కట్టడి తప్పారు.. కేసులు పెంచారు..!

ABN , First Publish Date - 2021-04-18T05:39:40+05:30 IST

కొవిడ్‌ నిబంధనలు పాటించాలని అధికారులు చేస్తున్న హెచ్చరికలను జనం ఏమాత్రం పట్టించుకోకపోవడం కేసుల పెరుగుదలకు కారణంగా కనిపిస్తోందని వైద్యులు వెల్లడిస్తున్నారు. శనివారం జిల్లాలో నమోదైన కేసులు అందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. జిల్లాలో కొవిడ్‌ కోరలు చాస్తోంది. పదులు.. ఇరవైలు.. వందలు దాటి వేలకు చేరుకుంది. గడిచిన పది రోజుల్లో మూడు వేల కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.

కట్టడి తప్పారు.. కేసులు పెంచారు..!
ఒంగోలు రిమ్స్‌లో శనివారం కరోనా పరీక్షల కోసం వచ్చిన బాధితులు

ఒకేరోజు 594 మందికి వైరస్‌

ఒంగోలులో అత్యధికంగా 190 పాజిటివ్‌లు

కొవిడ్‌ నిబంధనలపై కనిపించని చైతన్యం  

ఒంగోలు (కార్పొరేషన్‌) ఏప్రిల్‌ 17 : కొవిడ్‌ నిబంధనలు పాటించాలని అధికారులు చేస్తున్న హెచ్చరికలను జనం ఏమాత్రం పట్టించుకోకపోవడం కేసుల పెరుగుదలకు కారణంగా కనిపిస్తోందని వైద్యులు వెల్లడిస్తున్నారు. శనివారం జిల్లాలో నమోదైన కేసులు అందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. జిల్లాలో కొవిడ్‌ కోరలు చాస్తోంది. పదులు.. ఇరవైలు.. వందలు దాటి వేలకు చేరుకుంది. గడిచిన పది రోజుల్లో మూడు వేల కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. శుక్రవారం 491 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, శనివారం ఒక్కరోజులోనే 594 కేసులు నమోదయ్యాయి. అందులోనూ ఒంగోలులోనే అత్యధికంగా 190మందికి వైరస్‌ సోకడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. పట్టణప్రాంతాల్లోనే ఎక్కువమంది వైరస్‌ బారిన పడుతుండగా, ఒంగోలులో ప్రథమ స్థానంలో ఉంది. గత వారం, పదిరోజులుగా పాజిటివ్‌ బాధితుల సంఖ్య 300కు తగ్గడం లేదు. నియంత్రణ కోసం అధికారులు హెచ్చరికలు చేస్తున్నా, జనానికి అవేమీ పట్టడం లేదు. కరోనా భయం బొత్తిగా లేదనే విధంగా రోడ్లపై రయ్‌రయ్‌మంటూ దూసుకెళుతున్నారు. ఒకవైపు పోలీసులు తనిఖీలు నిర్వహించి, పెనాల్టీలు వేస్తున్నా.. జనం మాత్రం అవేమీపట్టనట్లు ఇష్టారాజ్యంగా తిరుగుతున్నారు. భౌతికదూరం పాటించాలని, ప్రతిఒక్కరు మాస్క్‌ ధరించాలని చెబుతున్నా ప్రజల్లో మాత్రం మార్పు కనిపించక పోవడంతో అధికారులు తలలుపట్టుకున్నారు. ఇలా అయితే కరోనా కట్టడి కష్టమే అని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 


594 పాజిటివ్‌ కేసులు 

జిల్లాలో శనివారం కొత్తగా 594 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇటీవల కాలంలో ఇదే అత్యధికం. ఒంగోలులో 190 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, చీరాలలో 42, మార్కాపురంలో 35, అద్దంకిలో 26 కేసులు వెలుగుచూశాయి. అదేవిధంగా కనిగిరి25, కారంచేడులో 24, పర్చూరు 22,నాగులుప్పలపాడు 15,దర్శి 14, వేటపాలెం 12,చీమకుర్తిలో 10మంది వైరస్‌ బారినపడ్డారు. అలాగే శింగరాయకొండ, ఉలవపాడు, దొనకొండ, దోర్నాల, యద్దనపూడి, యర్రగొండపాలెం, సంతనూతలపాడు, మార్టూరు, చిన్నగంజాం, శింగరాయకొండ, కందుకూరు, పొదిలి, జె.పంగులూరు తదితర ప్రాంతాల్లోనూ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 

Updated Date - 2021-04-18T05:39:40+05:30 IST