కరోనా కమ్మేస్తోంది...

ABN , First Publish Date - 2021-04-17T06:01:24+05:30 IST

దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న దశలో జిల్లాలో కూడా విజృంభిస్తోంది. శుక్రవారం ఒక్కరోజే 491 మంది కరోనా పాజిటివ్‌ అని నిర్ధారణ కావటం అందుకు ఓ ఉదాహరణ . అదే సమయంలో గత మూడు నాలుగు రోజుల్లో ఒంగోలు రిమ్స్‌తో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాలలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్యశాలల్లో జిల్లాయేతర వైద్యశాలల్లో చికిత్సపొందుతున్న వారిలో కూడా పలువురు మృత్యువాతపడ్డారు.

కరోనా కమ్మేస్తోంది...
ఒంగోలు రిమ్స్‌ పరిసరాలను హైపోక్లోరైడ్‌ను పిచికారీ చేస్తున్న సిబ్బంది

ముందస్తు వ్యాక్సిన్‌ లేదు,

మందులు లేవు, ఆక్సిజన్‌కీ కొరత 

అన్నిటికీ మించి వెంటాడుతున్న సిబ్బంది సమస్య 

లెక్కకు మాత్రం పడకలు ఫుల్‌

లెక్కకు చూపని మృతుల సంఖ్య 

పరీక్షలు పెరిగితే బాధితులు పెరిగినట్లే 


(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)

మరోసారి కరోనా ముప్పు ముంచుకొచ్చింది. వారం పదిరోజుల వ్యవధిలోనే జిల్లాలో పరిస్థితి ప్రమాదస్థాయికి చేరింది. బాధితుల సంఖ్య భారీగా పెరిగిపోతుండగా మృత్యువాత పడేవారి సంఖ్యా పెరిగిపోతోంది. ఇటు చూస్తే వ్యాక్సిన్‌ లేకపోగా బాధితులకు వినియోగించాల్సిన మందుల కొరతా పీడిస్తోంది. చివరికి ఆక్సిజన్‌ సమస్యా వచ్చింది. ముఖ్యమంత్రి జగన్‌ చెప్పినట్లు లెక్కకు పడకలు కనిపిస్తున్నా సరిపడా వైద్యసిబ్బంది లేరు, ఉన్నా అన్ని కొరతలతో వైద్యమూ అందటం లేదు. ఇక ప్రైవేటు వైద్యశాలలైతే చాలాచోట్ల ఇంకా చికిత్సలు ప్రారంభించక పోగా ప్రారంభించిన చోట భారీ వడ్డనకు శ్రీకారం పలికారు. ఈ పరిస్థితుల్లోనే కరోనా బారిన పడిన వారిలో మృత్యువాత పడే వారి సంఖ్య పెరిగిపోతుండటం విశేషం. అయితే ప్రభుత్వ వైద్యశాలల్లో మృతిచెందినా అధికారికంగా మృతుల వివరాలు వెల్లడించకుండా అధికారులు గోప్యంగా ఉంచేస్తున్నారు.


దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న దశలో జిల్లాలో కూడా విజృంభిస్తోంది. శుక్రవారం ఒక్కరోజే 491 మంది కరోనా పాజిటివ్‌ అని నిర్ధారణ కావటం అందుకు ఓ ఉదాహరణ . అదే సమయంలో గత మూడు నాలుగు రోజుల్లో ఒంగోలు రిమ్స్‌తో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాలలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్యశాలల్లో జిల్లాయేతర వైద్యశాలల్లో చికిత్సపొందుతున్న వారిలో కూడా పలువురు మృత్యువాతపడ్డారు. బాధితుల సంఖ్య పెరిగే కొద్దీ మృతుల సంఖ్యా పెరుగుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ప్రభుత్వపరంగా పడకల సంఖ్య పెంచేందుకే పరిమితమవుతున్నారు తప్ప అవసరమైన సౌకర్యాలు కల్పించటంలో విఫలమవుతున్నారు. దీనికి తోడు ప్రజలపై పెద్దగా ఆంక్షలు లేకపోవటంతో అనివార్యంగా బయటకొస్తున్న ప్రజలు కరోనా బాధితులుగా మారిపోతున్నారు. ముఖ్యంగా శుక్రవారం నాటి  పరిస్థితిని పరిశీలిస్తే జిల్లాలోని దాదాపు అన్ని పట్టణప్రాంతాలను కరోనా కమ్మేసినట్లుగా కనిపిస్తోంది. ఒంగోలుతోపాటు చీరాల, అద్దంకి, కందుకూరు, గిద్దలూరు లాంటి అన్నిచోట్ల బాధితుల సంఖ్య గణనీయంగా పెరగటం అందుకు నిదర్శనం. 

లెక్కకు రాని మృతులు 

మృతిచెందిన బాధితుల వివరాలను ప్రభుత్వం అధికారికంగా వెల్లడించకపోవటం గమనార్హం. దీంతో సెకండ్‌ వేవ్‌లో వచ్చిన కరోనా ప్రమాదకరం కాదన్న భావన ప్రజల్లో పెరిగిపోవటం కూడా వ్యాధి వేగంగా వ్యాప్తి చెందటానికి కారణమవుతోంది. రెండు రోజుల క్రితం ఒంగోలు డెయిరీలో నిన్న మొన్నటివరకు పనిచేసిన ఓ 57 ఏళ్ల మహిళ కరోనాతో రిమ్స్‌లో చికిత్స పొందుతూనే మృతిచెందారు. అంతకుముందు 47 ఏళ్ల ఇంకో మహిళ కరోనా నిర్థారణ  అయిన మూడవరోజే చికిత్సపొందుతూ మృతిచెందారు. శుక్రవారం కందుకూరుకి చెందిన యువకుడు(37) కరోనాతో మృతిచెందాడు. కరోనా బారిన పడిన అతనిని మెరుగైన చికిత్స కోసం ఒంగోలు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతిచెందాడు. ఇక రోగ లక్షణాలు కనిపించకుండా పాజిటివ్‌ అని నిర్థారణ  అయిన కొన్ని గంటల వ్యవధిలోనే గుండెజబ్బుతో చనిపోయేవారి సంఖ్య పెరిగిపోతోంది. 

పడకలు సరే చికిత్స ఏదీ

ఈ నేపథ్యంలో ప్రభుత్వం పడకల ఏర్పాటుకి ప్రాధాన్యత ఇచ్చిన మాట నిజం. ఒంగోలు రిమ్స్‌తో పాటు అన్ని ప్రధాన ప్రభుత్వ వైద్యశాలలను కొవిడ్‌ వైద్యశాలలుగా మార్చేశారు. ప్రైవేటు వైద్యశాలల్లోను చికిత్సకు అనుమతిచ్చేస్తున్నారు. కానీ అవసరమైన స్థాయిలో చికిత్సకు ఏర్పాట్లు జరగలేదు. నిజానికి రిమ్స్‌లో కూడా అవసరమైన వైద్యసిబ్బంది లేరు. ఇంకోవైపు చాలామంది ప్రైవేటు వైద్యశాలల వారు ఇంకా కొవిడ్‌ చికిత్సను పునఃప్రారంభించలేదు. దీంతో అధికారులు ఆయా వైద్యశాలల్లో పడకలు ఖాళీగా ఉన్నట్లు చూయిస్తున్నా అక్కడ ఏర్పాటే జరగలేదు. చివరికి పేరొందిన ఓ కార్పొరేట్‌ వైద్యశాలలో కూడా కేవలం ఇద్దరు పేషెంట్లు మాత్రమే ఉన్నట్లు అధికారులే వెల్లడించటం గమనార్హం. తద్వారా ఆ వైద్యశాలలో కూడా అవసరమైన స్థాయిలో చికిత్సకు ఏర్పాట్లు జరగలేదని తేటతెల్లమవుతోంది. దీంతో చికిత్స ఉన్న వైద్యశాలల్లోనే పడకల కోసం బాధితులు పోటీపడుతుండటంతో డబ్బు వసూలు కూడా పెరిగిపోయింది. సాధారణ ప్రైవేటు వైద్యశాలల్లో రోగికి ఏడు నుంచి పది వేలు వసూలు చేస్తుండగా కార్పొరేట్‌ వైద్యశాలల్లో అయితే కనీసం రూ.లక్ష అడ్వాన్స్‌ చెల్లిస్తేనే పడకలు కేటాయిస్తున్నారు. భారీగా పెరిగిన ఖర్చుతో సదరు వైద్యశాలపై భారం పెరిగిన మాట నిజమే అయినప్పటికీ సామాన్యులు మాత్రం చికిత్స కోసం తల్లడిల్లిపోతున్నారు. 

వ్యాక్సిన్‌ లేదు - మందులూ లేవు

తీరా చూస్తే కరోనా నివారణకు వచ్చిన వ్యాక్సిన్‌ లేక జిల్లాలో రెండురోజుల నుంచి వ్యాక్సినేషన్‌ నిలిచిపోయింది. మంగళవారం 50వేల డోసుల వ్యాక్సిన్‌ జిల్లాకు రాగా ఆ రోజే జిల్లామొత్తంగా వినియోగించారు. బుధవారం నుంచి జిల్లాలో వ్యాక్సిన్‌ వేయటం లేదు. ఇంకోవైపు కరోనా చికిత్సకు ఉపయోగించే మందుల కొరతా వెంటాడుతోంది. రెమ్‌డెసివర్‌ ఇంజక్షన్‌ బ్లాకులో భారీ ధర పలుకుతోంది. ఒక డోసు ఇంజక్షన్‌ ధర సాధారణ  పరిస్థితుల్లో రూ.3,300లకు విక్రయించారు. ప్రస్తుతం కొరత రావటంతో కొందరు బ్లాకులో రూ. 15వేల నుంచి రూ.20వేల వరకు వసూలు చేస్తున్నారు. కొన్ని ట్యాబ్లెట్లు కూడా అందుబాటులోకి రాలేదు. దీనికితోడు శుక్రవారం మధ్యాహ్నం ఆక్సిజన్‌ కొరత సమస్య వచ్చింది. విశాఖపట్నం నుంచి రావాల్సిన ఆక్సిజన్‌ వచ్చే అవకాశాలు సన్నగిల్లాయని, మీరు అడిగిన స్థాయిలో ఆక్సిజన్‌ సరఫరా చేయలేమని సరఫరాదారులు వైద్యశాలలకు ఉదయం సమాచారమివ్వటంతో అందరూ ఆందోళనలో ఉన్నారు. అయితే సాయంత్రానికి కొంతమేర ఆక్సిజన్‌ రావటంతో పరిస్థితి కొంత కుదుటపడిందంటున్నారు. 


Updated Date - 2021-04-17T06:01:24+05:30 IST