కూలిన పశు వైద్యశాల భవనం పైకప్పు

ABN , First Publish Date - 2022-08-08T05:46:34+05:30 IST

ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు నానిపోయిన వడ్డాది పశువుల ఆస్పత్రి భవనం పైకప్పు శనివారం రాత్రి ఒక్కసారిగా కూలిపోయింది.

కూలిన పశు వైద్యశాల భవనం పైకప్పు
కూలిపోయిన వడ్డాది పశువుల ఆస్పత్రి భవనం పైకప్పు

- రాత్రి వేళ కావడంతో తప్పిన ప్రమాదం

బుచ్చెయ్యపేట, ఆగస్టు 7: ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు నానిపోయిన వడ్డాది పశువుల ఆస్పత్రి భవనం పైకప్పు శనివారం రాత్రి ఒక్కసారిగా కూలిపోయింది. రాత్రి వేళలో కూలిపోవడంతో పెనుప్రమాదం తప్పింది. శనివారం విధులు ముగించుకుని పశు వైద్యశాల వైద్యాధికారి డాక్టర్‌ కె.నాగశివకుమార్‌ ఇంటికి వెళ్లిపోయారు. వైద్యశాల భవనం పైకప్పు కూలిపోయిందని తెలిసి ఆయన ఆదివారం ఉదయం వచ్చి పరిశీలించారు. ఈ విషయాన్ని పశువైద్యశాఖ ఉన్నతాధికారులకు తెలియజేశారు. జడ్పీటీసీ సభ్యుడు దొండా రాంబాబు, రైతులు కుబిరెడ్డి వెంకటరావు తదితరులు దీనిని పరిశీలించారు. కాగా అద్దె భవనంలో పశువైద్యశాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని ఆ శాఖ జేడీ తెలిపారు. 

ఐదేళ్ల క్రితమే కుంగిన పైకప్పు

ఐదేళ్ల క్రితమే ఈ భవనం పైకప్పు కుంగిపోయింది. భవనం కూలిపోకముందే నూతన భవనం నిర్మించాలన్న రైతుల విజ్ఞప్తి మేరకు గత టీడీపీ ప్రభుత్వం నూతన భవన నిర్మాణానికి రూ.30 లక్షల నిధులను మంజూరు చేసింది. అయితే నిర్మాణ పనులు ప్రారంభించే నాటికి వైసీపీ అధికారంలోకి రావడంతో ఆ పనులను రద్దు చేసింది. దీంతో మంజూరైన నిధులు వెనక్కి వెళ్లిపోయాయి. కనీసం మరమ్మతులైనా చేపట్టాలని రైతులు పలుమార్లు కోరినా ఫలితం దక్కలేదు. 2020లో నాడు-నేడు పథకంలో నూతన భవన నిర్మాణానికి నిధులు మంజూరు అవుతాయని రైతులు ఎదురుచూసినా నిరాశే మిగిలింది. కూలిపోయిన భవనాన్ని తొలగించి, ఆ స్థలంలోనే నూతన భవన నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని పశుసంవర్థకశాఖ అధికారులను రైతులు కోరుతున్నారు. 


Updated Date - 2022-08-08T05:46:34+05:30 IST