కోటయ్య దర్శనం భారమే

ABN , First Publish Date - 2021-03-09T06:03:22+05:30 IST

కోటప్పకొండలోని ప్రముఖ శైవక్షేత్రం త్రికోటేశ్వరస్వామి దర్శనం భారంగా మారింది. మహాశివరాత్రి తిరునాళ్ల సందర్భంగా భారీగా భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటారు.

కోటయ్య దర్శనం భారమే
త్రికోటేశ్వరస్వామి దేవస్థానం

టిక్కెట్‌ రేట్లు 50 శాతం పెంపు

ప్రసాదం ధరల్నీ పెంచేసిన అధికారులు

టిక్కెట్‌ ధరల పెంపుదలపై భక్తుల్లో అసంతృప్తి

నేడు త్రికోటేశ్వరస్వామికి ఏకాదశి అభిషేకాలు

కోటప్పకొండ(నరసరావుపేట), మార్చి 8:  కోటప్పకొండలోని ప్రముఖ శైవక్షేత్రం త్రికోటేశ్వరస్వామి దర్శనం భారంగా మారింది. మహాశివరాత్రి తిరునాళ్ల సందర్భంగా భారీగా భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. ఇదే అవకాశంగా దేవస్థాన అధికారులు దర్శనం, అభిషేకం, ప్రసాదం టిక్కెట్‌ రేట్లను భారీగా పెంచేశారు. ఒకే సారి 50 శాతం ధరలను పెంచుతూ ఆలయ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. పెంచిన ధరల వివరాలను ఈవో రామకోటిరెడ్డి సోమవారం తెలిపారు. ప్రత్యేక దర్శనం రూ.100, శీఘ్ర దర్శనం రూ.200గా టికెట్‌ ధరలను నిర్ణయించారు. అభిషేకం టిక్కెట్‌ ధరను రూ.300 నుంచి రూ.500కి పెంచారు. ప్రసాదం ధరలను కూడా పెంచారు. లడ్డు, అరిసె ప్రసాదం ఒక్కొక్కటి రూ.10 నుంచి రూ.15కు పెంచారు. పెంచిన ధరలపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

నేటి నుంచి తిరునాళ్ల ఉత్సవాలు

త్రికోటేశ్వరస్వామి తిరునాళ్ల ఉత్సవాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి.  ఏకాదశి సందర్భంగా త్రికోటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. కోటయ్య స్వామికి విశేష అభిషేకాలు నిర్వహించనున్నారు.  మూలవిరాట్‌ అభిషేకాలకు భక్తులను అనుమతించడంలేదు. అభిషేక మండపంలో స్వామికి అభిషేకాలు చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఒక అభిషేకం టికెట్‌పై ఇద్దర్ని అనుమతిస్తారు. ఏర్పాట్లను ఆలయ ఈవో పర్యవేక్షిస్తున్నారు. ఏకాదశికి ఆర్టీసీ నరసరావుపేట, చిలకలూరిపేట డిపోల నుంచి ప్రత్యేక సర్వీసులను నిర్వహిస్తున్నది. నరసరావుపేట బస్టాండ్‌, చిత్రాలయ సెంటర్‌ నుంచి 25 బస్సులను ఏర్పాటు చేసినట్లు డీఎం షేక్‌ అబ్దుల్‌సలాం తెలిపారు. 

 

Updated Date - 2021-03-09T06:03:22+05:30 IST