శరవేగంగా తిరునాళ్ల ఏర్పాట్లు

ABN , First Publish Date - 2021-03-06T06:13:17+05:30 IST

ప్రముఖ శైవక్షేత్రం కోటప్పకొండ శ్రీత్రికోటేశ్వర స్వామి సన్నిధిలో మహాశివరాత్రి పండుగ సందర్భంగా 11న జరిగే తిరునాళ్ళకు ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి.

శరవేగంగా తిరునాళ్ల ఏర్పాట్లు
క్యూలైన్‌లకు తాటాకు పందిర్ల నిర్మాణం

ఉచిత, శీఘ్ర, ప్రత్యేక దర్శనాలకు క్యూలైన్‌లు 

నరసరావుపేట, మార్చి5: ప్రముఖ శైవక్షేత్రం కోటప్పకొండ శ్రీత్రికోటేశ్వర స్వామి సన్నిధిలో మహాశివరాత్రి పండుగ సందర్భంగా 11న జరిగే తిరునాళ్ళకు ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. దేశప్రసిద్ధి చెందిన ఈ తిరునాళ్లకు లక్షలాదిగా యాత్రికులు తరలి రానున్నారు. ఇందుకోసం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకోసం ఉచిత, శీఘ్ర, ప్రత్యేక దర్శనం క్యూలైన్‌లను ఏర్పాటు చేశారు. వీటికి తాటాకులో పందిర్లను నిర్మించారు. 9న ఏకాదశి సందర్భంగా త్రికోటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహిస్తారు. ఏకాదశి నుంచి కోటయ్యస్వామి తిరునాళ్ళ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. రెండు లక్షల లడ్లు, లక్ష అరిసె ప్రసాదంను సిద్ధం చేస్తున్నారు. ఆలయ ఈవో రామకోటిరెడ్డి ఆలయం వద్ద ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. 

 తిరునాళ్ల రోజున నరసరావుపేట, చిలకలూరిపేట డిపోల నుంచి సూమారు 430 బస్సులు ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం చిలకలూరిపేట రోడ్డు, ఘాట్‌ రోడ్డు పక్కన ఆర్టీసీ తాత్కాలిక బస్టాండ్లను ఏర్పాటు చేస్తున్నారు. ఆర్‌డబ్ల్యుఎస్‌ శాఖ తాగునీటి సరఫరా, తాత్కాలిక మరుగుదొడ్ల నిర్మాణ పనులను పర్యవేక్షిస్తోంది. ఆర్‌అండ్‌బీ, విద్యుత్‌ విభాగం ఆధ్వర్యంలో కొండ ప్రాంతమంతా ఫ్లడ్‌ లైట్లు ఏర్పాటు చేస్తున్నారు. విద్యుత్‌శాఖ జనరేటర్ల ఏర్పాటుతో పాటు 20 ట్రాన్స్‌ఫార్మర్లను సమకూరుస్తోంది.  భక్తులు తలనీలాలు సమర్పించేందుకు కొండదిగువున షెడ్లు ఏర్పాటు చేస్తున్నారు. చిలకలూరిపేట మేజర్‌ వద్ద స్నాన ఘట్టాలు నిర్వహించనున్నారు.  వైద్య ఆరోగ్య శాఖ వైద్య 9 వైద్య శిబిరాల ఏర్పాట్లలో నిమగ్నమైంది. పోలీసు అధికారులు బందోబస్తు ఏర్పాట్లపై చర్యలు తీసుకుంటున్నారు. రెవెన్యూ, పంచాయతీరాజ్‌, రవాణా, పోలీసు, ఆర్‌డబ్ల్యూఎస్‌, ఆర్‌అండ్‌బీ తదితర శాఖల అధికారులు తిరునాళ్ళ ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అయితే పర్యాటక కేంద్రంలో కాళింది మడుగులో నీరునింపే పనులు ఇంకా ప్రారంభం కాలేదు.  కొండ దిగువున రహదారి విస్తరణ పనులను ఆర్‌ఆండ్‌బీ నిర్వహిస్తోంది. డివైడర్‌ పనులు పూర్తి కాగా వీటిలో మొక్కలు నాటారు. విస్తరణ పనులను వేగవంతం చేయాల్సి ఉంది. 




Updated Date - 2021-03-06T06:13:17+05:30 IST