కోటప్పకొండ తిరునాళ్లకు పటిష్ట ఏర్పాట్లు

ABN , First Publish Date - 2022-01-22T05:20:15+05:30 IST

ప్రముఖ శైవ క్షేత్రం కోటప్పకొండ శ్రీత్రికోటేశ్వరస్వామి సన్నిధిలో మహాశివరాత్రి సందర్భంగా మార్చి 1న జరగనున్న తిరునాళ్లకు పటిష్ఠ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు.

కోటప్పకొండ తిరునాళ్లకు పటిష్ట ఏర్పాట్లు
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, జేసీ దినేష్‌ కుమార్‌

తాగునీరు, పారిశుధ్యం, ట్రాఫిక్‌పై ప్రత్యేక దృష్టి 

అధికారుల సమీక్షలో ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి, జేసీ

నరసరావుపేట, జనవరి 21: ప్రముఖ శైవ క్షేత్రం కోటప్పకొండ శ్రీత్రికోటేశ్వరస్వామి సన్నిధిలో మహాశివరాత్రి సందర్భంగా మార్చి 1న జరగనున్న తిరునాళ్లకు పటిష్ఠ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు. తిరునాళ్ల ఏర్పాట్లపై ఆలయ ప్రాంగణంలో శుక్రవారం జరిగిన సమీక్షలో అయన మాట్లాడారు. ఫిబ్రవరి 25 కల్లా పనులు పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలన్నారు. అధికారులు సమన్వయంతో పనిచేసి తిరునాళ్ల విజయవంతానికి కృషి చేయాలన్నారు. తాగునీరు, పారిశుధ్యం, ట్రాఫిక్‌ అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. 10 లక్షల మంది తిరునాళ్లకు వస్తారని, స్వామిని 2 నుంచి 2.5 లక్షల మంది దర్శించుకుంటారని ఎవరికీ ఇబ్బందులు కలగని రీతిలో ఏర్పాట్లు చేయాలన్నారు. కొవిడ్‌ నిబంధనలు అమలు చేస్తూ భక్తులు వీలైనంత త్వరగా స్వామి దర్శనం చేసుకునేలా క్యూ లైన్లు నిర్మించాలన్నారు. ధర్మామీటర్లు ఏర్పాటు చేసి ప్రతి భక్తుడిని పరీక్షించాకే దర్శనానికి అనుమతించాలన్నారు. క్యూలైన్లలో గత ఏడాది నెలకొన్న సమస్యలు పునరావృతం కాకుండా ఈసారి చర్యలు తీసుకోవాలన్నారు. దేవస్థానం సమీపింలో కొవిడ్‌ ఐసోలేషన్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలన్నారు. ట్రాఫిక్‌ జామ్‌ కాకుండా గత ఏడాది తీసుకున్నట్లే ఈ ఏడాది కూడా చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు సూచించారు. సీసీ కెమేరాల ఏర్పాటుతో పాటు పోలీసు గస్తీ పెంచాలన్నారు. భక్తులకు మజ్జిగ, తాగునీరు పంపిణీకి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఏర్పాట్లలో పాల్గొనే సిబ్బందికి, అధికారులకు కొవిడ్‌ వచ్చినా పనులు నిలిచిపోకుండా ప్రత్యాన్మాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. రోడ్ల పనులు త్వరతిగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.

భద్రత, ట్రాఫిక్‌, అలంకరణలపై ప్రణాళికలు

కొండకు వచ్చే భక్తుల రద్దీ, భద్రత, ట్రాఫిక్‌, ఆలయ అలంకరణ అంశాలపై ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు వెళ్తామని జేసీ దినేష్‌కుమార్‌ తెలిపారు.  ఫిబ్రవరి 18 జరిగే సమావేశం నాటికి పనులు ముగింపు దశకు చేరుకోవాలని అధికారులను ఆదేశించారు. నరసరావుపేట, చిలకలూరిపేట, వినుకొండ డిపోల నుంచి 450 బస్సులు కొండకు నడపనున్నట్టు ఆర్టీసీ అధికారులు తెలిపారు. 2 వేల మందితో పోలీసు శాఖ బందోబస్తు నిర్వహిస్తుందని అధికారులు చెప్పారు. సమావేశంలో అలయ ట్రస్టీ మల్రాజు రామకృష్ణ కొండలరావు, జడ్పీ సీఈవో గజ్జల శ్రీనివాసరెడ్డి, ఆర్డీవో శేషిరెడ్డి, జడ్పీటీసీ చిట్టిబాబు, కొండకావూరు సర్పంచ్‌ నాగిరెడ్డి, ఆలయ ఈవో రామకోటిరెడ్డి వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-22T05:20:15+05:30 IST