ltrScrptTheme3

అన్నమయ్య ఆధ్యాత్మిక కమ్యూనిస్టు

Feb 7 2020 @ 14:43PM

ఆధ్యాత్మికం, కమ్యూనిజం ఒక్కటే

కళాకారుల మధ్య అసూయ, ద్వేషాలు నిజమే

కొండెక్కిన నాస్తికులు... ఆస్తికులై తిరిగొస్తున్నారు

కులం ఇష్టం లేకనే చౌదరి తీసేశా

6-12-10న ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కేలో కొండవీటి జ్యోతిర్మయి


ఇప్పుడు అందరూ వెస్టర్న్‌ మ్యూజిక్‌ను ఇష్టపడతారు. మీరేమో ఆరు వందల ఏళ్లనాటి అన్నమయ్యను నమ్ముకున్నారు. ఎందుకిలా?

అన్నమయ్యకు నేను ఆకర్షితురాలిని కాలేదు. అన్నమయ్య నన్నెన్నుకున్నాడు. ఆధ్యాత్మిక భావనలతో సమాజంలో మార్పు, చైతన్యం తీసుకురావాలన్నది నా లక్ష్యం. పామరుడి కోసం అన్నమయ్య రాసిన సంకీర్తనలు సమాజంలో ఎందుకు విప్లవాన్ని తీసుకురాలేదని నాకు అనిపించింది.


ఆధ్యాత్మికతకు ఆకర్షితులు కావాలంటే ఓ వయసు రావాలి. కానీ మీరు యవ్వనంలోనే ఆధ్యాత్మికతలోకి వచ్చారు. ఎందుకని?

మా అమ్మవల్ల. ఆమె స్ఫూర్తి చాలా ఎక్కువ. మా నాన్నగారు చాలా స్పీడ్‌. ఆయనవి రివల్యూషనరీ భావాలు. ఈమెవేమో ఆధ్యాత్మిక భావాలు. ఇద్దరూ తూర్పు పడమరలు.


అన్నమయ్య ఆరాధకులు చాలామంది ఉన్నారు. కానీ, ఏ ఒక్కరికీ రెండోవాళ్లంటే ఎందుకు పడదు?

ఒకరిని ఒకరు అధిగమిస్తారనో.. ఒకరి కార్యక్రమాలకు అడ్డుగా ఉంటారనో.. తెలియదు. కానీ, కళాకారులందరూ ఒకచోటకు రావడం లేదు. ఒకరి కార్యక్రమాలను ఒకరు ప్రోత్సహించరు. ఒకరి ఉన్నతిని మరొకరు కొనియాడరు. కళాకారుల మధ్య అసూయాద్వేషాలు నిజమే.


శోభారాజ్‌తో మీరు కూడా ఓసారి గొడవ పడ్డారు కదా?

నేనేం గొడవ పడలేదు. ఆమే నిస్పృహకు గురై నన్ను తిట్టారేమో తెలియదు. 


విద్వత్తు కంటే మీకు ప్రచారార్భాటం ఎక్కువన్న విమర్శ ఉంది...

నా సంకీర్తనకు ప్రచారం కావాలి కదా! అన్నమయ్య ఆయన ఉద్దేశాలను, భావాలను ప్రచారం చేయడానికి ప్రచారం కావాలి. అప్పుడు తప్పకుండా నా పేరు వస్తుంది.


టీటీడీ చైర్మన్‌ కావాలన్న కోరిక మీకు లేదా!?

లేదు. కానీ, పెద్దలను కలవడం, వారితో ప్రతిపాదించడం నాకు కావాలని కాదు. వారిలో ఒక ఆలోచన తీసుకురావడానికే. దానిని తీసుకొస్తే నాకంటే ఎవరైనా గొప్ప వారిని ఆ పదవికి ఎంపిక చేస్తారనే ఆలోచన. టీటీడీ పరిస్థితి చేయి జారిపోతోంది. తిరుమలను కాపాడుకుందాం అన్న కార్యక్రమం ద్వారా ఓ ఆలోచనను తీసుకురావాలని ప్రయత్నిస్తున్నా. తిరుమలలో సామాన్యుడిని స్వామిని చూడనీయడం లేదు. అక్కడికి ఒక ఆస్తికుడు వెళితే బయటికి వచ్చేసరికి నాస్తికుడు అవుతున్నాడు.

ఇవన్నీ పాలకమండలి ఉండడం వల్ల వచ్చే సమస్యలా?

పాలక మండలి కాదు. సేవా మండలి అని ఉండాలి. కానీ అది రాజకీయంగా వెళ్లిపోయింది. కోటీశ్వరుడో సంపన్నుడి చేతికో వెళ్లిపోయింది. మేం దానిని ప్రతిఘటించాం. నేను సీఎంను కలవడం ద్వారా మంచివాళ్లను ఎంపిక చేయాలన్న ఆలోచనను కలిగించానంతే.


అన్నమయ్య బాటలో విప్లవ గీతాలు పాడడానికి శాస్త్రసమ్మతం ఉందా!?

అన్నమయ్య పాటను ఇలా పాడాలనే నొటేషన్‌ లేదు. ఇటీవల ప్రజా నాట్య మండలి వాళ్లు కూడా మంచి కమ్యూనిస్టుకు ఉండవలసిన లక్షణాన్ని ఆధ్యాత్మికతతో ప్రచారం చేస్తున్నారు. అన్నమయ్య సంకీర్తనను ఆశ్రయిస్తున్నారు. ఆధ్యాత్మికం, కమ్యూనిజం వేరు వేరు కాదు. ఆ రెండూ ఒకటే.


త్రిపురనేని రామస్వామి చౌదరిగారు మీ బంధువా?

నాకు ముత్తాతగారు అవుతారు.


మీకు ఐదో ఆరో ప్రపంచ అవార్డులు వచ్చినట్లున్నాయి?

అవునండి. వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌ కూలిపోయిన తర్వాత 2001లో అమెరికాలో నారాయణ నీ నామమే గతి అన్న సంకీర్తన ఆలపించాను. అమెరికాలో ఓసారి వృద్ధాశ్రమానికి వెళ్లాను. అక్కడున్న వృద్ధులందరూ నా చేతులు పట్టుకుని..ఇండియన్స్‌ ఆర్‌ వెరీ గుడ్‌ అని అన్నారు. దాంతో కులమేమిటి? మతమేమిటి? ఉండాల్సింది మానవత్వమే కదా! (ఆర్కే: ఆ తర్వాతేనా మీ పేరులోని చౌదరిని తీసేశారు) అవును. అందుకే తీసేశాను.


అంతేనా.. చౌదరి ఉండడం ప్రతిబంధకంగా భావించారా?

ప్రతిబంధకం లేదు. ఇప్పుడు నాకు ఏ కులం లేదు. సంతోషంగా ఉన్నాను. అందుకే మీరంతా కూడా తీసేయండి శాసి్త్ర, శర్మ.


మీ భర్త మిమ్మల్ని గురు జ్యోతిర్మయి గారూ అని పిలుస్తారు. ఎందుకని?

ఆయనలా పిలవరు. నన్ను ఆయన నాన్నా అంటారు. నేను కన్నా అంటాను.


ఆయన బాగా వండిపెడతారా? ఎప్పుడన్నా?

ఆయనకు వంట రాదండి బాబూ. నేను ఇంకా భయంకరంగా వంట చేస్తా.


సంగీతంలో భాగంగా మీరు జనంతో మమేకమవుతున్నారు. భవిష్యత్తులో రాజకీయాల్లోకి వెళ్లే ఆలోచన ఉందా!?

ఎందుకు రాకూడదు? ఆధ్యాత్మికవేత్తలు తప్పకుండా రావచ్చు. నేను రాజకీయాల్లోకి వస్తానని కాదు. రాందేవ్‌ వంటి వారు పార్టీ పెడితే మద్దతు ఇస్తాను. ఇక, అన్నమయ్య ఆధ్యాత్మికవాది మాత్రమే కాదు. ఆయన సీ్త్రవాది. ఆధ్యాత్మిక కమ్యూనిస్టు. నిజమైన సైంటిస్ట్‌. నిజమైన సోషలిస్ట్‌. నిజమైన టూరిస్టు. నిజమైన అకడమిస్టు..

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.