KBCలో పాల్గొని 3.2 లక్షలు గెలుచుకున్న ఈ రైల్వే ఉద్యోగికి ఊహించని షాక్.. సెలవు ఇవ్వకున్నా షోలో పాల్గొన్నాడని..

ABN , First Publish Date - 2021-08-31T00:15:50+05:30 IST

కేబీసీలో పాల్గొన్న రైల్వే ఉద్యోగికి ఊహించని షాక్

KBCలో పాల్గొని 3.2 లక్షలు గెలుచుకున్న ఈ రైల్వే ఉద్యోగికి ఊహించని షాక్.. సెలవు ఇవ్వకున్నా షోలో పాల్గొన్నాడని..

ఇంటర్నెట్ డెస్క్‌: కౌన్ బనేగా కరోడ్‌పతీ షోలో(కేబీసీ) పాల్గొనాలని.. బిగ్ బీ అమితాబ్ బచ్చన్‌‌ను ప్రత్యక్షంగా కలుసుకోవాలని కోరుకోని వారు ఉండరు..!  రైల్వే ఉద్యోగి దేశ్‌బంధూ పాండేకు కూడా సరిగ్గా ఇదే అవకాశం వచ్చింది. దీంతో..ఆయన ఉబ్బితబ్బిబైపోతూ..  ముంబైకి ప్రయాణం కట్టారు. ఆగస్టు 9వ తారీఖు నుంచి 13 వరకూ కేబీసీ షూటింగ్‌లో పాల్గొన్నారు. ఈ క్రమంలో రూ. 3.2లక్షలు గెలుచుకుని.. సంబరపడిపోతూ ఇంటికి తిరిగొచ్చారు! కానీ ఆయనకు అదృష్టం అక్కడివరకే వెంటొచ్చింది.. అసలు టెన్షన్ ఆ తరువాత మొదలైంది!


బిగ్ బీని కలిసిన ఆనందంలో ఇంటికొచ్చిన దేశ్‌బంధూ పాండే‌కు ఆ సంబరం  ఎక్కువరోజులు మిగల్లేదు. ఉరుము లేని పిడుగు లాగా..రైల్వేశాఖ ఇటీవల ఆయనకు భారీ ఝలక్ ఇచ్చింది. అనుమతిలేకపోయినా సెలవు  తీసుకున్నందుకు మూడేళ్ల పాటు ఇంక్రిమెంట్లు నిలిపివేస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేశారు. ముంబై ప్రయాణానికి ముందే దేశ్‌బంధూ సెలవులు కావాలంటూ పైఅధికారులను సంప్రదించారట. కానీ.. ఆయన అభ్యర్థనను వారు పరిగణనలోకి తీసుకోలేదని తెలుస్తోంది. దీంతో.. లీవులు మంజూరు కాకపోయిన ఆయన కేబీసీ షూటింగ్ కోసం ముంబైకి వెళ్లిపోయారు.


షూటింగ్ నుంచి తిరిగొచ్చాక అధికారులు తనపై మోపిన ఆరోపణల చార్జ్ షీట్ చూసుకుని ఆయన ఒక్కసారిగా డీలాపడిపోయారు. ‘‘అనుమతి లేకపోయినా సెలవుపై వెళ్లడమనేది విధి నిర్వహణ పట్ల మీకున్న నీర్లక్ష్యాన్ని సూచిస్తోంది. ఈ కారణంతో మీపై చర్యలు తీసుకోక తప్పదు’’ అంటూ అధికారులు చార్జ్‌షీట్‌లో ఘాటు వ్యాఖ్యలు చేశారు.


దీంతో..తీవ్ర భయాందోళనలకు లోనైన  దేశ్‌బంధూ...  ఈ విషయమై కనీసం స్పందించేందుకు కూడా జంకుతున్నట్టు సమాచారం.  మూడేళ్ల పాటు ఇంక్రిమెంట్లు నిలిచిపోవడమంటే దాదాపు రూ. 1.5 లక్షలు కోల్పోయినట్టేనని రైల్యే వర్గాలు చెబుతున్నాయి.  ఆయన కేవలం రూ. 3.20 లక్షలనే గెలుచుకున్నారు. ఇందులోంచి పన్నుల రూపంలో 30 శాతం వరకూ కోల్పోవాల్సి ఉండటంతో ఆయన చేతికందే మొత్తం తక్కువేనని సమాచారం. ఈ పరిణామం ఆయన కెరీర్‌పై దీర్ఘకాలిక ప్రభావం చూపించే అవకాశం కూడా లేకపోలేదనే వ్యాఖ్యాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశ్‌బంధూ తీవ్ర ఒత్తిడిలో కూరుకుపోయారట. కేబీసీలో పాల్గొనడం ద్వారా లాభానికి కంటే నష్టమే ఎక్కువగా జరిగేటట్టు ఉందని ఆయన ఆవేదన పడుతున్నట్టు తెలుస్తోంది.


అయితే..చార్జ్ షీటులో రైల్వే అధికారులు ఆగస్టు 13వ తారీఖును పేర్కొనడంపై ప్రస్తుతం ఉద్యోగవర్గాల్లో చర్చనడుస్తోంది. దీన్నిబట్టి.. దేశ్‌బంధూ ఎప్పుడు తిరిగొస్తారనేది వారికి ముందే తెలుసనే వాదన తెరపైకి వచ్చింది. సెలవుల గురించి ఆయన పైఅధికారులను సంప్రదించినా మంజూరు కాలేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. 


రైల్వే ఉద్యోగుల సంఘం మద్దతు...

మరోవైపు.. దేశ్‌బంధూ పాండేకు రైల్వే ఉద్యోగుల సంఘం మద్దతు ప్రకటించింది. రైల్వే ఉన్నతాధికారుల వైఖరి సరైనది కాదంటూ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు..న్యాయకోసం ఆయన తరపున పోరాడుతామని ప్రకటించారు. సరైన కారణం చూపించిన ఉద్యోగికి తప్పనిసరిగా సెలవులు మంజూరు చేయాలని పశ్చిమ సెంట్రల్ రైల్వే మజ్దూర్ సంఘ్ డివిజనల్ సెక్రెటరీ అబ్దుల్ ఖలీద్ పేర్కొన్నారు. 


కేబీసీలో పాల్గొనడం పట్ల  రైల్వేకు ఎటువంటి అభ్యంతరాలు ఉండకూడదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇటువంటి అవకాశం వచ్చిన ఉద్యోగిని రైల్వే అభినందించాలని, వెన్నుతట్టి ప్రోత్సహించాలని పేర్కొన్నారు. దీనికి బదులు.. కిందిస్థాయి ఉద్యోగుల నైతికస్థైర్యాన్ని దెబ్బతీసేలా రైల్వే ఉన్నతాధికారులు  వ్యవహరించారని ఆయన మండిపడ్డారు. కాగా.. గతంలోనూ కొందరు రైల్వే ఉద్యోగులు కేబీసీలో పాల్గొన్నారని, అయితే.. ఇటువంటి పరిస్థితి తలెత్తడం ఇదే తొలిసారని మజ్దూర్ సంఘ్ వర్గాలు చెబుతున్నాయి. 

Updated Date - 2021-08-31T00:15:50+05:30 IST