఎత్తున భద్రతా సిబ్బందిని నియమించగా, కట్టుదిట్టమైన భద్రత నడుమ ఎన్నికను నిర్వహించారు. టీడీపీ ప్రతిపాదించిన అభ్యర్థులకు 16 మంది, వైసీపీ ప్రతిపాదించిన వారికి 15 మంది సభ్యులు మద్దతు తెలిపారు. ఇందుకు సంబంధించిన నివేదికను కోర్టుకు అందించనున్నట్టు ఎన్నికల అధికారి తెలిపారు. 


ఇబ్రహీంపట్నం, నవంబరు 24 : భారీ పోలీస్‌ భద్రత నడుమ కొండపల్లి మునిసిపల్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. సోమ, మంగళవారాల్లో వరస గందరగోళం తరువాత ఎన్నికను రిటర్నింగ్‌ అధికారి నిరవధిక వాయిదా వేసిన సంగతి తెలిసిందే. దీంతో టీడీపీ సభ్యులు కోర్టును ఆశ్రయించారు. ఎన్నిక సజావుగా జరిపి, పూర్తి నివేదికను సమర్పించాలని రిటర్నింగ్‌ అధికారికి, పోలీస్‌ కమిషనర్‌కు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాక సభ్యులకు పూర్తి రక్షణ కల్పించాలని, పోలీసులు ఎన్నికల కేంద్రాన్ని పర్యవేక్షించాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో అప్రమత్తమైన పోలీస్‌, ఎన్నికల యంత్రాంగం బుధవారం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశాయి. ఉదయం 10.30గంటలకు ఎన్నికల ప్రక్రియను ప్రారంభించారు. టీడీపీ, వైసీపీలకు చెందిన 29 మంది వార్డు సభ్యులతో పాటు ఎక్స్‌ అఫిషియో సభ్యులు ఎంపీ కేశినేని శ్రీనివాస్‌ (నాని), ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్‌ కార్యాలయానికి చేరుకున్నారు. ఎన్నికల అధికారి ముందుగా సభ్యులతో ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం ఇరుపార్టీల వారు చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ అభ్యర్థులను ప్రతిపాదించారు. టీడీపీ నుంచి చైర్మన్‌గా చెన్నుబోయిన చిట్టిబాబు, వైస్‌ చైర్మన్లుగా కరిమికొండ శ్రీలక్ష్మి, చుట్టుకుదురు శ్రీనివాసరావులను ప్రతిపాదించారు. వైసీపీ నుంచి చైర్మన్‌గా గుంజా శ్రీనివాసరావు, వైస్‌ చైర్మన్లుగా బాడిశ నాగరాజకుమారి, నల్లమోతు శ్రీలక్ష్మిలను ప్రతిపాదించారు. తరువాత టీడీపీ ప్రతిపాదనకు 16 మంది సభ్యులు చేతులెత్తి మద్దతు ప్రకటించగా, వైసీపీ ప్రతిపాదించిన వారికి మద్దతుగా 15 మంది చేతులెత్తారు. ఈ పక్రియను పూర్తిచేసిన ఎన్నికల అధికారి పూర్తి నివేదికను కోర్టుకు అందించనున్నట్లు తెలిపారు. 


కోర్టు మొట్టికాయలతో అప్రమత్తమైన పోలీసులు

రెండు రోజులుగా వైసీపీ సభ్యులు, కార్యకర్తల విధ్వంసాన్ని అదుపు చేసే ప్రయత్నం చేయని పోలీసులు హైకోర్డు మొట్టికాయలతో దిగివచ్చారు. సుమారు 750 మంది సిబ్బందితో పూర్తిస్థాయి భద్రత చర్యలు చేపట్టారు. రెండు రోజుల క్రితం వైసీపీ కార్యకర్తలు ఏకంగా కార్యాలయం వద్దకు దూసుకువచ్చినా పెద్దగా నిలువరించే ప్రయత్నం చేయని పోలీసులు బుధవారం కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. కౌన్సిల్‌హాల్లో కూడా వైసీపీ సభ్యులు ఎటువంటి నినాదాలూ చేయకపోవడం గమనార్హం. 


ప్రలోభాలకు లొంగలేదు

హైకోర్టు ఆదేశాలతో ప్రశాంత వాతావారణంలో ఎన్నికలు జరిగాయి. వైసీపీ ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించినా, టీడీపీ సభ్యులు 15 మందీ క్యాష్‌ కోసం కాక, క్యారెక్టర్‌ కోసం నిలబడ్డారు. వీరంతా పేద కుటుంబాల నుంచే వచ్చారు. ఈ రోజుల్లో ఒక పార్టీ నుంచి ఎమ్మెల్యే, ఎంపీగా టికెట్‌ దక్కించుకుని, ఎన్నికైన తరువాత ఏ పార్టీ అధికారంలోకి వస్తే, ఆ పార్టీలోకి జంప్‌ అవుతున్నారు. కానీ ఇక్కడ 15 మంది టీడీపీ సభ్యులూ ఎటువంటి ప్రలాభాలకూ గురికాలేదు. బెదిరింపులకు భయపడలేదు. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా, తమ కుటుంబ సభ్యులను, పిల్లలను బెదిరించినా, లొంగకుండా పార్టీ కోసం నిలబడడం అభినందనీయం. ఇలాంటి నీతి, నిజాయతీలున్న సభ్యులు ఉండటం కొండపల్లి పురపాలక సంఘం అదృష్టం.        - కేశినేని శ్రీనివాస్‌(నాని), విజయవాడ ఎంపీ 


ఈ 15 మందీ నేటితరానికి ఆదర్శం

కొండపల్లి పురపాలక సంఘ చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల ఎన్నికలో ఎటువంటి ప్రలోభాలకు, ఒత్తిళకూ లొంగకుండా నిజాయతీగా పార్టీ కోసం నిలబడిన 15 మంది టీడీపీ సభ్యులు నేటి తరం రాజకీయ నేతలకు ఆదర్శంగా నిలిచారు. అధికార పార్టీ నేతలు డబ్బు పట్టుకుని తిరిగినా, ప్రలోభాలకు గురికాలేదు. పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందిన వీరు అన్ని విధాలుగా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ, పార్టీ కోసమే నిలబడ్డారు. రానున్న రోజుల్లో చంద్రబాబు ఆశయ సాధన కోసం సమిష్టిగా కలసి పనిచేస్తాం. - దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీ మంత్రి 


హైకోర్టు నిర్ణయం శిరోధార్యం

కొండపల్లి పురపాలక సంఘ చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల ఎన్నికపై హైకోర్డు నిర్ణయం శిరోధార్యం. ఎక్స్‌ అఫిషియో ఓటుపై మా సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. రెండున్నర సంవత్సరాల కాలంలో రూ.40 కోట్లతో కొండపల్లి, ఇబ్రహీంపట్నంలలో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించాం. ఏ పాలకవర్గం ఏర్పడినా అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తా. - వసంత వెంకట కృష్ణప్రసాద్‌, ఎమ్మెల్యే, మైలవరం


పార్టీ విధేయులకే మద్దతు


కొత్తగా ఏర్పడిన కొండపల్లి పురపాలక సంఘ పాలకవర్గంలో పార్టీ విధేయులకే టీడీపీ సభ్యులు మద్దతు పలికారు. బుధవారం జరిగిన చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ అభ్యర్థులుగా పార్టీ నాయకత్వం ప్రతిపాదించిన వారికే మద్దతు పలికారు. ఎన్నిక కోర్టు పరిధిలో ఉండటంతో ఫలితాన్ని అధికారకంగా వెల్లడించాల్సి ఉంది. చైర్మన్‌ అభ్యర్థిగా చెన్నుబోయిన చిట్టిబాబును, వైస్‌ చైర్మెన్లుగా కరిమికొండ శ్రీలక్ష్మి, చుట్టుకుదురు శ్రీనివాసరావులను, ఫ్లోర్‌ లీడర్‌గా వల్లూరు జమాయి దేవ కుమారి(అమ్మాజీ)ని ప్రతిపాదించారు. కోర్టు నిర్ణయం వెలువడిన తరువాత టీడీపీ కార్యాచరణను రూపొందించుకోనున్నటు తెలుస్తోంది.



Updated Date - 2021-11-25T06:42:03+05:30 IST